Begin typing your search above and press return to search.

స్పిరిట్ స‌ర్‌ప్రైజ్‌.. ప్రభాస్ కోసం వంగా క్రేజీ ప్లాన్!

ర‌ణ‌బీర్ క‌పూర్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ చేస్తారని ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

By:  Tupaki Desk   |   16 Oct 2024 12:50 PM GMT
స్పిరిట్ స‌ర్‌ప్రైజ్‌.. ప్రభాస్ కోసం వంగా క్రేజీ ప్లాన్!
X

రెబల్ స్టార్ ప్రభాస్ లైన్ లో పెట్టిన భారీ ప్రాజెక్ట్స్ లో ''స్పిరిట్'' ఒకటి. 'యానిమల్' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఏ చిన్న న్యూస్ వినిపించినా క్షణాల్లో వైరల్ చేసేస్తున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం, వంగా ఈ సినిమాలో చాలా స‌ర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

'స్పిరిట్' అనేది ఒక కాప్ డ్రామా అని సందీప్ వంగా ఇది వరకే ప్రకటించారు. ఇందులో సిన్సియర్ అండ్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా ప్రభాస్ కనిపించబోతున్నారు. అంతేకాదు ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నారనే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. ‘బాహుబ‌లి’లో మాదిరిగా కాకుండా, రెండు పాత్ర‌లూ ఒకేసారి స్క్రీన్ మీద కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఇది పాన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కావడంతో, ఇతర భాషలకు చెందిన పలువురు పాపులర్ స్టార్స్ ను ఈ సినిమాలో భాగం చేస్తారని తెలుస్తోంది.

బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ ‘స్పిరిట్’ చిత్రంలో నటిస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. అలానే ప్రభాస్ ఫాదర్ క్యారక్టర్ లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కనిపిస్తాడనే టాక్ కూడా బయటికి వచ్చింది. ర‌ణ‌బీర్ క‌పూర్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ చేస్తారని ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. విలన్ రోల్ కోసం అన్వేష‌ణ ప్రారంభించిన సందీప్ వంగా.. ఓ స్టార్ హీరోని ఎంచుకొనే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

'స్పిరిట్' సినిమాలో సౌత్ కొరియన్ యాక్టర్ డాన్ లీ అలియాస్ లీ డాంగ్-సియోక్ ప్రతినాయకుడుగా నటిస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఏది నిజమో తెలియదు కానీ, ఈ సెట‌ప్ చూస్తుంటే సినిమాలో చాలామంది బడా స్టార్లు కనిపించే ఛాన్స్ ఉంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే లాంటి స్టార్ కాస్టింగ్ నటించిన 'కల్కి 2898 AD' సినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అదే విధంగా ఇప్పుడు వంగా మూవీలోనూ ప్రభాస్ తో పాటుగా మరికొంతమంది బిగ్ స్టార్స్ ఉంటే మాత్రం, బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో తన సత్తా ఏంటో చూపించారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అలాంటి సంచలన దర్శకుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేస్తున్న సినిమా కావడంతో 'స్పిరిట్' పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వంగా దానికి త‌గ్గ‌ట్టుగానే స్క్రిప్టుని రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదే పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, మాండరిన్, జపనీస్, కొరియన్ భాషల్లో రిలీజ్ అవుతుంది.