Begin typing your search above and press return to search.

సంధ్య థియేటర్‌ చరిత్ర తెలుసా...!

తెలుగు సినిమాకు ఎంతటి చరిత్ర ఉందో తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్‌కి అంతటి చరిత్ర ఉంది.

By:  Tupaki Desk   |   18 Dec 2024 5:38 AM GMT
సంధ్య థియేటర్‌ చరిత్ర తెలుసా...!
X

తెలుగు సినిమాకు ఎంతటి చరిత్ర ఉందో తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్‌కి అంతటి చరిత్ర ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడప్పుడే పెద్ద థియేటర్లు మొదలు అవుతున్నాయి. 70MM థియేటర్‌లు దేశంలో కొన్ని మాత్రమే ఉన్న సమయంలో సంధ్య థియేటర్‌ ప్రస్థానం మొదలైంది. 1980లో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ప్రారంభం అయిన సంధ్య థియేటర్‌లో మొదటగా హిందీ సినిమా 'షాలిమార్‌' ప్రదర్శింపబడింది. ఆ తర్వాత బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ 'షోలే' సంధ్య థియేటర్‌లో రిలీజ్ అయ్యింది. అక్కడ నుంచి సంధ్య థియేటర్‌ జర్న చారిత్రాత్మకంగా కొనసాగుతూనే వచ్చింది.

గడచిన పాతిక సంవత్సరాలుగా స్టార్‌ హీరోల సినిమాలు అనగానే ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో సంధ్య థియేటర్‌ మెయిన్‌ థియేటర్‌గా చెప్పుకునే వారు. మల్టీప్లెక్స్‌లు లేని రోజుల్లో సెలబ్రెటీలు మొత్తం ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌కి క్యూ కట్టే వారు. మొదటి రోజు తమ సినిమాలను థియేటర్‌లలో చూడాలి అనుకున్న వారు, వారం మధ్యలో జనాలతో సినిమాలు చూడాలనుకున్న స్టార్స్ నుంచి ప్రతి ఒక్క సెలబ్రెటీ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కి వెళ్లేవారు. అక్కడ అత్యధికంగా సంధ్య థియేటర్‌లోనే సినిమాలను చూసే వారు. థియేటర్ ఒకప్పుడు 1500 మంది ప్రేక్షకుల కెపాసిటీతో ఉండేది. కానీ ఆ తర్వాత వసతులు పెంచుతూ, మోడ్రన్‌గా మార్చిన సమయంలో 1323కి సీటింగ్ కెపాసిటీని తగ్గించడం జరిగింది.

ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఎన్నో థియేటర్‌లు ఉన్నా సంధ్య థియేటర్ చాలా స్పెషల్‌ థియేటర్‌గా స్టార్స్‌ చెబుతూ ఉంటారు. ఆ థియేటర్‌లో తమ సినిమా పడాలి అంటూ పెద్ద హీరోలు పోటీ పడేవారు. ఒకప్పుడు ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో తమ సినిమా పడాలి అంటే తమ సినిమా పడాలి అంటూ గొడవలు పడిన సందర్భాలు ఉన్నాయి. సంధ్య థియేటర్‌ను మెయిన్‌ థియేటర్‌గా విడుదల చేసే వారు. ఒకప్పుడు సినిమాలు విడుదల అయ్యే థియేటర్ల సంఖ్య చాలా తక్కువ ఉండేది. అయితే సంధ్య ధియేటర్ కచ్చితంగా తమ థియేటర్‌ల జాబితాలో ఉండాలి అంటూ స్టార్‌ హీరోలు సెంటిమెంట్‌గా నిర్మాతలకు చెప్పే వారు.

సంధ్య 70MMతో పాటు 35MM కూడా ఉంటుంది. 1981లో సంధ్య 35MM థియేటర్ మొదలైంది. స్టార్‌ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఎంతో మందిని ప్రేక్షకులకు పరిచయం చేసిన సంధ్య థియేటర్‌ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే వివాహిత మృతి చెందడంతో థియేటర్‌ పై చర్యలు ఎందుకు తీసుకోకూడదు చెప్పాలి అంటూ పోలీసులు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. పది రోజుల్లో ఆ నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకుంటే సంధ్య థియేటర్‌ మూతపడే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయమై సినీ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.