Begin typing your search above and press return to search.

సంధ్య థియేటర్ ఘటన.. శ్రీతేజ్ కోసం వెళ్లిన సుకుమార్

అయితే తాజాగా కిమ్స్ హాస్పిటల్ కు డైరెక్టర్ సుకుమార్ వెళ్లారు. చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను పరామర్శించారు. ఆస్పత్రిలో ఉన్న అతడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

By:  Tupaki Desk   |   19 Dec 2024 11:54 AM GMT
సంధ్య థియేటర్ ఘటన.. శ్రీతేజ్ కోసం వెళ్లిన సుకుమార్
X

పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ (13) తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. కొద్ది రోజులుగా మ్యత్యువుతో పోరాడుతున్నాడు.

అయితే తాజాగా కిమ్స్ హాస్పిటల్ కు డైరెక్టర్ సుకుమార్ వెళ్లారు. చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను పరామర్శించారు. ఆస్పత్రిలో ఉన్న అతడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఫ్యూచర్ లో ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చినా తాను సపోర్ట్‌ గా ఉంటానని భ‌రోసా ఇచ్చారు. కిమ్స్ వైద్యులతో కూడా మాట్లాడారు. చికిత్సకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటికే సుకుమార్ సతీమణి తబిత.. రెండు సార్లు ఆస్పత్రికి వెళ్లి శ్రీ తేజ్ ను పరామర్శించినట్లు తెలుస్తోంది. అతడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారట. ఆ సమయంలో సుకుమార్ తరఫున రూ.5 లక్షల చెక్కును కూడా అందించారని సమాచారం. ఇప్పుడు సుకుమార్.. ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించి వచ్చారు.

ఇక నిన్న నిర్మాత అల్లు అరవింద్.. ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ ను కలిశారు. రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆస్పత్రిలోని డాక్టర్లందరితో మాట్లాడానని తెలిపారు. బాలుడు రోజురోజుకు రికవరీ అవుతున్నట్లు వైద్యులు తనకు చెప్పినట్లు చెప్పారు. శ్రీతేజ్ కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని అన్నారు.

అయితే తాము శ్రీతేజ్ కోలుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పిన అల్లు అరవింద్.. ప్రభుత్వం కూడా అతడిని మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు బాగా శ్రమిస్తోందని తెలిపారు. ఘటన జరిగిన తర్వాత రోజు ఉదయమే అల్లు అర్జున్ ఆస్పత్రికి వెళ్దామనుకున్నాడని, కానీ కొన్ని కారణాల వల్ల వెళ్లలేదని చెప్పారు.

ఇప్పుడు అల్లు అర్జున్ పై కేసు ఉందని కనుక, ఆస్పత్రికి రాలేకపోయాడని తెలిపారు. తాను బాధపడుతూ.. తనకు వెళ్లమని చెప్పారని అల్లు అరవింద్ అన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్‌ తీసుకుని బాలుడిని పరామర్శించడానికి తాను వచ్చానని చెప్పారు. అయితే 15 రోజులుగా కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్.. త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు.