మయోసైటిస్‌తో సాహసోపేతమైన జర్నీపై సమంత
ఓ స్త్రీ విడాకులు తీసుకుంటే, దానితో పాటే చాలా అవమానం, కళంకం అంటగడతారు.
By: Tupaki Desk | 27 Nov 2024 5:59 AM GMTవ్యక్తిగతంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సమంతా రూత్ ప్రభు సాహసోపేతమైన ప్రయాణం స్ఫూర్తిని నింపుతోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సామ్ ఊహించని కొత్త సవాళ్లను ఎదుర్కొంది. ఇటీవల గలాట్టా ఇండియా ఇంటర్వ్యూలో విడాకులపై సామాజిక తీర్పు, కళంకం, భావోద్వేగాల గురించి సమంతా మాట్లాడారు.
ఓ స్త్రీ విడాకులు తీసుకుంటే, దానితో పాటే చాలా అవమానం, కళంకం అంటగడతారు. నన్ను సెకం* హ్యాం*.. అని.. యూజ్డ్ అని లెక్కలేనన్ని కామెంట్లు చేసారు. వృథా జీవితం.. అపరాధం అంటూ అవమానించి సమాజం ఒక మూలకు నెట్టివేస్తుంది. ఇది కుటుంబాలకు కూడా చాలా కష్టం... అని తన ఆవేదనను వ్యక్తం చేసారు.
వ్యక్తిగత జీవితాల్లో పురుషుల కంటే స్త్రీలు ప్రజల నుంచి కఠినమైన పరిశీలనను ఎదుర్కొంటారని అన్నారు. కొన్నేళ్లుగా నేను నా జీవితం గురించి అవాస్తవ కథనాలను చదివాను. చాలా సార్లు నేను మాట్లాడాలని, నిజం చెప్పాలని అనుకున్నాను.. కానీ వెనక్కి తగ్గాను. నేను నాతో నేను మాట్లాడుకున్నాను. కథను మీ వైపు చెప్పడం ద్వారా మీరు ఏం పొందాలనుకుంటున్నారు? మద్దతు ఒకవైపే ఉండవచ్చు.. ఈరోజు మీకు మద్దతిచ్చే వ్యక్తులు రేపు చిన్న కారణంతో మీకు వ్యతిరేకంగా మారవచ్చు.. అని కూడా సమంత ఇంటర్వ్యూలో అన్నారు.
నేను విడాకులు తీసుకున్నాను. నా జీవితం ఒక అద్భుత కథ కాదు కానీ దాని అర్థం ``నేను ఒక మూలన కూర్చుని ఏడుస్తూ ఉంటాను`` అని కాదు. ఇది నా మార్గం.. కానీ నా జీవితం ఇక్కడితో ముగియదు అని కూడా వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం సమంత వ్యక్తిగతంగా చాలా కోలుకుని వృత్తిపరంగానూ దూసుకువెళుతున్న సంగతి తెలిసిందే.
మయోసైటిస్ అలా మొదలైంది:
మరో ఇంటర్వ్యూలో మయోసైటిస్ గురించి మాట్లాడుతూ.. ఈ రుగ్మత ఎలా మొదలైందో ఆరంభం అర్థం కాలేదని అన్నారు. కరణ్ జోహార్ తో `కాఫీ విత్ కరణ్` షోని పూర్తి చేసుకుని హైదరాబాద్ కి వచ్చేశానని, ఖుషి షూటింగుకి వచ్చానని సమంత అన్నారు. కానీ అక్కడ నీరసంగా అనిపించింది. శరీరం పని చేయనట్టు షట్ డౌన్ అయిపోయింది. ఆ తర్వాతా ఆ సమస్యను పెద్దగా ఎదుర్కొన్నాను. నెమ్మదిగా మయోసైటిస్ అని తెలిసింది అని సమంత తెలిపారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు.. కోలుకోవడానికి చాలా సమయం పడుతోంది. ఇంకొంత కాలం పట్టొచ్చని కూడా సమంత అన్నారు.