క్లిక్ క్లిక్ : 'కలర్ ఫోటో' దర్శకుడి కళ్యాణం
పరిమిత సంఖ్యలో హాజరు అయిన బంధు మిత్రుల సమక్షంలో చాందినీ రావు మెడలో సందీప్ రాజ్ మూడు ముళ్లు వేసి కొత్త జీవితం ఆరంభించాడు.
By: Tupaki Desk | 7 Dec 2024 9:30 AM GMTసుహాస్ ప్రధాన పాత్రలో నటించిన 'కలర్ ఫోటో' చిత్ర దర్శకుడు సందీప్ రాజ్ ఒక ఇంటి వాడు అయ్యాడు. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ యువ దర్శకుడు తిరుపతిలో శ్రీవారి చెంత ప్రేమించిన అమ్మాయి మెడలో తాళి కట్టాడు. సందీప్ రాజ్ వివాహంకు సుహాస్‌తో పాటు ఇండస్ట్రీకి చెందిన ఆయన సన్నిహితులు పలువురు హాజరు అయ్యారు. పరిమిత సంఖ్యలో హాజరు అయిన బంధు మిత్రుల సమక్షంలో చాందినీ రావు మెడలో సందీప్ రాజ్ మూడు ముళ్లు వేసి కొత్త జీవితం ఆరంభించాడు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కలర్ ఫోటో సినిమాలో కీలక పాత్రలో చాందినీ రావు నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఇప్పుడు కుటుంబ సభ్యులను ఒప్పించి తిరుపతిలో వివాహం చేసుకున్నారు. దర్శకుడిగా మొదటి ప్రయత్నంతోనే జాతీయ అవార్డు సొంతం చేసుకోవడంతో పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఈయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించారు.
దర్శకుడిగా ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు చేయకుండా స్లో గా సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు వెండి తెరపై కనిపిస్తున్న కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ ప్రస్తుతం సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా మోగ్లీ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. విభిన్నమైన సినిమా కథలను ఎంపిక చేసుకుంటున్న సందీప్ రాజ్ త్వరలోనే మరిన్ని మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలతో వస్తాడని ఆయన సన్నిహితులతో పాటు, ఆయనతో గతంలో వర్క్ చేసిన వారు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న సందీప్ రాజ్ కి కలర్ ఫోటో సినిమా ఛాన్స్ రావడంతో తనను తాను నిరూపించుకున్నాడు. కరోనా సమయంలో కలర్ ఫోటో సినిమా ఒక సంచలనం అనడంలో సందేహం లేదు. ఓటీటీలో అత్యధికంగా చూసిన సినిమాల జాబితాలో ఆ సినిమా నిలిచింది. అలాంటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన సందీప్ రాజ్ మరిన్ని సినిమాలు చేయాలని అంతా కోరుకుంటున్నారు. పెళ్లి తర్వాత ఆయన గేరు మార్చే ఏడాదికి ఒకటి రెండు సినిమాల చొప్పున స్పీడ్‌గా చేయాలని అంతా కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో సందీప్ రాజ్, చాందినీ రావులకు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున పోస్ట్‌లు పెడుతూ ఉన్నారు.