పుష్పరాజ్ కి వైల్డ్ యానిమల్ తోడైతే..!
అయితే ఇదే ఇలా ఉంటే, ఇంక సందీప్ రెడ్డి వంగా సినిమాలో ఎలా ఉంటుందో అనే చర్చలు మొదలయ్యాయి.
By: Tupaki Desk | 11 Dec 2024 9:30 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర కనీవినీ ఎరుగని రికార్డులు పెడుతున్నారు. పాన్ ఇండియా వైడ్ గా జాతర మాస్ చూపిస్తున్నారు. ముఖ్యంగా నార్త్ మార్కెట్ లో ఎవరూ ఊహించని విధంగా వసూళ్లు రాబడుతున్నారు. ఇక పుష్పరాజ్ గా బన్నీ నటనకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తన నట విశ్వరూపం చూపించాడు. మరో నేషనల్ అవార్డ్ వస్తుందా రాదా అన్నది పక్కన పెడితే, ఇది ఇప్పటి వరకూ ఆయన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. అయితే ఇదే ఇలా ఉంటే, ఇంక సందీప్ రెడ్డి వంగా సినిమాలో ఎలా ఉంటుందో అనే చర్చలు మొదలయ్యాయి.
సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ మూవీ కమిటైన సంగతి తెలిసిందే. టీ-సిరీస్ బ్యానర్ లో ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళడానికి కాస్త సమయం పడుతుంది. కాకపోతే ఇప్పుడు 'పుష్ప 2' సినిమాలో పుష్పరాజ్ గా బన్నీ యాక్టింగ్ చూసిన తర్వాత.. సందీప్ వంగా సినిమాలో ఆయన్ని ఎలాంటి పాత్రలో ప్రెజెంట్ చేస్తారో, క్యారక్టరైజేషన్ ఎలా ఉంటుందో, ఎలాంటి లుక్ లో చూపిస్తారో అని ఇప్పటి నుంచే ఐకాన్ స్టార్ అభిమానులు ఆలోచిస్తున్నారు.
కంప్యూటర్ గ్రాఫిక్స్ కంటే హీరోల యాక్టింగ్ మీద ఆధారపడి సినిమాలు తీసే దర్శకులలో సందీప్ రెడ్డి వంగా ఒకరు. తన సినిమాలలో హీరోలను కొత్త క్యారక్టరైజేషన్ లో చూపించడమే కాదు, బెస్ట్ లుక్ లో ప్రజెంట్ చేస్తుంటారు. 'అర్జున్ రెడ్డి' సినిమాలో విజయ్ దేవరకొండ, 'కబీర్ సింగ్' లో షాహిద్ కపూర్, 'యానిమల్' మూవీలో రణబీర్ కపూర్ లను గత చిత్రాల కంటే కంప్లీట్ డిఫరెంట్ గా భిన్నమైన పాత్రల్లో చూపించారు. వారిలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. సందీప్ కచ్ఛితంగా బన్నీతో కూడా అలాంటి ప్రయత్నమే చేస్తారని అభిమానులు భావిస్తున్నారు.
'పుష్ప 2' వంటి కమర్షియల్ మూవీతో అల్లు అర్జున్ లోని బెస్ట్ ని బయటకు తీశారు దర్శకుడు సుకుమార్. జాతర ఎపిసోడ్, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ తర్వాత ఎమోషనల్ సన్నివేశాలు, కొన్ని ఎలివేషన్ సీన్స్ లో బన్నీ అదరగొట్టాడు. అలాంటి డెడికేటెడ్ యాక్టర్ ఇప్పుడు సందీప్ వంగా లాంటి ఒరిజినల్ ఫిలిం మేకర్ తో చేతులు కలిపితే అది డెడ్లీ అండ్ క్రేజీ కాంబినేషన్ అవుతుంది. ఈ కాంబో ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లినా యాక్టింగ్ పరంగా కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తుంది. దర్శకుడు స్టైలిష్ స్టార్ ను సరికొత్తగా తెర మీదకు తీసుకొస్తారని అనుకోవచ్చు. పుష్పరాజ్ కు యానిమల్ తోడైతే బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారంటీ.
సందీప్ రెడ్డి ప్రస్తుతం ప్రభాస్ తో 'స్పిరిట్' సినిమాని పట్టాలెక్కించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీని తర్వాత 'యానిమల్' సీక్వెల్ గా 'యానిమల్ పార్క్' మూవీ చేయనున్నారు. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ భారీ సినిమా చేయనున్నారు. సంక్రాంతి పండుగకు అధికారిక ప్రకటన ఇచ్చి, మార్చిలో షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత నాగవంశీ తెలిపారు. ఇద్దరి కమిట్మెంట్స్ పూర్తయిన తరవాత బన్నీ - సందీప్ వంగా కాంబోలో సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి.