వేతనాల్లో సమానత్వం.. సమంతపై నందిని రెడ్డి ప్రశంసలు
సమంత రూత్ ప్రభు తన సొంత బ్యానర్ లో సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 March 2025 8:56 AM ISTసమంత రూత్ ప్రభు తన సొంత బ్యానర్ లో సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ లో ఎన్నడూ లేని విధంగా తన బ్యానర్ లో పని చేసే ఆడా మగా నటీనటులకు సమాన వేతనాలు చెల్లిస్తానని ప్రకటించి ఆశ్చర్యపరిచింది. నిజానికి మేల్ స్టార్స్ కి ఉండే పారితోషికాలు ఫీమేల్ స్టార్స్ కి ఉండవు. కానీ సమంత ఈ రూల్ ని బ్రేక్ చేస్తానని భరోసా కల్పించారు.
అలాగే సమంత బ్యానర్ లో రెగ్యులర్ స్టార్ హీరోలతో సినిమాలు ఉండవు. ఇందులో ప్రతిభావంతులకు ప్రయోగాత్మక కంటెంట్ ఉన్న సినిమాల్లో అవకాశాల్ని కల్పిస్తారు. డిసెంబర్ 2023లో త్రలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించిన సమంత ఆ సమయంలో ఇన్‌స్టాలో సామ్ ఇలా రాసింది. త్రలాలా మూవింగ్ పిక్చర్స్ మోడ్రన్ డే సినిమాలు తీస్తుంది. నేటితరం ఆలోచనలను ప్రతిబింబించే కంటెంట్‌ను రూపొందించే లక్ష్యం పెట్టుకుంది. మన సామాజిక నిర్మాణం బలం, సంక్లిష్టతను మాట్లాడే కథలను ఆహ్వానించి ప్రోత్సహించే ఒక స్థలం ఇది. అర్థవంతమైన, ప్రామాణికమైన కథలను చెప్పడానికి ఫిలింమేకర్స్ కి ఇది ఒక వేదిక`` అని సమంత వ్యాఖ్యానించారు.
త్రలాలా మూవింగ్ పిక్చర్స్ వేతన అసమానతను పరిష్కరిస్తుందని కూడా సమంత ప్రకటించారు. సమంత, నయనతార, త్రిష, రమ్య వంటి దక్షిణాది తారలు తమకు కూడా మార్కెట్ ఉందని నిరూపించారు. కానీ దక్షిణాది చిత్ర పరిశ్రమలోని నటులకు ఇది సులువేమీ కాదు. ఇటీవల బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్, ఆస్కార్ అవార్డు గ్రహీత నిర్మాత గుణీత్ మోంగా కూడా హిందీ చిత్ర పరిశ్రమలో పురుషాధిక్యత పారితోషిక వ్యత్యాసాల గురించి మాట్లాడారు. దీనిని పరిష్కరించాలని కోరారు.
తాజాగా ఓ సమావేశంలో సమంతతో తదుపరి చిత్రానికి ప్లాన్ చేస్తున్న దర్శకురాలు నందిని రెడ్డి వేతన అసమానత ను పరిష్కరించేందుకు తన స్నేహితురాలు సమంత కృషి గురించి మాట్లాడారు. సమంతకు చెందిన త్రలాలా మూవింగ్ పిక్చర్స్ తన మొదటి ప్రొడక్షన్ లో పనిచేసిన ప్రతి ఒక్కరికీ వేతన సమానత్వాన్ని హామీ ఇచ్చానని తనతో చెప్పారని నందిని రెడ్డి వెల్లడించారు. `బంగారం`లో ప్రధాన పాత్ర పోషించిన సమంత తన బ్యానర్ చిత్రానికి వేతన సమానత్వాన్ని హామీ ఇచ్చిన మొదటి భారతీయ స్టార్ కావచ్చు.. అని అన్నారు. బెంగళూరులో జరుగుతున్న అంతర్జాతీయ సినిమా ఉత్సవాల్లో ఒక ప్యానెల్ చర్చలో దీనిని నందినిరెడ్డి వెల్లడించారు. ప్యానెల్ పాల్గొన్న కన్నడ స్టార్ రమ్య - డివోపీ ప్రీత జయరామన్ కూడా సమంత ప్రయత్నాన్ని ప్రశంసించారు.
మహిళా దర్శకులకు ఉన్న సవాళ్ల గురించి దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ.. తమను తాము నిరూపించుకోవడానికి .. నిర్మాతలకు కథలు చెప్పి ఒప్పించేందుకు మగ దర్శకుల కంటే రెండింతలు అధికంగా మహిళా దర్శకులు కష్టపడి పనిచేయాలని చెప్పారు. సినిమాలు విఫలమైనా మేల్ డైరెక్టర్లను క్యూలో ఉంచే నిర్మాతలున్నారు. మహిళా దర్శకుల విషయంలో అలా జరగదని అభిప్రాయపడ్డారు. ``ప్రతి శుక్రవారం ముఖ్యం. సక్సెస్ నిర్ణయిస్తుంది. నాలుగు సంవత్సరాలలో ఒక పురుష దర్శకుడు ఏమి సాధిస్తాడో, దానిని సాధించడానికి ఒక మహిళా దర్శకురాలికి ఎనిమిది సంవత్సరాలు పడుతుంది. వేతన అసమానత ఒక స్పష్టమైన వాస్తవం`` అని అన్నారు. జబర్ధస్త్, ఓ బేబి తర్వాత నందిని రెడ్డి మరోసారి సమంతతో కలిసి పని చేయనున్నారు.