రీరిలీజ్ ట్రెండ్‌లో ఇది ఒక మిరాకిల్
రీరిలీజ్‌ల ట్రెండ్‌లో ఇప్పుడు మరో సినిమా ఆశ్చర్యకరమైన ఫలితంతో సర్వత్రా చర్చనీయాంశమైంది.
By: Tupaki Desk | 9 Feb 2025 6:22 AM GMTరీరిలీజ్‌ల ట్రెండ్‌లో ఇప్పుడు మరో సినిమా ఆశ్చర్యకరమైన ఫలితంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇటీవల విడుదలైన ఇంటర్‌స్టెల్లార్ తరహాలో ఈ బాలీవుడ్ మూవీ రీరిలీజ్‌లో బంపర్ హిట్టు కొట్టింది.
కొన్ని సినిమాలు మొదటి రిలీజ్‌లో అర్థం కావు. జనాలు నిర్ధయగా తిరస్కరిస్తారు. నిజానికి కల్ట్ జానర్ సినిమాలకు ఇలాంటి ముప్పు ఉంటుంది. కమర్షియల్ జానర్‌లో వచ్చిన బ్యాడ్ యాస్ రవికుమార్ ని మినహాయించి, దానితో పోటీపడుతూ కూడా అద్భుత వసూళ్లను సాధిస్తోంది `సనమ్ తేరి కసమ్` అనే కల్ట్ సినిమా. అది కూడా మొదటి రిలీజ్ లో సాధించిన ఓపెనింగులను బీట్ అవుట్ చేస్తూ రెండో రిలీజ్ లో ఈ చిత్రం సంచలనాలు సృష్టిస్తోంది. నిజంగా ఇది ఒక మిరాకిల్ అని ట్రేడ్ ఆశ్చర్యపోతోంది.
హర్షవర్ధన్ రాణే- మావ్రా హొకేన్ ప్రధాన పాత్రల్లో నటించిన `సనమ్ తేరి కసమ్` కల్ట్ జానర్ లో ప్రయోగాత్మక చిత్రం అనడంలో సందేహం లేదు. ఇది రిలీజైన దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత తిరిగి థియేటర్లలోకి వచ్చింది. ఈ రొమాంటిక్ డ్రామా సినిమా సినీ ప్రేమికులలో కల్ట్ స్టేటస్ తో ఆకర్షిస్తోంది. హర్షవర్ధన్ రాణే, పాకిస్తానీ నటి మావ్రా హొకేన్ లకు బాలీవుడ్ లో కెరీర్ ఆరంభంలో వచ్చిన చిత్రమిది. రాధికా రావు- వినయ్ సప్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం నాడు రూ. 4 కోట్ల ఆరంభ వసూళ్లతో భారీ సంచలనం సృష్టించింది. ఈ ఊపును కొనసాగిస్తూ, శనివారం రూ. 5 కోట్లు వసూలు చేసింది. రీరిలీజ్ ల ట్రెండ్ లో ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే రూ. 9 కోట్లకు చేరుకుంది. మొదటిసారి రిలీజై ఫుల్ రన్ లో సాధించిన మొత్తాన్ని అధిగమించి ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో బాడాస్ రవి కుమార్, లవ్‌యాపాతో పోటీ పడుతోంది.
ఈ చిత్రం వరుసగా రెండవ రోజు హిందీ మార్కెట్లలో ఆధిపత్యం చెలాయించింది. 2016లో తొలిసారి విడుదలైనప్పుడు, `సనమ్ తేరి కసమ్` లైఫ్ టైమ్ లో రూ. 8 కోట్లు వసూలు చేసింది. అయితే రీ-రిలీజ్ కేవలం రెండు రోజుల్లోనే ఆ మార్కును అధిగమించింది. కేవలం మొదటి రోజునే దాదాపు 3 లక్షల టికెట్లు సేల్ అయ్యాయంటే అర్థం చేసుకోవాలి. మొదటి రిలీజ్‌లో అంత బాగా రాణించని `సనమ్ తేరి కసమ్` ఫిబ్రవరి 7న తిరిగి విడుదలై రీరిలీజ్ సినిమాల్లో ది బెస్ట్ కలెక్షన్లతో ఆశ్చర్యపరుస్తోంది.