Begin typing your search above and press return to search.

తెలుగు హీరో ఈసారైనా తమిళంలో పాగా వేస్తాడా?

ధనుష్ మైల్ స్టోన్ 50వ సినిమాలో తనకోసం రాసుకున్న క్యారెక్టర్ ను ఇచ్చాడని, ఇంతకంటే తనకు గొప్ప అవార్డ్ వుండదని సందీప్ కిషన్ చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   24 July 2024 12:30 PM GMT
తెలుగు హీరో ఈసారైనా తమిళంలో పాగా వేస్తాడా?
X

'ప్రస్థానం' సినిమాతో సినీ ప్రస్థానం మొదలు పెట్టిన టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి గత 14 ఏళ్లుగా కృషి చేస్తున్నారు. వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి కష్ట పడుతున్నారు. అయితే కెరీర్ ప్రారంభం నుంచీ తెలుగుతో పాటుగా తమిళ చిత్ర పరిశ్రమ మీద ఫోకస్ పెడుతూ వచ్చారు సందీప్. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. అయినా సరే అవకాశం వచ్చినప్పుడల్లా కోలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవలే తెలుగులో 'ఊరి పేరు భైరవకోన'తో హిట్టు కొట్టిన యువ హీరో.. ఇప్పుడు 'రాయన్' మూవీతో మరోసారి తమిళ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు.

నేషనల్ ఫిలిం అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రాయన్'. ఇది ధనుష్ కెరీర్ లో ల్యాండ్‌ మార్క్ 50వ సినిమా. ఇందులో సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించారు. ప్రకాశ్ రాజ్, సెల్వ రాఘవన్, కాళిదాసు జయరామ్, దుషార విజయన్, అపర్ణ బాలమురళి, నిత్యా మీనన్, ఎస్.జె. సూర్య ఇతర పాత్రల్లో నటించారు. ట్రైలర్, సాంగ్స్ వంటి ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు బజ్ క్రియేట్ చేశాయి. ఇదొక అద్భుతమైన చిత్రమని సందీప్ ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పేర్కొన్నారు. ఒక తెలుగు హీరో తమిళ్ లో ఇంత మంచి క్యారెక్టర్ చేయగలిగాడని ఆడియన్స్ అంతా చాలా గర్వంగా ఫీలౌతారని ధీమా వ్యక్తం చేశారు.

2013లో 'యారుడా మహేష్' అనే సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెట్టారు సందీప్ కిషన్. ఇది పెద్దగా ఆడలేదు. కానీ కాస్త గ్యాప్ తీసుకొని లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో నటించిన 'మా నగరం' మూవీ మాత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన 'నెంజిల్ తునివిరుంధాల్', 'మాయావన్', 'కసడ తబర' వంటి చిత్రాల్లో నటించినా ప్రభావం చూపించలేదు. ఈ ఏడాది ప్రారంభంలో ధనుష్ తో కలిసి 'కెప్టెన్ మిల్లర్' చేసినా, సందీప్ కు లాభం లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు మరో రెండు రోజుల్లో రాబోయే 'రాయన్' సినిమా తమిళ్ లో అతని కెరీర్ కు కీలకంగా మారింది.

ధనుష్ మైల్ స్టోన్ 50వ సినిమాలో తనకోసం రాసుకున్న క్యారెక్టర్ ను ఇచ్చాడని, ఇంతకంటే తనకు గొప్ప అవార్డ్ వుండదని సందీప్ కిషన్ చెబుతున్నారు. ఇందులో అతనికి జోడీగా అపర్ణ బాలమురళి నటించింది. వీరిద్దరి మధ్య చిత్రీకరించిన 'వాటర్ పాకెట్' పాట మంచి హిట్టయింది. తమిళనాడులో ప్రీ రిలీజ్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి. ధనుష్ తో పాటుగా సందీప్ కిషన్ ఉండటం తెలుగులో కలిసొచ్చే అంశం. ఈ వారంలో రిలీజ్ అయ్యే మిగతా సినిమాల కంటే 'రాయన్' కే కాస్త ఎక్కువ బజ్ ఉంది. మరి సందీప్ ఈ చిత్రంతో సక్సెస్ సాధించి కోలీవుడ్ లో మరిన్ని క్రేజీ ఆఫర్లు అందుకుంటారేమో చూడాలి.