Begin typing your search above and press return to search.

దేవిశ్రీ Vs సామ్ సీఎస్.. 'పుష్ప 2' OST వార్..?

"పుష్ప 2: ది రూల్" బాక్సాఫీస్ ను రూల్ చేసినా.. ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ పంచాయితీ మాత్రం ఇప్పుడప్పుడే తెగేలా కనిపించడం లేదు.

By:  Tupaki Desk   |   24 Jan 2025 4:05 AM GMT
దేవిశ్రీ Vs సామ్ సీఎస్.. పుష్ప 2 OST వార్..?
X

"పుష్ప 2: ది రూల్" బాక్సాఫీస్ ను రూల్ చేసినా.. ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ పంచాయితీ మాత్రం ఇప్పుడప్పుడే తెగేలా కనిపించడం లేదు. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ లో బీజీఎం క్రెడిట్ ఎవరికి దక్కాలనే అంశంపై సోషల్ మీడియా డిస్కషన్స్ కు ఫుల్ స్టాప్ పడేలా లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ తో పాటుగా సామ్ సిఎస్ కూడా వర్క్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సినిమా రిలీజై అంత పెద్ద హిట్టయినా, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ క్రెడిట్ విషయంలో మాత్రం ఇరువురి మధ్య ఇండైరెక్ట్ గా ఫైట్ జరుగుతూనే ఉంది.

'పుష్ప 2' సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చినప్పటికీ, సరిగ్గా రిలీజ్ కు మూడు వారాల ముందు బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ను ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. రెమ్యునరేషన్ అయినా, క్రెడిట్ అయినా అడిగి మరీ తీసుకోవాలంటూ డీఎస్పీ పబ్లిక్ ఈవెంట్ లో నవ్వుతూనే అసంతృప్తి వ్యక్తం చేయడం, మేకర్స్ కు ఆయనకు మధ్య ఏదో జరిగిందనే ఊహాగానాలకు ఊతం ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, చివరకు సామ్ వర్క్ ని మాత్రమే సినిమాలో ఉపయోగించారు.

థమన్, అజనీశ్ లోక్ నాథ్ బీజీఎంను పూర్తిగా పక్కన పెట్టేశారు. టైటిల్స్ లో సామ్ సీఎస్ కు అడిషనల్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విభాగంలో పేరు వేశారు కానీ.. థమన్ కు థ్యాంక్స్ కూడా వేయలేదు. ఆ సంగతి అటుంచితే, 'పుష్ప 2' విడుదలైన తర్వాత బీజీఎంకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో తనకు రావలసిన క్రెడిట్ విషయంలో సామ్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో తరచుగా పోస్టులు పెట్టడంతో పాటుగా, ఇంటర్వ్యూలో తన వర్క్ గురించి మాట్లాడుతూ వస్తున్నారు.

సామ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దేవిశ్రీ ప్రసాద్‌ పలు ఇతర ప్రాజెక్ట్స్‌పై పని చేస్తున్న కారణంగా, వీలైనంత త్వరగా వర్క్ చేయించుకోవడం కోసమే తన దగ్గరకు నిర్మాతలు వచ్చినట్లుగా చెప్పారు. 'పుష్ప 2' సినిమాకి దాదాపు 90 శాతం బీజీఎం వర్క్‌ తనే చేశానని, కొన్ని కీలక సన్నివేశాలకు కొంత భాగం డీఎస్పీ స్కోర్ చేశారని చెప్పారు. ఈ మూవీకి బిజిఎమ్ చేయడానికి దేవీ చాలా కష్టపడ్డాడని కొనియాడుతూనే, పరోక్షంగా మేజర్ వర్క్ తనే ఫినిష్ చేసినట్లుగా పేర్కొన్నారు.

ఇంతలోనే టీ-సిరీస్ వాళ్ళు 'పుష్ప 2' సినిమా OST ని యూట్యూబ్‌లో రిలీజ్ చేసారు. 33 నిమిషాల ఈ జ్యూక్ బాక్స్ లో, పుష్ప ఎంట్రీ థీమ్ నుంచి ఫైనల్ బ్యాటిల్ వరకూ వివిధ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ లను పొందుపరిచారు. వాటిల్లో ప్రతీ ఓఎస్టీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసినట్లుగా పేర్కొన్నారు. కానీ ఎక్కడా సామ్ సీఎస్ పేరుని ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే 'పుష్ప 2' OST ని విడుదల చేయబోతున్నట్లు సామ్ పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.

"పుష్ప-2 OST.. లోడింగ్ 99%.. అతి త్వరలోనే రిలీజ్ కాబోతోంది" అని సామ్ తన ఎక్స్ పోస్టులో రాసుకొచ్చారు. ఆల్రెడీ మేకర్స్ ఒరిజినల్ సౌండ్‌ ట్రాక్ లను యూట్యూబ్ లో షేర్ చేసిన తర్వాత, సామ్ తన వెర్షన్ ఓఎస్టీని విడుదల చేస్తానని చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది. 'పుష్ప 2' బీజీఎం క్రెడిట్ విషయంలో చర్చలు జరుగుతున్న తరుణంలో.. సామ్ తన సౌండ్‌ ట్రాక్ లను రిలీజ్ చేస్తే, ఇద్దరు సంగీత దర్శకులలో ఎవరెవరు ఏయే సీన్స్ కి వర్క్ చేశారు? సినిమాలో ఏ స్కోర్ ను ఉంచారు? క్రెడిట్ ఎవరికి దక్కుతుంది? అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.