మెగా వంగా సెట్టయితే..?
సందీప్ రెడ్డి వంగా అంటేనే విభిన్నమైన కథలు, అత్యంత బోల్డ్ కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు.
By: Tupaki Desk | 5 Feb 2025 10:30 PM GMTసందీప్ రెడ్డి వంగా అంటేనే విభిన్నమైన కథలు, అత్యంత బోల్డ్ కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు. అయితే, ఈ యువ దర్శకుడికి మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు. చిరు సినిమాల నుంచి ఆయన చాలా ఇన్‌స్పిరేషన్ తీసుకున్నారని, ముఖ్యంగా ‘మాస్టర్’ సినిమాలో చిరు సిగరెట్ కాల్చే సీన్ తనను ఎంతో ప్రభావితం చేసిందని గతంలో చెప్పిన సందీప్, ఇటీవల మెగాస్టార్ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసి మరోసారి తన అభిమానం చాటుకున్నాడు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ‘సందీప్ - చిరు కాంబో’ గురించి సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇప్పటికే అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి డిఫరెంట్ చిత్రాలతో బాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేశాడు సందీప్. ఇక ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, మెగాస్టార్ చిరంజీవితో కూడా ఆయన ఓ సినిమా చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
చిరు, సందీప్ మధ్య ఇటీవల ఓ మీటింగ్ కూడా జరిగిందని సమాచారం. ఇద్దరి వర్కింగ్ స్టైల్ పూర్తిగా విభిన్నమైనా, ఆ కాంబినేషన్ జరిగితే అభిమానులకు అసలైన మాస్ ట్రీట్ అవుతుందనే అంచనాలు పెరిగిపోయాయి. తాజా సమాచారం ప్రకారం, ‘స్పిరిట్’ సినిమాలో చిరంజీవి కోసం సందీప్ ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేయబోతున్నాడట. దీనికి గాను, చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. ‘యానిమల్’లో అనిల్ కపూర్ క్యారెక్టర్‌ను ఎంత బలంగా డిజైన్ చేసారో, అలాగే చిరంజీవికి ప్రత్యేకమైన పాత్రను అందించేందుకు సిద్ధమయ్యాడని సినీ వర్గాలు చెబుతున్నాయి.
మెగాస్టార్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, పూర్తి స్థాయిలో రక్తి కట్టించే రోల్‌ను సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేస్తున్నాడట. ఇటీవల, యంగ్ హీరోలు హీరో అనే ఫార్మాట్ కు కట్టుబడి ఉండకుండా, విభిన్న కథలలో సపోర్ట్ రోల్ లేదా ఇంపార్టెంట్ రోల్స్ చేసేందుకు ఓపెన్ అవుతున్నారు. చిరంజీవి కూడా అదే ధోరణిలో ముందుకు వెళ్తే, సందీప్-చిరు కాంబో ఖచ్చితంగా ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. మరి, చిరు తన అభిమాన దర్శకుడితో కలిసి పని చేసేందుకు సిద్ధమవుతారా? సందీప్ స్టైల్‌లో చిరంజీవి ఎలా మెరవబోతున్నారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి.
ప్రస్తుతం స్పిరిట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సందీప్, త్వరలోనే మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి. ఇదే చిరుతో అయితే, టాలీవుడ్‌లో ఇది హాట్ టాపిక్‌గా మారడం ఖాయం. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్టయితే, మెగాస్టార్ కెరీర్‌లో మరో డిఫరెంట్ మూవీ వచ్చిందనే చెప్పాలి. ఇక ‘స్పిరిట్’ లో చిరు ప్రత్యేకమైన పాత్ర చేయబోతున్నారనే టాక్ ఎంత వరకు నిజమో తెలియదు గానీ, మెగాస్టార్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ గనక రియాలిటీ అయ్యిందంటే మాత్రం, మెగా ఫ్యాన్స్‌కి అది పండగే. ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరు.. మధ్యలో సందీప్ రెడ్డి వంగా.. ఇక అభిమానులకు రెండు కళ్లూ సరిపోవు.