సందీప్ వంగాను కంగన అలా అనేసిందేమిటీ?
సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ, కంగనా రనౌత్ 'యానిమల్'పై ప్రతికూల సమీక్షను అందించినప్పటికీ తనతో కలిసి పనిచేయడానికి తాను ఆసక్తిగా ఉన్నానని చెప్పారు.
By: Tupaki Desk | 6 Feb 2024 4:28 AM GMTఅర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాల సంచలన విజయాలతో తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమల్లో మార్మోగుతోంది. కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ ఇప్పుడు రాజమౌళి, ప్రశాంత్ నీల్ తర్వాత మోస్ట్ వాంటెడ్ దర్శకుల జాబితాలో సందీప్ పేరు చేరింది. అతడితో కలిసి పని చేయాలని ఆశించని హీరోలు లేరు. కానీ సందీప్ రెడ్డి వంగా ఇటీవల చేసిన ఒక కామెంట్ అట్టుడికించింది.
సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ, కంగనా రనౌత్ 'యానిమల్'పై ప్రతికూల సమీక్షను అందించినప్పటికీ తనతో కలిసి పనిచేయడానికి తాను ఆసక్తిగా ఉన్నానని చెప్పారు. అయితే కంగనకు ఇది రుచించినట్టు లేదు. సందీప్ వంగాతో కలిసి పని చేసేందుకు తాను సిద్ధంగా లేనని అనడమే దీనికి కారణం. మరింతగా వివరాల్లోకి వెళితే...
2023లో విడుదలైన అత్యంత వివాదాస్పద చిత్రాలలో 'యానిమల్' ఒకటి. డిసెంబర్ 2023లో విడుదలైన ఈ చిత్రంపై కంగనా రనౌత్ సహా పలువురు తీవ్రంగానే విమర్శించారు. రణబీర్ కపూర్ నటించిన ఈ సినిమా కంటెంట్ ప్రేక్షకులను మెప్పించడం నిరాశపరిచిందని అన్నారు. కంగన కూడా తన నిరాశను వ్యక్తం చేసింది. అయితే రణబీర్ కపూర్ నటించిన 'యానిమల్'ను కంగన విమర్శించడంపై సందీప్ ప్రతిస్పందించిన వీడియో వైరల్ అయ్యింది.
భవిష్యత్తులో కంగనాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? అని సందీప్‌ను ప్రశ్నించగా, "నాకు అవకాశం వస్తే ఆమె ఆ పాత్రకు సరిపోతుందని నాకు అనిపిస్తే, నేను వెళ్లి కథ చెబుతాను. నేను ఆమె సినిమాలు చాలా చూశాను. తన నటన నాకు చాలా ఇష్టం. కాబట్టి యానిమల్ గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేసినా కానీ నేను పట్టించుకోను. నాకు కోపం కూడా రాదు" అని అన్నారు. "యానిమల్ చిత్రంలోని స్త్రీ విద్వేష సన్నివేశాలపై కంగన విమర్శించినా కానీ నేను పట్టించుకోను. ఆమె ఏమన్నారో కూడా నాకు తెలీదు. కానీ తన నటన అంటే నాకు ఇష్టం. క్వీన్, తను వెడ్స్ మను సహా చాలా చిత్రాలలో కంగన నటన నాకు నిజంగా నచ్చింది" అని సందీప్ తెలిపారు.
అయితే దీనిపై కంగనా ప్రతిస్పందించింది. ఆమె హిందీలో ఇలా రాసింది. "సమీక్ష, విమర్శలు ఒకేలా ఉండవు. ఇతరుల కోణం నుంచి కళను సమీక్షించాలి.. చర్చించాలి.. ఇది సాధారణ విషయం. నా రివ్యూ చూసి నవ్వుతూ సందీప్ జీ నా పట్ల గౌరవం చూపించిన తీరు గొప్పది. ఆయన మ్యాన్లీగా సినిమాలు తీయడమే కాదు.. ఆయన యాటిట్యూడ్ కూడా మ్యాన్లీ.. ధన్యవాదాలు సార్" అని వ్యాఖ్యానించారు. "అయితే దయచేసి నాకు ఎటువంటి పాత్రను ఇవ్వకండి.. లేకపోతే మీ ఆల్ఫా మగ హీరోలు స్త్రీవాదులు అవుతారు.. ఆపై మీ సినిమాలు కూడా పరాజయం పాలవుతాయి.. మీరు బ్లాక్‌బస్టర్‌లు చేస్తారు.. సినిమా పరిశ్రమకు మీరు కావాలి" అని తనదైన శైలిలో ఛమత్కరించింది క్వీన్.