సూపర్‌స్టార్ కొడుకు బెయిల్ కోసం 4గం.లు వాదించిన లాయర్
అయితే ఆర్యన్ కి బెయిల్ రప్పించడంలో కీలక పాత్ర పోషించిన ముంబైకి చెందిన ప్రముఖ క్రిమినల్ న్యాయవాది సనా రయీస్ ఖాన్ పేరు అప్పట్లో మార్మోగింది.
By: Tupaki Desk | 26 March 2025 4:01 AMసూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కేసు నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అతడికి బెయిల్ రావడం గగనమైంది. కొన్ని రోజుల పాటు ఆర్యన్ జైలులోనే మగ్గాడు. ఊచలు లెక్కిస్తున్న కుమారుడిని తలచుకుని కింగ్ ఖాన్ షారూఖ్ కుంగిపోయాడు. కుటుంబీకులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇండస్ట్రీని శాసించిన పెద్ద స్టార్ వారుసుడికి ఎలాంటి రక్షణా కల్పించలేకపోయాడని ఎగతాళి చేసారు. అంతేకాదు... ఈ కేసును డీల్ చేస్తున్న పోలీసాఫీసర్ ని షారూఖ్ బతిమలాడుకోవడంపైనా మీడియాలో కథనాలొచ్చాయి.
అయితే ఆర్యన్ కి బెయిల్ రప్పించడంలో కీలక పాత్ర పోషించిన ముంబైకి చెందిన ప్రముఖ క్రిమినల్ న్యాయవాది సనా రయీస్ ఖాన్ పేరు అప్పట్లో మార్మోగింది. 2021 డ్రగ్స్-ఆన్-క్రూయిజ్ కేసులో ఆర్యన్ ప్రమేయం లేదని వాదిస్తూ ఆమె చివరకు బెయిల్ రప్పించగలిగారు. ముఖ్యంగా ఈ కేసులో సహ నిందితుడు అవిన్ సాహుకు బెయిల్ లభించింది. బెయిల్ పొందిన మొదటి వారిలో సాహు కూడా ఉన్నారు. షారుఖ్ ఖాన్- గౌరీ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్టు చేసిన సమయంలో ఆర్యన్ వద్ద కానీ, అతడి స్నేహితుల వద్ద కానీ డ్రగ్స్ లేవని సనా వాదించారు. తాజా ఇంటర్వ్యూలో అవిన్ సాహుకు బెయిల్ సాధించడంలో తన అనుభవాన్ని సనా వివరించింది. ఆమె ఎదుర్కొన్న సవాళ్లను వివరించింది. మరుసటి రోజు ఆర్యన్ తిరస్కరించిన అదే సెషన్ స్పేస్ ముందు నేను ఉన్నాను. నేను వాదించాను. రోజంతా అక్కడే ఉన్నాను. అక్షరాలా నాలుగు గంటలు వాదించాను. వాదన ఫలించి చివరికి బెయిల్ వచ్చింది.. ఆ తర్వాత ఆర్యన్ బెయిల్ సులువైంది అని తెలిపారు.
అసలు బెయిల్ రావడానికి కారణం?
అధికారుల దర్యాప్తులో ఒక లోపాన్ని సనా జడ్జి వద్ద హైలైట్ చేసింది. మాదకద్రవ్యాల వినియోగం ఆరోపణలు ఉన్నా కానీ, అధికారులు ఈ కుర్రాళ్ల రక్త పరీక్ష నమూనాను కూడా తీసుకోలేదు. ఆరోపణలు నిజమా కాదా? అనేది ధృవీకరించడానికి కూడా వారు రక్త పరీక్షల కోసం ప్రయత్నించలేదు అని తప్పును ఎత్తి చూపింది. ముందస్తు నేర చరిత్రలు లేని యువకులను కరుడుగట్టిన నేరస్థులతో పాటు జైలులో పెట్టడం సరికాదంటూ సనా ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ అబ్బాయిలంతా అరెస్టయ్యారు. వారు వారి కుటుంబీకులు కానీ, పూర్వీకులు కానీ నేరగాళ్లు కాదు.. మోసగాళ్ల చరిత్ర వారికి లేదు! అని సనా వాదించారు. గ్యాంగ్‌స్టర్లు, రేపిస్టులు, హంతకులు ఉండే చోట ఈ కుర్రాళ్లు జైలులో వారితో పాటు ఉండటం సరైనదేనా? అని సనా వాదించారు. సనా డిఫెన్స్ చివరికి నెగ్గింది. ఆర్యన్ ఖాన్ సహా తదుపరి బెయిల్ విచారణలను ప్రభావితం చేసిన ఒక ఉదాహరణగా ఇది మారింది. హైకోర్టులో విచారణల సమయంలో దయచేసి మాకు ఆ ఆర్డర్ కాపీ(ఆర్యన్ ఖాన్ కేసు కాపీ) అవసరమని నాకు కాల్స్ వస్తున్నాయి అని కూడా సనా తెలిపారు. ఆర్యన్ ఖాన్ తన తొలి డెబ్యూ ఓటీటీ సిరీస్ తో బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. నటుడిగా కాకుండా దర్శకుడిగా అతడు ఆరంగేట్రం చేస్తున్నాడు. డ్రగ్స్ కేసులో తనను అన్యాయంగా ఇరికించిన పోలీస్ అధికారిని అతడు నిలదీసిన వీడియో గతంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకుని తలెత్తుకుని తిరుగుతున్నాడు అతడు.