సమంత డిమాండ్ పై త్వరలోనే స్పందన?
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గతంలో వేసిన సబ్ కమిటీ నివేదికను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సమంత కోరిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 7 Sep 2024 12:48 PM GMTతెలుగు చలన చిత్ర పరిశ్రమలో గతంలో వేసిన సబ్ కమిటీ నివేదికను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సమంత కోరిన సంగతి తెలిసిందే. మాలీవుడ్ లో జస్టిస్ హేమ కమిటీ నివేదిక దేశ వ్యాప్తంగా సంచలనమైన వేళ సమంత ఈ డిమాండ్ ని తెరపైకి తెచ్చింది. ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతోన్న లైంగిక దాడుల్ని అరికట్టాలంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో కమిటీలు వేసిన ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు నటీమణులు డిమాండ్ చేసారు.
మరి సమంత డిమాండ్ పై రేవంత్ సర్కార్ నివేదిక రిలీజ్ కి రెడీ అవుతుందా? ఇండస్ట్రీలో రేవంత్ మార్క్ రూలింగ్ హైలైట్ అవ్వాలంటే ఇదే సరైన సమయంగా భావిస్తున్నారా? ఇండస్ట్రీపై కొరడా ఝుళిపిం చడానికి రెడీ అవుతున్నారా? అంటే అవుననే విశ్వసనీయ సమాచారం అందుతోంది. సమంత డిమాండ్ అధికారుల దృష్టి కి వెళ్లడంతో విషయాన్ని సీఎం రేవంత్ చెవిన వేసినట్లు రాజకీయ వర్గాల్లో గుస గుస మొదలైంది.
అప్పటి టీఆర్ ఎస్ ప్రభుత్వం వేసిన కమిటీ ఇండస్ట్రీలో ఎలాంటి పురోగతి సాధిచిందో తెలియాలంటే సబ్ కమిటీ నివేదకను అధికారికంగా రిలీజ్ చేయకపోయినా లోగుట్టుగా దాని సంగతేంటో తేల్చాలని ఆయా పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీస్తోందిట. అయితే ఇది ఎంతో సున్నితమైన అంశం. ఇలాంటి నివేదికలు చాలా విషయాల్ని పరిగణలోకి తీసుకుని రిలీజ్ చేస్తుంటారు. కన్నడలో హేమ కమిటీ లాంటిది రావాలని కొంత మంది నటీమణులు డిమాండ్ చేయగా పరిశ్రమ అలాంటి కమిటీలు అవసరం లేదని భావించింది.
గతంలో జరిగిన విషయాలకు..మాలీవుడ్ కమిటీ నివేదికకు సంబంధం ఏంటనే అంశాన్ని లేవనెత్తారు. మరి టాలీవుడ్ లో ఇలాంటి అంశం తెరపైకి వస్తుందా? లేదా? సమంత డిమాండ్ మేరకు సబ్ కమిటీ నివేదికను రిలీజ్ చేస్తారా? అన్నది చూడాలి. ఇండస్ట్రీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కాస్త నెగిటివ్ గానే ఉన్నారనే ప్రచారంలో ఉంది. గద్దర్ అవార్డ్ లపై ఇండస్ట్రీ నుంచి సానుకూలంగా స్పందన రాకపో వడంతో రేవంత్ అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
అలాగే చిత్ర పరిశ్రమకు చెందిన అక్కినేని నాగార్జున ఎన్ -కన్వెన్షన్ ని రేవంత్ సర్కార్ అక్రమ కట్టడంగా కూల్చి వేసిన ఉదంతం పలు సందేహాలకు తావిస్తోంది. మరి ఇలాంటి సమయంలో సమంత డిమాండ్ చేసిన నివేదిక రేవంత్ ప్రభుత్వం రిలీజ్ చేస్తే అతి పెద్ద సంచలనమే అవుతుంది.