దశాబ్ధ కాలంలో సమంత సంపాదించిన ఆస్తులు?
ఏమాయ చేశావే సినిమాతో కథానాయికగా ఆరంగేట్రం చేసింది సమంత. ఇదే చిత్రం తమిళంలో విన్నయ్ తాండి వరువాయ పేరుతో విడుదలైంది.
By: Tupaki Desk | 29 April 2024 11:13 AM GMTఏమాయ చేశావే సినిమాతో కథానాయికగా ఆరంగేట్రం చేసింది సమంత. ఇదే చిత్రం తమిళంలో విన్నయ్ తాండి వరువాయ పేరుతో విడుదలైంది. గౌతమ్ మీనన్ ఈ ప్రతిభావనిని వెండితెరకు పరిచయం చేయగా ఆరంగేట్రమే బ్లాక్ బస్టర్లు అందుకుంది. అటుపై సామ్ కెరీర్ జర్నీ సునాయాసంగా 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు.. అన్నిటినీ అధిగమించి విజయవంతమైన కథానాయికగా, అగ్ర నాయికగా తన హోదాను నిలబెట్టుకుంది. వ్యక్తిగతంగా నాగచైతన్యతో బ్రేకప్.. మయోసైటిస్ వంటి రుగ్మతలు తనను ఇబ్బంది పెట్టినా కానీ అవేవీ తన ఎదుగుదలను ఆపలేదని చెప్పాలి. 2010లో కెరీర్ ప్రారంభించిన సమంత ఈ 14 సంవత్సరాల్లో ఎంత సంపాదించింది? అంటే.. దానికి సమాధానం వచ్చింది. ఇప్పటికి సామ్ దాదాపు 100 కోట్లు పైగా ఆస్తులను కూడగట్టినట్టు కథనాలొస్తున్నాయి. సుమారు 120 కోట్ల మేర నికర ఆస్తులను కూడగట్టిందని తెలుస్తోంది.
నేడు తన పుట్టినరోజు సందర్భంగా సమంత నికర ఆస్తుల గురించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. కథానాయికగా పారితోషికాలు.. బిజినెస్ ఉమెన్ గా ఆర్జనలు, బ్రాండ్ పబ్లిసిటీ వగైరా ఆదాయాలను కలుపుకుంటే సామ్ ఆస్తులు ఇంత పెద్ద మొత్తానికి పెరిగాయి. దశాబ్దానికి పైగా కెరీర్‌లో సమంత దక్షిణ భారతదేశంలోని ప్రముఖ నటీమణులలో ఒకరిగా తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరుచుకుని ఒక్కో సినిమాకు 3-4 కోట్ల రేంజులో అందుకుంటోంది. సమంత అంచనా నికర ఆస్తుల విలువ రూ. రూ. 120 కోట్లు. తన పారితోషికాలను రియల్ వెంచర్లలోను పెట్టుబడులుగా పెట్టింది. అలాగే ఫ్యాషన్ రంగంలోను సొంత లేబుల్ తో ముందుకు సాగుతోంది.
సమంతకు ఖరీదైన కార్లు అంటే చాలా మక్కువ. లగ్జరీ కార్ల సేకరణలో రూ. 3.30 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ జి63 ఎఎమ్‌జి, రూ. 2.26 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్, రూ. 1.46 కోట్ల విలువైన పోర్షే కేమాన్ జిటిఎస్, రూ. 72 లక్షలకు జాగ్వార్ ఎక్స్‌ఎఫ్, రూ. 87 లక్షల ఖరీదు ఆడి ఉన్నాయి. రూ. 1.70 కోట్లకు బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కార్ తన సొంతం చేసుకుంది.
రియల్ పెట్టుబడులు..
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని విలాసవంతమైన ఇంటిలో సమంత నివశిస్తోంది. ఈ ఇంటి విలువ సుమారు 20కోట్లు ఉంటుందని అంచనా. అలాగే ముంబైలోని రూ. 15 కోట్ల విలువైన 3BHK సీఫేసింగ్ అపార్ట్‌మెంట్‌లో పెట్టుబడి పెట్టినట్లు కథనాలొచ్చాయి. ముంబై పరిశ్రమలో కెరీర్ దృష్ట్యా అక్కడ సొంతంగా ఒక ఇంటిని సమకూర్చుకున్నారు. సమంతకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా పలుచోట్ల అపార్ట్ మెంట్లు ఉన్నాయని కథనాలొచ్చాయి. సమంతా ఫ్యాషన్ రంగంలో అద్భుతమైన అభిరుచిని కలిగి ఉంది. లూయిస్ విట్టన్, గూచీ .. చానెల్ వంటి హై-ఎండ్ బ్రాండ్‌లకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తుంది. వీటి విలువ లక్షల్లో ఉంటుంది. తన విలాసవంతమైన జీవనశైలికి తగ్గట్టుగానే సమంత ఖరీదైన వాచ్ లు, ఆభరణాలను కూడా సొంతం చేసుకుంది.
ప్రత్యూషతో సేవా కార్యక్రమాలు:
తన సొంత ఫ్యాషన్ లేబుల్ సాకిని 2020లో ప్రారంభించింది. మిస్ ఇండియా 2016 ఒకటవ రన్నరప్‌గా నిలిచిన సుశ్రుతి కృష్ణతో కలిసి పని చేసింది. సస్టైన్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్‌ను నిర్వహిస్తున్న సస్టైన్‌కార్ట్ మార్కెట్‌ప్లేస్ ఇండియా సంస్థలో పెట్టుబడితో ఇ-కామర్స్‌లోకి కూడా ప్రవేశించింది. ప్రత్యూష ఫౌండేషన్ సేవా కార్యక్రమాల గురించి తెలిసిందే.
తదుపరి ప్రాజెక్టులు:
ఇటీవలే సమంత సొంతంగా బ్యానర్ ని స్థాపించి ఇందులో బంగారం అనే సినిమాని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇకపై కమర్షియల్ సినిమాల నిర్మాతగాను సమంత తన సత్తా చాటనుంది. సొంత బ్యానర్ లో భారీ చిత్రాలను నిర్మించేందుకు సన్నాహకాల్లో ఉంది. ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2 తర్వాత రాజ్ అండ్ డీకేతో కలిసి సిటాడెల్ - హనీబన్నీ లో నటించింది. ఈ సిరీస్ రిలీజ్ ప్రచారానికి సమంత సిద్ధమవుతోంది. పలు హిందీ చిత్రాల్లోను నటించనుందని సమాచారం.