Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: స‌ల్మాన్ ఖాన్ (Vs) గ్యాంగ్ స్ట‌ర్

ఈ బైక్ షూటర్లు నిఘా క్లిప్‌లో చూపిన విధంగా క్యాప్ ధరించి బ్యాక్‌ప్యాక్ తో క‌నిపించారు. స‌ల్మాన్ ఇంటిపై వారు కాల్పులు జరుపుతున్నట్లు కూడా ఇందులో చూపించారు.

By:  Tupaki Desk   |   15 April 2024 12:35 PM GMT
టాప్ స్టోరి: స‌ల్మాన్ ఖాన్ (Vs) గ్యాంగ్ స్ట‌ర్
X

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కి అత‌డి కుటుంబానికి కంటిమీద కున‌కుప‌ట్ట‌నీకుండా వెంటాడుతున్నాడు గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్. కృష్ణ జింక‌ను వేటాడిన కేసులో త‌మ కుల‌దేవునికి క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోతే ఏ క్ష‌ణ‌మైనా చంపేస్తామ‌ని అత‌డు కొన్నేళ్ల క్రిత‌మే వార్నింగ్ ఇచ్చాడు. ఇప్ప‌టికీ అలాంటి వార్నింగులు ఎన్నో. బిష్ణోయ్ స‌హ‌చ‌రుడు గోల్డీ బ్రార్ ఇప్ప‌టికే స‌ల్మాన్ ని బెదిరిస్తూ ఈమెయిల్ పంపాడు. దీంతో స‌ల్మాన్ ని అత‌డి కుటుంబాన్ని కాపాడేందుకు ముంబై పోలీసుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. నిరంత‌రం అత‌డి ఇంటి చుట్టూ ప‌హారాగా పోలీస్ బ‌ల‌గాలు ప‌ని చేస్తున్నాయి. ఇది ముంబై పోలీస్ కి స‌వాల్ గా మారింది.

ఉన్న‌ట్టుండి ఈ ఆదివారం ఉదయం 5 గంటలకు, ముంబై బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఆ స‌మ‌యంలో స‌ల్మాన్ అతడి కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. అదృష్ట‌వ‌శాత్తూ అంద‌రూ సురక్షితంగా ఉండగా, అతడి ఇంటి గోడకు బుల్లెట్ దిగింది. ఈ ఘ‌ట‌న‌తో బాంద్రా ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. ఆ త‌ర్వాత పోలీసుల ఇన్వెస్టిగేష‌న్ ప్రారంభ‌మైంది. స‌ల్మాన్ ఇంటి వెలుపల భద్రతను పెంచగా, పోలీసులు ఇప్పుడు సిసిటివిలో బంధించిన ఇద్దరు అనుమానితుల ఫోటోని విడుదల చేశారు.

ఈ బైక్ షూటర్లు నిఘా క్లిప్‌లో చూపిన విధంగా క్యాప్ ధరించి బ్యాక్‌ప్యాక్ తో క‌నిపించారు. స‌ల్మాన్ ఇంటిపై వారు కాల్పులు జరుపుతున్నట్లు కూడా ఇందులో చూపించారు. వారిలో ఒకరు తెల్లటి టీషర్ట్ నలుపు జాకెట్‌లో కనిపిస్తుండగా, మరొకరు ఎరుపు రంగు టీషర్ట్‌లో కనిపించారు. సల్మాన్ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న బైక్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల ఫుటేజీతో, మొదటి సమాచార నివేదిక, పీనల్ కోడ్ మరియు ఆయుధ చట్టంలోని సెక్షన్ 307 (హత్య ప్రయత్నం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు బాంద్రా పోలీసు అధికారి తెలిపారు. ఈ ఫోటో ఆధారంగా వీరిద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇద్దరు షూటర్లకు సంబంధించి కేంద్ర ఏజెన్సీలకు కూడా ముఖ్యమైన ఆధారాలు లభించాయి.

కాగా లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఈ కాల్పులకు బాధ్యులం తామేన‌ని పేర్కొన్నారు. అతడు ఇలా రాసాడు. ``మాకు శాంతి కావాలి. అణచివేతకు వ్యతిరేకంగా ఏకైక నిర్ణయం యుద్ధం అయితే అది ఇలాగే ఉంటుంది. సల్మాన్ ఖాన్, మా బలం ప‌రిమాణాన్ని మీరు అర్థం చేసుకోవడానికి .. దానిని పరీక్షించకుండా ఉండటానికి మేము మీకు ట్రైలర్‌ను మాత్రమే చూపించాము. ఇది మొదటిది మరియు చివరి హెచ్చరిక. ఇంటి బయట మాత్రమే కాల్పులు జ‌ర‌పం. మీరు దేవుళ్లుగా భావించే దావూద్ ఇబ్ర‌హీం, చోటా షకీల్ ని మించిన కుక్క‌లు మా ద‌గ్గ‌ర ఉన్నాయి. ఇక‌పై అంత స‌మ‌యం తీసుకోం`` అని రాసారు.

అయితే ముంబై ప్ర‌భుత్వం స‌హా ముంబై పోలీస్ శాఖ ఈ వ్య‌వ‌హారంపై హై అలెర్ట్ అయింది. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి నేరుగా స‌ల్మాన్ ని ప‌రామ‌ర్శించి.. చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊపేక్షించేది లేద‌ని బిష్ణోయ్ గ్యాంగ్ ల‌కు వార్నింగ్ ఇచ్చారు. స‌ల్మాన్ కి అత‌డి కుటుంబానికి అవ‌స‌రం మేర భ‌ద్ర‌త‌ను పెంచుతున్నామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఇంటి ముందు ప‌హారా తీవ్ర‌త‌ర‌మైంది. మ‌రోవైపు కాల్పులు జ‌రిగిన కొన్ని గంట‌ల్లోనే సల్మాన్ ఖాన్ తండ్రి స‌లీమ్ ఖాన్ య‌థాత‌థంగా మోర్నింగ్ వాక్ కి వెళ్లారు. త‌మ‌కు ఏమీ కాలేద‌ని, అభిమానులు చింత‌కు గురి కావ‌ద్ద‌ని కూడా స‌లీంఖాన్ మీడియాకి సందేశం ఇచ్చారు. ఘ‌టన అనంత‌రం స‌ల్మాన్ ఖాన్ ప‌రిశ్ర‌మ స్నేహితులు, రాజకీయ ప్ర‌ముఖులు కూడా అత‌డిని ప‌రామ‌ర్శించేందుకు విచ్చేశారు. మ‌రోవైపు స‌ల్మాన్ ఖాన్ త‌న‌కు పెరిగిన థ్రెట్ దృష్ట్యా ఈ ఏప్రిల్ లో మ‌రో ఖ‌రీదైన బుల్లెట్ ప్రూఫ్ కార్ కొనుక్కున్నాడు. అంత‌కుముందే అత‌డికి బుల్లెట్ ప్రూఫ్ కార్ ఉంది. కానీ ఇప్పుడు ఇంకా ఖ‌రీదైన కార్ ని కొనుగోలు చేసాడ‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

ఈ గొడ‌వంతటికీ మూలం- ఈగో. స‌ల్మాన్ క్ష‌మాప‌ణ చెప్ప‌డు.. గ్యాంగ్ స్ట‌ర్ బిష్ణోయ్ బెదిరింపులు ఆప‌డు.. ఈ పోరాటంలో చివ‌రికి ముగింపు ఎలా ఉంటుందోన‌నే ఆందోళ‌న ప్ర‌జ‌ల్లో ఉంది. ఇక పోలీసుల‌కు అయితే కంటికి కునుకుప‌ట్ట‌డం లేదు. ముంబై పోలీసులు దీనిని స‌వాల్ గా తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఉంది.