Begin typing your search above and press return to search.

సందీప్ వంగా.. ఆస్తులు అమ్మేసుకునే పరిస్థితి!

సందీప్‌ రెడ్డి వంగా.. ఇప్పుడు ఈ పేరు చిత్రసీమలో ఒక సరికొత్త బ్రాండ్. యానిమల్‌ సినిమాతో ఒక్కసారిగా అందరి చూపు తన వైపు తిప్పుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి.

By:  Tupaki Desk   |   9 Dec 2023 5:11 AM GMT
సందీప్ వంగా.. ఆస్తులు అమ్మేసుకునే పరిస్థితి!
X

సందీప్‌ రెడ్డి వంగా.. ఇప్పుడు ఈ పేరు చిత్రసీమలో ఒక సరికొత్త బ్రాండ్. యానిమల్‌ సినిమాతో ఒక్కసారిగా అందరి చూపు తన వైపు తిప్పుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి. తెలుగు డైరెక్టర్‌ అయి ఉండి బాలీవుడ్‌లో జెండా ఎగరేస్తున్నారు. ఆయన రూపొందించిన యానిమల్‌ సినిమా ఇప్పుడు కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

ఇప్పుడు సినీ ప్రియులు.. సందీప్ గురించి ఆరా తీసే పనిలో పడ్డారు. ఆయనకు సంబంధించిన ఇంటర్వ్యూలు, బ్యాక్‌ గ్రౌండ్‌ విషయాలను తెగ వైరల్ చేస్తున్నారు. ఈ సమయంలో సందీప్‌ రెడ్డి చేసిన మొదటి సినిమా అర్జున్ రెడ్డి గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

సందీప్ రెడ్డి తన డైరెక్టోరియల్ డెబ్యూ అర్జున్ రెడ్డి చిత్రాన్ని తానే స్వయంగా నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ రూ.5 కోట్లు మాత్రమే. అప్పటికే పెళ్లి చూపులు చిత్రంతో హిట్ కొట్టినప్పటికీ హీరో విజయ్ దేవరకొండకు పెద్దగా క్రేజ్ లేదు. షాలిని పాండే కొత్త హీరోయిన్. కాబట్టి వీరి రెమ్యురేషన్ తక్కువే. దీంతో బడ్జెట్ లో అధిక భాగం మేకింగ్ కే ఖర్చు చేశారు.

అయితే ఈ సినిమా పెట్టుబడికి సందీప్ రెడ్డి వంగా తన కుటుంబానికి చెందిన 36 ఎకరాల మామిడి తోట అమ్మేశారట. రూ. 1.5 కోట్లకు ఆ ప్రాపర్టీ అమ్మి అర్జున్ రెడ్డి మూవీ చేశారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకవేళ అర్జున్ రెడ్డి హిట్ కాకాపోతే రోడ్డున పడాల్సి వచ్చేదని ఆయన పరోక్షంగా హింట్ ఇచ్చాడు.

అర్జున్ రెడ్డి సినిమా.. పెట్టుబడికి పదింతలు అంటే రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు సందీప్ రెడ్డి. ఇక సందీప్ లేటెస్ట్ గా డైరెక్ట్ చేసిన యానిమల్ మూవీ విడుదలైన ప్రతి భాషలో సంచలన విజయం సాధించింది. ఫాదర్ అండ్ సన్ బాండింగ్ నేపథ్యంలో రివెంజ్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ రణ్ బీర్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 7 రోజుల్లోనే రూ.500 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.

తెలుగులోనూ ఈ సినిమా కలెక్షన్స్ అదరగొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న యానిమల్ వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలు అందుకోవడం విశేషం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని తెలుగు లో రిలీజ్ చేశారు. సందీప్ రెడ్డి వంగా తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ తీయబోతున్నారు.