Begin typing your search above and press return to search.

రాంగ్ టైమ్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఎలా సంపూ?

ఇక ఈ సినిమాపై వున్న న‌మ్మ‌క‌మంతో ఉన్న టీమ్ రిలీజ్‌కు ఇర‌వై రోజుల ముందే పెయిడ్ ప్రివ్యూల‌ని ఏర్పాటు చేసింది

By:  Tupaki Desk   |   18 Oct 2023 5:18 AM GMT
రాంగ్ టైమ్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఎలా సంపూ?
X

పెద్ద ప‌సినిమాకు ఓ టైమ్‌, చిన్న సినిమాకు ఓ టైమ్ అంటూ ఉంటాయి. భారీ సినిమాల టైమ్‌లో చిన్న సినిమా విడుద‌లైతే దాన్ని ప‌ట్టించుకునే నాధుడే ఉండ‌డు అన్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. అందుకే స్మాల్ మూవీస్ ప్రొడ్యూస‌ర్స్ పెద్ద సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో.. ఎప్పుడు రావ‌డం లేదో ఖ‌చ్చితంగా లెక్క‌లు వేసుకుని..పెద్ద సినిమాలు రావ‌డం లేద‌ని క్లారిటీ తెచ్చుకున్నాకే త‌మ సినిమాల‌ని థియేట‌ర్ల‌లోకి వ‌దులుతుంటారు. కానీ ఓ చిన్న సినిమా మాత్రం పెద్ద సినిమాల హ‌డావిడిలో థియేట‌ర్లోకి వ‌చ్చేస్తోంది.

అదే 'మార్టిన్ లూథ‌ర్ కింగ్‌'. త‌మిళంలో క‌మెడియ‌న్ యోగిబాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకున్న 'మండేలా' ఆధారంగా ఈ సినిమాని రీమేక్ చేశారు. 'హృద‌య కాలేయం', 'కొబ్బ‌రి మ‌ట్ట‌' వంటి స్ఫూఫ్ కామెడీ నేప‌థ్య సినిమాల‌తో న‌టుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న సంపూర్ణేష్ బాబు ఇందులో హీరోగా న‌టించాడు. చాలా కాలంగా స్ఫూఫ్‌ల‌తో ఆక‌ట్టుకోలేక‌పోతున్న సంపూ ఈ సినిమాతో కొత్త బాట ప‌ట్టాల‌నే ఆశ‌తో ఉన్నాడు. సంపూ త‌న మార్కు సినిమాల‌కు పూర్తి భిన్న‌మైన క‌థ‌తో న‌టించిన ఈ సినిమా ఈ నెల 27న థియేట‌ర్ల‌లోకి రాబోతోంది.

ఇక ఈ సినిమాపై వున్న న‌మ్మ‌క‌మంతో ఉన్న టీమ్ రిలీజ్‌కు ఇర‌వై రోజుల ముందే పెయిడ్ ప్రివ్యూల‌ని ఏర్పాటు చేసింది. కానీ ఆడియ‌న్స్ నుంచి ఈ సినిమాకు ఎలాంటి స్పంద‌న క‌నిపించ‌డం లేదు. కార‌ణం ఈ ద‌స‌రా బ‌రిలో క్రేజీ సినిమాలు భ‌గ‌వంత్ కేస‌రి, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు, లియో వంటి సినిమాలు రిలీజ్ అవుతుండ‌ట‌మే. వీటి కోసం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. వీటితో పండ‌గ‌ని గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకోవాల‌నే మూడ్‌లో ప్రేక్ష‌కులు, అభిమానులు ఉన్నారు. వీటిని చూశాక మ‌ళ్లీ సంపూ కోసం టికెట్ కొని మ‌రీ థియేట‌ర్‌కు రావ‌డానికి ప్రేక్ష‌కులు సిద్ధంగా ఉంటార‌న్న‌ది క‌లే.

బిర్యానీ తిన్నాక మామూలు భోజ‌నం కోసం వెళ్లిన‌ట్టే ఉంటుంది. మ‌రి ఈ చిన్న లాజిక్‌ని టీమ్ ఎలా మ‌ర్చిపోయింది? .. తెలిసి తెలిసి ఇలాంటి రాంగ్ టైమ్‌నే ఎందుకు ఎంచుకుంది? అన్న‌ది ఇప్ప‌డు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్న మాట‌. 'మార్టిన్ లూథ‌ర్ కింగ్‌'ని మంచి పాయింట్‌తో చేసినా దాన్ని జ‌నాల్లోకి మ‌రింత బ‌లంగా తీసుకెళ్లాలంటే చిన్న సినిమాకు స‌రైన టైమ్‌ని ఎంచుకోవాలి. అలా కాకుండా పెద్ద సినిమాల మ‌ధ్య‌లో వేసేస్తామంటే ప్రేక్ష‌కులు డ‌బ్బు ఖ‌ర్చు పెట్టి థియేట‌ర్ల‌కు రావాలి క‌దా? పండ‌గ హ‌డావిడీ అంతా అయిపోయాక న‌వంబ‌ర్‌లో వ‌చ్చి ఉంటే బాగుండేది కదా అని సినీ విశ్లేష‌కులు అంటున్నారు.