అమీర్‌తో గజిని.. సల్మాన్‌తో ఏం తీస్తాడు?
ఈ చిత్రం 2024 ద్వితీయార్థంలో సెట్స్‌పైకి వెళ్లి 2025 ఈద్‌కు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 19 March 2024 7:44 AM GMTట్యాలెంటెడ్ డైరెక్టర్ AR మురుగదాస్ కొంతకాలంగా స్థబ్ధుగా ఉన్న సంగతి తెలిసిందే. పరిశ్రమ అగ్ర కథానాయకులతో బంపర్ హిట్లు తెరకెక్కించిన మురుగదాస్, చివరిగా రజనీకాంత్ తో దర్బార్ సినిమాని రూపొందించారు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. రెండేళ్ల గ్యాప్ తర్వాత శివకార్తికేయన్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఇంతలోనే ఇప్పుడు సల్మాన్ ఖాన్ - AR మురుగదాస్ కలయికలో ఇటీవల సాజిద్ నదియాడ్‌వాలా సినిమాని ప్రకటించడం సంచలనమైంది.
ఈ చిత్రం 2024 ద్వితీయార్థంలో సెట్స్‌పైకి వెళ్లి 2025 ఈద్‌కు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై మురుగదాస్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ``హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో పాటు, భావోద్వేగాలతో నిండిన కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నామ``ని అన్నారు. శక్తివంతమైన సామాజిక సందేశాన్ని మిళితం చేసాం. ఇది పాన్ ఇండియా సినిమా అవుతుంది. ప్రేక్షకులు ఈ సినిమాలో సల్మాన్ ఖాన్‌ని కొత్త తరహాలో చూస్తారని మురుగదాస్ వెల్లడించారు.
సల్మాన్ - నేను ఈ ప్రాజెక్ట్ గురించి ఐదు సంవత్సరాల క్రితం చర్చించాం. కానీ పరిస్థితుల కారణంగా, మేము ఆ సమయంలో ముందుకు సాగలేకపోయాము. తాజాగా ఆయన మరో కథనం అడిగారు. ఆ తర్వాత ఆ స్క్రిప్ట్ తనకు మంచి ఊపునిచ్చిందని, వెంటనే దాని పని ప్రారంభించగలమా? అని అడిగారు.. అని మురుగదాస్ తెలిపారు. శివ కార్తికేయన్‌తో తన చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత సల్మాన్ ఖాన్ చిత్రం ప్రారంభమవుతుందని కూడా మురుగదాస్ వెల్లడించాడు. ఈ క్రేజీ కలయిక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సల్మాన్ ఖాన్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. చిత్ర తారాగణం సహా ఇతర సిబ్బందికి సంబంధించిన తదుపరి ప్రకటన వెలువడాల్సి ఉంది.
అయితే సల్మాన్ ఖాన్ తో తొలిసారి పని చేస్తున్న మురుగదాస్ ఎలాంటి సినిమా తీస్తాడు? అన్నదానిపై ఎవరికి వారు ఊహాగానాలు సాగిస్తున్నారు. అమీర్ ఖాన్‌తో గజిని తీసాడు.. సల్మాన్‌తో ఏం తీస్తాడు? అంటూ మురుగదాస్ ని ప్రశ్నిస్తున్నారు. ఖాన్ ల త్రయంలో మరో అగ్ర హీరోతో సినిమా అంటే గజిని రేంజును మించిన అద్భుత కథను ఎంపిక చేయాలని సూచిస్తున్నారు. టైగర్ ఫ్రాంఛైజీలో స్పై ఏజెంట్ గా నటించాడు గనుక దానికి భిన్నంగా మురుగదాస్ కథా ఎంపిక సాగాలని పలువురు కోరుకుంటున్నారు.