తనపై కాల్పులు జరిగేప్పుడు స్టార్ హీరో ఏం చేసాడు?
కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నివశిస్తున్న బాంద్రా ఇంటిపై కొందరు దుండగులు తుపాకులతో దాడి చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 13 Jun 2024 6:28 AM GMTకొద్దిరోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నివశిస్తున్న బాంద్రా ఇంటిపై కొందరు దుండగులు తుపాకులతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సల్మాన్ ఇంట్లో ఏం చేస్తున్నారు? అన్నదానికి ఇప్పుడు పోలీసుల ముందు వాంగ్మూలం నమోదైంది.
కాల్పుల ఘటన జరిగినప్పుడు తాను నిద్రపోతున్నానని, తుపాకీ కాల్పులకు మేల్కొన్నానని సల్మాన్ ఖాన్ చెప్పారు. సల్మాన్ అతడి సోదరుడు అర్బాజ్ ఖాన్ స్టేట్‌మెంట్‌లను పోలీసులు రికార్డ్ చేశారు
బాంద్రాలోని తన ఇంటి బయట జరిగిన కాల్పుల ఘటనలో వాంగ్మూలాలను ముంబై పోలీసులు బుధవారం రికార్డు చేశారు. సల్మాన్‌తో పాటు అతని సోదరుడు అర్బాజ్ ఖాన్ వాంగ్మూలాన్ని కూడా వారి బాంద్రా నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో తీసుకున్నారు. పిటిఐలోని ఒక కథనం ప్రకారం.. నలుగురు సభ్యుల క్రైమ్ బ్రాంచ్ బృందం వారి ఇంటికి వెళ్లి నాలుగు గంటలకు పైగా సల్మాన్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది. అర్బాజ్ వాంగ్మూలాన్ని రెండు గంటలకు పైగా రికార్డ్ చేశారు. ఇద్దరిని పోలీసులు దాదాపు 150 ప్రశ్నలు అడిగారని తెలుస్తోంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని సల్మాన్ అంగీకరించినట్లు ఓ అధికారి పిటిఐకి తెలిపారు. కాల్పుల ఘటన జరిగిన ఏప్రిల్ 14న తాను ఇంట్లోనే ఉన్నానని సల్మాన్ తన వాంగ్మూలంలో పోలీసులకు తెలిపాడు. కాల్పులకు ముందు రోజు రాత్రి ఆలస్యంగా తిరిగి వచ్చానని, ఘటన జరిగినప్పుడు నిద్రపోతున్నానని చెప్పాడు. కాల్పులు జరగడంతో నిద్ర లేచాడు.
ఘటన జరిగినప్పుడు తాను జుహు నివాసంలో ఉన్నానని ఆర్భాజ్ ఖాన్ తెలిపారు. అయితే తన సోదరుడిపై గతంలో బెదిరింపులు వచ్చిన విషయం తనకు తెలిసినందున తన స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు రికార్డ్ చేశారని అర్బాజ్ చెప్పాడు. హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం.. ఇంతకుముందు ఎవరో తమ ఇంటి వెలుపల బెదిరింపు నోట్‌ను వదిలిపెట్టి పన్వెల్‌లోని వారి ఫామ్‌హౌస్‌లో రెక్కీ చేసినందున ..ఈ వరసలో ఇది మూడవ సంఘటన అని అర్బాజ్ చెప్పారు. ఇంతకుముందు ఎవరో వారి ఇంటి బయట బెదిరింపు నోట్‌ను వదిలివెళ్లారు. బిష్ణోయ్ ముఠా సభ్యులు వారి పన్వెల్ ఫామ్‌హౌస్‌లో రెక్కీ నిర్వహించారు. ఇది (కాల్పులు) మూడో ఘటన.. పోలీసులు దీనిని సీరియస్‌గా తీసుకోవాలి... అని ఆర్భాజ్ అన్నారు. దర్యాప్తులో భాగంగా సల్మాన్ ఖాన్ అతని సోదరుడు అర్బాజ్‌ల వాంగ్మూలాలను రికార్డ్ చేసామని ఒక పోలీస అధికారి గతంలో వెల్లడించారు. ఏప్రిల్ 14 ఉదయం నటుడి బాంద్రా నివాసం వెలుపల నాలుగు రౌండ్లు కాల్పులు జరిపిన సంఘటనల క్రమాన్ని వారు ధృవీకరించారని అన్నారు.
గతంలో కూడా సల్మాన్‌ను బెదిరించి జైలుకెళ్లిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఆదేశాల మేరకు ఈ దాడి జరిగిందని క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ ప్రస్తుతం సబర్మతి జైలులో ఉన్నాడు. 1998లో హమ్ సాథ్ సాథ్ హై షూటింగ్ సమయంలో కృష్ణజింకను కాల్చి చంపినందుకే తాను నటుడు సల్మాన్ ఖాన్ ని లక్ష్యంగా చేసుకున్నానని బిష్ణోయ్ పేర్కొన్నాడు. అయితే బిష్ణోయ్ సినీ నటుడిని బెదిరించి పాపులారిటీ సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాడని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ నెల ప్రారంభంలో, నవీ ముంబై పోలీసులు పన్వెల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో సల్మాన్‌ని టార్గెట్ చేయడానికి ప్లాన్ చేసిన బిష్ణోయ్‌తో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.