రూ.72 కోట్ల ఆస్తి రాసిచ్చిన ఫ్యాన్.. తిరస్కరించిన నటుడు
కానీ ఒక లేడీ అభిమాని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌పై ఉన్న అభిమానంతో ఏకంగా రూ.72 కోట్ల తన ఆస్తిని రాసి ఇచ్చింది.
By: Tupaki Desk | 11 Feb 2025 5:46 AM GMTసినిమా హీరోలకు, హీరోయిన్స్‌కి ఏ స్థాయిలో ఫ్యాన్స్ ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమాన నటుడు లేదా నటి కోసం చంపడానికి, చావడానికి సైతం సిద్ధంగా ఉండే వారు చాలా మంది ఉంటారు. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే వేల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, వందల రూపాయలు పెట్టి టికెట్ కొనుగోలు చేసి సినిమాని చూడటం మనం ఇప్పటి వరకు చూశాం. కానీ ఒక లేడీ అభిమాని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌పై ఉన్న అభిమానంతో ఏకంగా రూ.72 కోట్ల తన ఆస్తిని రాసి ఇచ్చింది. 2018లోనే సంజయ్ దత్‌కి తన ఆస్తి దక్కాలని ఆ అభిమాని వీలునామా రాసింది. విషయం తెలిసి నటుడు సంజయ్ దత్ షాక్ అయ్యారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... నిషా పాటిల్(62)కి చిన్నప్పటి నుంచి సంజయ్ దత్ అంటే చాలా ఇష్టం. నిషా పాటిల్‌కి ఎప్పటి నుంచో సునీల్ దత్, నర్గీస్ దత్ లపై అభిమానం. వారి కొడుకు అయిన సంజయ్ దత్ అంటే మరింత అభిమానం పెరిగింది. సంజయ్ దత్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి నిషా పాటిల్ అభిమానిస్తూ వస్తుంది. సాధారణంగా అభిమానం ఉంటే ఎక్కువ శాతం మంది ఆయా నటీ నటులను చూసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ నిషా పాటిల్ మాత్రం ఎప్పుడూ సంజయ్ దత్‌ని కలిసేందుకు గట్టి ప్రయత్నం చేయలేదు. అయినా ఆయనపై అభిమానం వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది.
2018లో నిషా పాటిల్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రి పాలయ్యింది. ఆ సమయంలోనే తన తదనంతరం తనకు ఉన్న ఆస్తినంతా సంజయ్ దత్‌కి అప్పగించాలంటూ వీలునామా రాయించింది. తన రూ.72 కోట్ల ఆస్తిని సంజయ్ దత్‌కి ఇవ్వాలని ఆమె భావించింది. సంజయ్ దత్ ఒకానొక సమయంలో జైలుకు వెళ్లడం, అనారోగ్య పరిస్థితులను ఎదుర్కోవడం, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం వల్ల నిషా పాటిల్ ఆ నిర్ణయాన్ని తీసుకుందని సమాచారం. ఇటీవల నిషా పాటిల్ మృతి చెందారు. దాంతో ఆమె రాసిన వీలునామా బయటకు వచ్చింది. నిషా పాటిల్ వీలునామా ప్రకారం సంజయ్ దత్‌కి ఆ ఆస్తిని ఇచ్చేందుకు లాయర్‌లు సిద్ధం అయ్యారు.
నిషా పాటిల్ వీలునామా గురించి తెలుసుకున్న సంజయ్ దత్ షాక్ అయ్యారట. ఇప్పటి వరకు ఎప్పుడూ నిషా పాటిల్‌ను కలవలేదు. అలాంటి వ్యక్తి అభిమానంకు కృతజ్ఞుడిని. కానీ ఆమె ఆస్తి తనకు వద్దని సున్నితంగా సంజయ్ దత్ తిరస్కరించారు. నిషా పాటిల్ తన తదనంతరం తన బ్యాంక్ ఖాతాలో ఉన్న మొత్తంను సంజయ్ దత్‌కి ట్రాన్సపర్ చేయాలని ముందుగానే విజ్ఞప్తి చేశారు. అదే విషయాన్ని బ్యాంక్ అధికారుల ద్వారా తెలుసుకున్న సంజయ్ దత్ షాక్ అయ్యారట. తనకు నిషా పాటిల్ ఆస్తి అక్కర్లేదని సంజయ్ దత్ అన్నారు. తన లీగల్ టీంతో చర్చించి ఆ ఆస్తిని నిషా పాటిల్ కుంటుంబ సభ్యులకు అందే విధంగా చూస్తాను అన్నారు. అంతే కాకుండా త్వరలోనే నిషా పాటిల్ కుటుంబ సభ్యులను కలుస్తానని అన్నారు. అంత గొప్ప ఫ్యాన్‌ను బతికి ఉన్నప్పుడు కలుసుకోలేక పోయినందుకు సంజయ్ దత్ ఆవేదన వ్యక్తం చేశారు.