సందీప్ కిషన్.. ఈసారి కొట్టాల్సిందే..
యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో మంచి టాలెంటెడ్ యాక్టర్ గా సందీప్ కి పేరుంది.
By: Tupaki Desk | 23 Jan 2024 5:33 AM GMTయంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో మంచి టాలెంటెడ్ యాక్టర్ గా సందీప్ కి పేరుంది. ప్రస్థానం సినిమాలో నెగిటివ్ రోల్ తో నటుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన సందీప్ కిషన్ తరువాత స్నేహగీతం మూవీ హీరోగా మారాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన రొటీన్ లవ్ స్టోరీ మూవీతో సోలో హీరోగా కెరియర్ స్టార్ట్ చేశాడు.
అప్పటి నుంచి రెగ్యులర్ గా మూవీస్ చేస్తూనే ఉన్నాడు. అయితే సందీప్ కిషన్ కెరియర్ లో చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అంటే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్. కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న లోకేష్ కనగరాజ్ మొదటి సినిమా సందీప్ కిషన్ తోనే చేసాడు. నగరం పేరుతో ఈ మూవీ తెలుగులో డబ్ అయ్యింది. అటు తమిళ్, ఇటు తెలుగులో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్న సాలిడ్ గా చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ అయితే రావడం లేదు.
చివరిగా సందీప్ కిషన్ ని నిను వీడని నీడను నేనే సినిమాతో ఓ మోస్తరు హిట్ వచ్చింది. అయితే కమర్షియల్ సక్సెస్ మాత్రం దొరకలేదు. మైఖేల్ అనే టైటిల్ తో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ చేసిన అది కూడా డిజాస్టర్ అయ్యింది. రీసెంట్ గా ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు. సోలో సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తోన్న సందీప్ కి ఈ సారి లక్ కలిసొచ్చే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.
విఐ ఆనంద్ దర్శకత్వంలో ఊరు పేరు భైరవకోన సినిమాతో ఫిబ్రవరి 8న సందీప్ కిషన్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఫిక్షనల్ థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ తెరకెక్కింది. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. విరూపాక్ష, పొలిమేర, కాంతారా, హనుమాన్ లాంటి కథలకి ఈ మధ్య ఆదరణ లభిస్తోంది.
ఇంచుమించు అలాంటి సూపర్ నేచురల్ కథతోనే ఊరు పేరు భైరవకోన తెరకెక్కింది. మరి ఈ సినిమాతో సక్సెస్ వస్తుందేమో చూడాలి. అయితే ఈ సినిమాకి పోటీగా రవితేజ ఈగల్ బరిలో ఉంది. దాంతో పాటు మరో సినిమా కూడా ఉంది. వాటిని తట్టుకొని ఎంత వరకు నిలబడుతుంది అనేది తెలియాల్సి ఉంది.