ఆడ - మగ ఎవరైనా సమానంగా పారితోషికాలిస్తాను: సమంత
సినీపరిశ్రమలో పారితోషికాల పరంగా, సౌకర్యాల పరంగా, గౌరవం పరంగా పురుషాధిక్యత గురించి చాలా కాలంగా చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 4 Feb 2025 4:30 PM GMTసినీపరిశ్రమలో పారితోషికాల పరంగా, సౌకర్యాల పరంగా, గౌరవం పరంగా పురుషాధిక్యత గురించి చాలా కాలంగా చర్చ సాగుతోంది. మేల్ డామినేటెడ్ ప్రపంచంలో స్త్రీలకు తగిన గౌరవం దక్కడం లేదని, అవమానాలు ఎదురవుతున్నాయని, పారితోషికాల్లో తక్కువ చేస్తున్నారని చాలా మంది కథానాయికలు బహిరంగంగా వాపోయారు. హీరోలకు సమానంతా తమకు కూడా పారితోషికాలివ్వాలని నటీమణులు డిమాండ్ చేస్తున్నారు. ఆడ మగ వ్యత్యాసాలు.. భత్యంలో హెచ్చతగ్గులు వంటివి పూర్తిగా సమసిపోవాలని చాలా మంది ఆకాంక్షించారు. ఇటీవల హేమ కమిటీ (మాలీవుడ్) నివేదికలోను ఇలాంటి విషయాల ప్రస్థావన ఉంది.
పారితోషికాల్లో వ్యత్యాసం గురించి అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు కూడా గతంలో ప్రస్థావించారు. పారితోషికంలో మేల్ డామినేషన్ ని ప్రశ్నించారు. తాజాగా మరోసారి పారితోషికాల్లో ఆడా మగా వ్యత్సాసం గురించి అసంతృప్తిని వ్యక్తం చేసారు. ఇండస్ట్రీలో నాతో పాటు నటించిన సహచరులతో పోలిస్తే నాకు తక్కువ పారితోషికం ఇచ్చారని సమంత అన్నారు. నాకు అనుభవం చాలా ఉన్నా కానీ తక్కువ భత్యం చెల్లించారు. ఇది నా నిర్మాణ సంస్థలో జరగకూడదు అనుకున్నాను. నేను ఆడా మగా సమానత్వం చూస్తాను. మా నిర్మాణ సంస్థలో అందరికి ఒకే రకంగా చెల్లింపులు ఉంటాయి. నేను అనుభవించింది ఇంకో స్త్రీ అనుభవించకూడదు. మా సంస్థలో ఆడా మగా సమానంగా ఉండేలా చూస్తాను అని తెలిపింది.
అయితే సమంత వ్యాఖ్యలపై నెటిజనుల్లో డిబేట్ స్టార్టయింది. పారితోషికాలు అనేవి స్టార్ల మార్కెట్ రేంజును బట్టి ఉంటుంది. హీరోని చూసి మాత్రమే టికెట్లు తెగుతున్నాయి. ఒకవేళ హీరోయిన్ ని చూసి లేదా ఐటమ్ భామను చూసి టికెట్లు తెగితే దానికి తగ్గట్టుగా వారు కూడా పారితోషికాలు అందుకుంటున్నారు కదా? అని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈరోజుల్లో ఆలియా, కరీనా కపూర్, దీపిక పదుకొనే లాంటి కథానాయికలు మేల్ స్టార్లకు సమానంగా పారితోషికాలు తీసుకుంటున్నారు. 20 కోట్ల రేంజులో పారితోషికాలు అందుకుంటున్న హీరోయిన్‌లు ఉన్నారు. కేవలం 5 నిమిషాల ఐటమ్ నంబర్ కోసం హీరోయిన్లకు 3 కోట్ల పారితోషికాలు ఇవ్వడం ఆషామాషీ కాదు కదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది తక్కువ చేసి చూడటం కాదు కదా? అని కొందరు నిలదీస్తున్నారు. బిజినెస్ ఎవరు తేగలరో వాళ్లే ఇక్కడ కింగ్! అని గుర్తు చేస్తున్నారు. అలాగే తన నిర్మాణ సంస్థలో మహిళల భద్రత తన బాధ్యత అని సమంత అన్నారు. ఇలాంటి మంచి విషయాలు మార్పులు అవసరమని సమర్థించారు. పరిశ్రమ అంటే ఇల్లు. ఆ ఇంటిని శుభ్రం చేసే బాధ్యత సమంతకు ఉందని అన్నారు.