అర్జున్ రెడ్డికి యానిమల్ కి తేడా అదే..!
హిందీతో పాటుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం 5 భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ రెడ్డి వంగా మీడియా ముందుకు వచ్చారు.
By: Tupaki Desk | 25 Nov 2023 2:32 PM GMTఅర్జున్ రెడ్డితో అదరగొట్టి అదే సినిమాను కబీర్ సింగ్ అంటూ బాలీవుడ్ లో కూడా తీసి సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు సందీప్ వంగ బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో చేసిన సినిమా యానిమల్. వైల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజై సూపర్ బజ్ ఏర్పరచుకుంది. రండ్రి కొడుకుల ఎమోషనల్ కథ అయినా ఇది సందీప్ వంగా మార్క్ వైల్డ్ అటెంప్ట్ తో వస్తుందని తెలుస్తుంది. రణ్ బీర్ కపూర్ కి జోడీగా రష్మిక మందన్న నటించిన ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ అవుతుంది. హిందీతో పాటుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం 5 భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ రెడ్డి వంగా మీడియా ముందుకు వచ్చారు. సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను ఆయన పంచుకున్నారు.
తొలి చిత్రం అర్జున్ రెడ్డిలో ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమకథ కనిపించింది. యానిమల్ ట్రైలర్ చూస్తే ఇది తండ్రి కొడుకుల ప్రేమ కథ అనిపిస్తుందనే ప్రశ్నకు సమాధానంగా అవునండీ ఒక విధంగా ఈ సినిమాను తండ్రి కొడుకుల ప్రేమకథగా అనుకోవచ్చు. ప్రైమరీ స్టొరీ అదే. ఒక వ్యక్తి కుటుంబం కోసం ఎంత దూరం వెళ్తాడనేది కథ యొక్క సారాంశం అని అన్నారు.
అర్జున్ రెడ్డి పాత్రలో చాలా కోపం ఉంటుంది. యానిమల్ లో రణ్బీర్ పాత్రలో కూడా ఆ ఛాయలు కనిపిస్తున్నాయి. పాత్రలు పరంగా అర్జున్ రెడ్డికి యానిమల్ కి సిమిలారిటీస్ ఉన్నాయా అనే ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ.. ఇద్దరూ చాలా నిజాయితీ ఉన్న వ్యక్తులు. అదొక్కటే కామన్ ఫ్యాక్టర్. అర్జున్ రెడ్డి కోపం వస్తే కంట్రోల్ చేయలేని పాత్ర. యానిమల్ పాత్రకు మాత్రం సామాన్యంగా అందరి వ్యక్తులకు ఉండే కోపమే ఉంటుంది. అర్జున్ రెడ్డి, యానిమల్.. ఈ రెండూ కూడా క్యారెక్టర్ బేస్డ్ సినిమాలే. అదొక సిమిలారిటీగా చెప్పొచ్చు. ఇది తప్పించి కథ, పాత్ర కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటాయని అన్నారు సందీప్ వంగ.
మీ చిత్రాలలో హీరో పాత్రని తీవ్రమైన ఎమోషన్, ఇంటెన్స్ తో డిజైన్ చేయడానికి కారణం ఏంటని ప్రశ్న అడగ్గా.. అర్జున్ రెడ్డి విషయానికి వస్తే.. ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉండే పాత్ర. అలాంటిది ప్రేమ దూరమైనపుడు సహజంగానే ఇంటెన్స్ ఎమోషన్ ఉంటుంది. యానిమల్ లో తండ్రి కోసం ఏదైనా చేయగలిగే ఓ కొడుకు పాత్రని రాసుకున్నపుడు.. అతని ఎమోషనల్ కోషెంట్ సహజంగానే హై ఉంటుందని అన్నారు. ఎమోషనల్ గా హై ఉన్న వాళ్ళే అలా చేయగలుగుతారు కావాలని చేసింది కాదని సందీప్ అన్నారు.
ట్రైలర్ చూస్తే ఎమోషన్ చాలా కనిపిస్తోంది. ఆ ఎమోషన్ ని వైలెన్స్ డామినేట్ చేస్తుందా? ఇందులో ఎమోషన్, వైలెన్స్ ఏది ఎక్కువ వుంటుంది అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఎమోషన్, వైలెన్స్ అన్నీ సరిగ్గా బ్యాలెన్స్ చేశాననే అనుకుంటున్నాను చూసి మీరు చెప్పాలని అన్నారు.
నా తర్వాత సినిమాలో వైలెన్స్ ఎలా ఉంటుందో చూపిస్తా అని మీరు ఓ సందర్భంలో చెప్పడం చాలా వైరల్ అయ్యింది.. అర్జున్ రెడ్డి మన తెలుగులో యునానిమస్ గా అందరికీ నచ్చింది. దాదాపు అందరు విమర్శకులు కూడా ప్రశంసించారు. అదే సినిమా హిందీలో చేసినప్పుడు అందరికీ నచ్చింది. కానీ అక్కడ కొంతమంది విమర్శకులు అందులో వైలెన్స్ ఎక్కువ ఉందని అన్నారు. మన సెన్సిబిలిటీస్ కి వాళ్ళకి తేడా ఉందని అనుకున్నా. ఆ సమయంలో ఒక ఇంటర్వ్యూ లో మీ నెక్స్ట్ సినిమాకి ఇంత వైలెన్స్ ఉండకూడదు అని అనడంతో.. మామూలు కాలేజీలో జరిగే ప్రేమకథే వాళ్లకి వైలెన్స్ అనిపించింది కదా.. తండ్రి కోసం ఏదైనా చేసే కొడుకు పాత్ర ఇంకెంత వైలెన్స్ గా అనిపిస్తుందనే ఉద్దేశంతో.. నా నెక్స్ట్ సినిమాలో వైలెన్స్ అంటే ఏమిటో చూపిస్తా అని అన్నాను. అది చాలా వైరల్ అయిపొయిందని అన్నారు సందీప్.
అర్జున్ రెడ్డిలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మరి యానిమల్ లో రష్మిక పాత్రకు కథలో ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుందని అడిగితే.. రష్మిక గారిది చాలా ముఖ్యమైన పాత్ర. సినిమా మొత్తం ఉంటుంది. రెగ్యులర్ గా కాకుండా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. హీరోని పేరెంట్స్ కంటే ఎక్కువ అర్ధం చేసుకున్న పాత్ర. ఇందులో హీరో తర్వాత సమాన ప్రాధన్యత ఉన్నది రష్మిక, అనిల్ కపూర్ పాత్రలకే. ఇందులో మంచి ప్రేమకథ కూడా ఉంటుందని అన్నారు.
యానిమల్ రన్ టైం దాదాపు మూడు గంటల ఇరవై నిముషాలు ఉంది కదా.. అది ప్రతికూలమయ్యే అవకాశం ఉందా అంటే.. లేదని చెప్పారు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి మూడు గంటల ఆరు నిమిషాల సినిమా. అది ఒక అమ్మాయి అబ్బాయి కథే. యానిమల్ లో ఒక కుటుంబం, ప్రత్యర్ధులు ఇలా లేయర్స్ ఉన్నాయి. అర్జున్ రెడ్డి కంటే పదిహేను నిముషాలకే ఎక్కువ. ఇంకొ పది నిముషాలు హాయిగా ఏసీలో కూర్చుని సినిమాని ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉందని చెప్పారు.
రణ్బీర్ కపూర్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ తో పని చేయడం ఎలా అనిపించిదని అడిగితే.. రణ్బీర్ కపూర్ చాలా గొప్ప వ్యక్తిత్వం వున్న మనిషి. ఒక పెద్ద స్టార్, ఇన్ని సినిమాల అనుభవం ఉందనే భావన ఎప్పుడూ చూపించలేదు. ఆయనకి కథ చెప్పాను నచ్చింది. తర్వాత కథ గురించి సినిమా గురించి మాట్లాడుకోవడమే కానీ మరో చర్చ ఉండేది కాదు. విజయ్ తో నా మొదటి సినిమా అర్జున్ రెడ్డికి పని చేసినప్పుడు ఎలా ఉండేదో.. రణ్బీర్ తో పని చేసినప్పుడు కూడా అలానే అనిపించింది. ఇక రణ్బీర్ కపూర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోనే తను అత్యుత్తమ నటుడు ఆయన అని అన్నారు.
ఈ సినిమా టైటిల్ యానిమల్ పెట్టడానికి కారణం ఏంటని అడిగితే.. మనకి చదువు, తెలివితేటలు వచ్చి హ్యూమన్ బీయింగ్ అని పేరు పెట్టుకున్నాం. అయితే మాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. మనకి ఐక్యూ ఉండి, కమ్యునికేషన్ పెరిగి, ఫుడ్ చెయిన్ లో మొదటిగా ఉంటూ వస్త్రాలు ధరించాం. కానీ అవి లేకపోతే యానిమల్ కదా అనేది నా పర్సనల్ ఫీలింగ్. చిన్నప్పుడు సోషల్ స్టడీస్ చదువుకునప్పుటి నుంచి అలానే అనిపించేది. అయితే నేను అలోచించినది ఏమిటంటే.. యానిమల్ కు ఐక్యు ఉండదు. తన ప్రవృత్తితో ప్రవర్తిస్తుంటుంది. ఇందులో హీరో పాత్ర కూడా ఇన్స్టింక్ట్ గా బిహేవ్ చేస్తుంది. అలాంటి పాత్రకు సంభదించిన కథకు యానిమల్ అనే టైటిల్ బాగుటుందని ఈ పేరు పెట్టామని అన్నారు.
ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్ పాత్రలు ఎలా ఉంటాయని అడగ్గా.. యానిమల్ కథలో అనిల్ కపూర్ గారిది కీలక పాత్ర. అతని వల్లే.. అతని గురించే డ్రైవ్ అవుతుంది. బాబీ డియోల్ విలన్ గా కనిపిస్తారు. ఆ పాత్రల గురించి ఎక్కువ రివిల్ చేయకూడదు. తెరపై చూడాల్సిందేనని అన్నారు.
యానిమల్ లో రివెంజ్ కోణం చాలా బలంగా ఉన్నట్లు అనిపిస్తోంది.. దాని రియాక్షన్ ఏంటని అడిగితే.. అవును. రివెంజ్ ని కంటిన్యూ చేయడం మామూలు ఎనర్జీ కాదు. ప్రేమ కంటే రివెంజ్ లో ఎక్కువ ఎనర్జీ ఉందని అనిపించింది. రివెంజ్ సాధించాడా? లేదా అనే మాట కంటే ఆ ప్రయాణం పట్టుకోవడం చాలా కష్టమైన విషయం. మీరు గమనిస్తే వార్ చిత్రాలలో కూడా బలమైన రివెంజ్ ఉంటుంది. యానిమల్ రాస్తున్నప్పుడు కూడా ప్రేమ కంటే రివెంజ్ పెద్ద ఎమోషన్ అనిపించిందని అన్నారు సందీప్.
యానిమల్ పాటలు డిఫరెంట్ కంపోజర్స్ తో చేశారు కదా.. ఆ అనుభవం ఎలా అనిపించింది. హర్ష వర్షన్ రామేశ్వర్ నేపధ్య సంగీతం గురించి ఏమంటారంటే.. నా సినిమాలో సౌండ్, మ్యూజిక్ కి చాలా ప్రాధాన్యత ఇస్తాను. ముంబైలో సోలో కంపోజర్ తో వెళ్లడం కష్టమైపోయింది. అయితే కబీర్ సింగ్ సినిమా అయ్యేసరికి నాకు కొంచెం అది అలవాటైయింది. డిఫరెంట్ కంపోజర్స్ తో వెళితే అందరికీ కథ నేరేట్ చేయాలి. దాని కోసం ప్రత్యేకంగా శ్రమ తీసుకోవాలి. మ్యూజిక్ అంతా ఒక ఆల్బమ్ గా బ్యాలెన్స్ చేయడం కోసం కూడా ఎఫర్ట్ పెట్టాలి. దానిపై ఒక అవగాహన ఉంది కాబట్టి నాకు అది వర్క్ అవుట్ అవుతుంది. హర్ష వర్షన్ రామేశ్వర్ నేపధ్య సంగీతం చేశారు. మాకు మంచి సింక్ కుదిరిందని అన్నారు.
యానిమల్ కు మీ అన్నయ్య గారు కూడా ఒక నిర్మాత.. దీని గురించి మీ సమాధానం అని అడగ్గా.. నన్ను క్రియేటివ్ పరంగా క్రిటిసైజ్ చేసేది మొదటి నుంచి మా అన్నయ్యే. అర్జున్ రెడ్డిని అన్నయ్యే నిర్మించారు. మనం ప్రొడక్షన్ లో ఉంటే క్రియేటివ్ గా కూడా కంట్రోల్ వుంటుంది. భూషణ్ గారితో కబీర్ సింగ్ కి కలిసి పని చేశాను. ఆయన కూడా క్రియేటివ్ గా చాలా ఫ్రీడమ్ ఇస్తారని అన్నారు సందీప్ వంగ.
యానిమల్ చిత్రానికి ఎడిటర్ గా కూడా చేయడానికి కారణం ఏంటన్న ప్రశ్నకు సమాధానంగా.. నేను ఎడిటింగ్ చేస్తా. ఎడిటింగ్ చాలా ఇష్టం. నిజానికి అది చాలా కష్టమైన పని. నా సినిమా నా కంటే ఎక్కువగా ఎవరికీ అర్ధం కాదనేది నా భావన. అయితే ఇంకా బెటర్ గా చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇచ్చేస్తా. అలా అయితే నాకు చాలా సమయం కూడా కలిసొస్తుందని అన్నారు.
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ లాంటి రెండు పెద్ద విజయాల తర్వాత వస్తున్న యానిమల్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని అడిగితే.. నిజంగా నేను అలాంటి ఒత్తిడి తీసుకొను. ఇన్స్టింక్ట్ గా ఆలోచించడం. మంచి అవుట్ పుట్ ఇవ్వడంపైనే దృష్టి ఉంటుంది కానీ మిగతా విషయాలపై ఒత్తిడి తీసుకొనని చెప్పారు.
యానిమల్ లిరిక్స్, యాక్షన్ కొరియోగ్రఫీ గురించి ఏమంటారంటే.. లిరిక్స్ అనంత శ్రీరాం సింగిల్ కార్డ్ రాశారు. లిరిక్స్ తెలుగు నేటివిటీకి తగట్టుగా ఉన్నాయని మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. పాటలు, రిలిక్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ సుప్రీం సుందర్ గారు చేశారు. ఆయన చాలా సాఫ్ట్ పర్సన్. యాక్షన్ మాత్రం వైల్డ్ గా చేశారని అన్నారు.
హీరో పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పింది ఎవరన్న ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ.. ఇందులో హీరో పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పింది వాసు గారు. చాలా అద్భుతంగా చెప్పారు. ఎమోషన్ ని చక్కగా క్యారీ చేశారు. రష్మిక తెలుగు, కన్నడ, హిందీలో స్వయంగా డబ్బింగ్ చెప్పిందని సందీప్ వంగ చెప్పారు.
అన్ స్టాపబుల్ షో లో బాలయ్య గారిని కలవడం ఎలా అనిపించిందన్న ప్రశ్నకు సమాధానంగా.. అన్ స్టాపబుల్ షో చూసి షాక్ అయ్యాను. ఈ ప్రోగ్రాం ఎవరు డిజైన్ చేశారో కానీ వాళ్లకు హ్యాట్సప్. ఎందుకంటే బాలయ్య బాబు గారు అంటే సీరియస్ గా ఉంటారనే ఇమేజ్ వుంది. కానీ ఆ షో చూసిన తర్వాత ఆయన ఇంత సరదాగా ఉన్నారనిపించింది. బాలకృష్ణ గారు చెప్పిన మొఘల్ ఈ ఆజం డైలాగులకు రణ్బీర్ కపూర్ మతిపోయింది. అది రణ్బీర్ కపూర్ ముత్తాత సినిమా. అందులో డైలాగులు రణ్బీర్ కి కూడా గుర్తు లేవు. బాలకృష్ణ గారు చెప్పిన డైలాగులు విని నేను ఆలోచనలో పడిపోయాను. అసలు అంత మెమరీ ఎలా ఉంటుందని షాక్ అయ్యాను. మామూలు డైలాగులు కావు అవి. బాలకృష్ణ గారి ఫ్యాన్ అయిపోయా. తెలుగులో కాదు నార్త్ లో కూడా ఇప్పుడా డైలాగులు ఎవరికీ గుర్తు ఉండవు. కొత్తగా ఆడిషన్స్ కి వెళ్ళే నటులు కూడా ఆ డైలాగులు చెప్పారు. ఎందుకంటే అవి చాలా కష్టమైనవని అన్నారు సందీప్ వంగ.
మీరు చేయబోయే నెక్స్ట్ సినిమా ప్రభాస్ గారి దేనా అంటే.. అవును.. జూన్ నుండి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది, ఈ గ్యాప్ లో ట్రీట్ మెంట్ డైలాగ్స్ పై వర్క్ చేయాలని అన్నారు.
ప్రభాస్, అల్లు అర్జున్ గారి తర్వాత ఇంకెవరికైనా కథలు చెప్పారా అన్న ప్రశ్నకు సమాధానంగా.. మహేష్ బాబు గారికి ఓ కథ చెప్పాను. అది ఆయనకి నచ్చింది. అయితే వేరే కమిట్మెంట్స్ వలన ముందుకు వెళ్ళలేదు. మహేష్ బాబు, రామ్ చరణ్ గారు.. ఇలా అందరితోనూ సినిమాలు చేయాలని ఉందని తన మనసులో మాటని చెప్పారు సందీప్ వంగ.