Begin typing your search above and press return to search.

1500 కోట్ల ఆస్తుల‌తో చ‌ర‌ణ్-ప్ర‌భాస్‌ కంటే ధ‌నికుడు!

ఒక నివేదిక ప్ర‌కారం.. టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిక‌ర ఆస్తి విలువ -1300 కోట్లు కాగా, రెబ‌ల్ స్టార్ ప్రభాస్ నికర ఆస్తి రూ. 400 కోట్లు.

By:  Tupaki Desk   |   31 Dec 2024 4:12 AM GMT
1500 కోట్ల ఆస్తుల‌తో చ‌ర‌ణ్-ప్ర‌భాస్‌ కంటే ధ‌నికుడు!
X

ఒక నివేదిక ప్ర‌కారం.. టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిక‌ర ఆస్తి విలువ -1300 కోట్లు కాగా, రెబ‌ల్ స్టార్ ప్రభాస్ నికర ఆస్తి రూ. 400 కోట్లు. పుష్ప 2తో సంచ‌ల‌నం సృష్టించిన‌ అల్లు అర్జున్ నిక‌ర ఆస్తి విలువ రూ. 350 కోట్లు (స్వ‌యం ఆర్జితం). బాలీవుడ్ సూప‌ర్ స్టార్ రణబీర్ కపూర్ నిక‌ర ఆస్తుల విలువ రూ. 550 కోట్లు. వీరంతా యంగ్ ఏజ్ లోనే భారీగా ఆస్తుల‌ను కూడ‌గ‌ట్టారు. ఇది కేవ‌లం సినీరంగం నుంచి మాత్ర‌మే ఆర్జ‌న కాదు. ర‌క‌ర‌కాల వ్యాపార మార్గాల్లో ఆర్జించిన‌ది క‌లుపుకుంటే ఇంత పెద్ద మొత్తం సాధ్య‌మైంది.

అయితే ద‌క్షిణ‌ భార‌త‌దేశంలో అంతగా ప్ర‌జ‌లు గుర్తించ‌ని ఒక హీరో ఆస్తి 1500 కోట్లుగా ఉంది. ఆ హీరో ఉత్త‌రాదికి చెందిన వాడు. పెద్ద సినీకుటుంబం నుంచి వ‌చ్చినా మ‌ధ్య‌లో సినీ ప‌రిశ్ర‌మ‌ను వ‌దిలేయ‌డంతో అతడికి గుర్తింపు అంతంత మాత్ర‌మే. అత‌డు మ‌రెవ‌రో కాదు.. ద‌ర్శ‌క‌న‌టుడు సంజయ్ ఖాన్ కుమారుడు .. లెజెండ‌రీ ఫిరోజ్ ఖాన్ మేనల్లుడు జాయెద్ ఖాన్. చుర లియా హై తుమ్నే (2003)తో ఈ యువ‌కుడు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. న‌టుడిగా కొన్ని సినిమాలు మాత్ర‌మే చేసాడు. కానీ ఇప్పుడు సంపదలో రామ్ చ‌ర‌ణ్‌, ప్రభాస్, రణబీర్ కపూర్, ర‌జ‌నీకాంత్ స‌హా చాలా మంది హీరోల‌ను అధిగమించాడు. దేశంలోనే తెలివైన వ్యాపార‌వేత్త‌గా ఎదిగాడు.

జాయెద్ ఖాన్ 2003లో తన తొలి చిత్రం `చురా లియా హై తుమ్నే`తో హిందీ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంత‌గా ఆడ‌లేదు. కానీ జాయెద్‌కి 2004లో మై హూ నాతో పెద్ద బ్రేక్ వచ్చింది. సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో క‌లిసి న‌టించ‌గా పెద్ద హిట్ట‌యింది. లక్కీ అనే ఎన‌ర్జిటిక్ కేర్ లెస్ యువకుడిగా నటించి మెప్పించాడు. ఈ పాత్రతో యువ‌త‌రానికి క‌నెక్ట‌య్యాడు. ఆ త‌ర్వాత దస్ (2005), షాదీ నెం. 1 (2005), బ్లూ (2009) సహా వరుస చిత్రాలలో న‌టించాడు. కొన్ని విజ‌యాలు ఉన్నా ఫ్లాపులు ఎదుర‌వ్వ‌డంతో అత‌డు చివ‌రికి వ్యాపార రంగంలోకి వెళ్లిపోయాడు. 2017లో బుల్లితెర సీరియ‌ల్ `హాసిల్‌`లో చివరిగా క‌నిపించాడు. న‌టుడిగా కెరీర్ ప‌థం ముగిసాక అత‌డు చాలా హార్డ్ వ‌ర్క్ చేసి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పట్టా పొందిన అతడు వ్యాపారవేత్తగా తన చతురతను ప్రదర్శిస్తూ స్టార్టప్‌లు , ఇతర వెంచర్‌లలో వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టాడు. ఈ ప్ర‌యోగం పెద్ద స‌క్సెసై 2024 నాటికి రూ.1,500 కోట్ల నిక‌ర ఆస్తుల‌(ఇ.టి న‌వ్ క‌థ‌నం ప్ర‌కారం)తో జాయేద్ ధ‌నికుల జాబితాలో చేరాడు.

మెగాస్టార్ చిరంజీవి న‌ట‌వార‌సుడు రామ్ చ‌ర‌ణ్‌, రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు న‌ట‌వార‌సుడు ప్ర‌భాస్, లెజెండ్ రిషీ క‌పూర్ ల న‌ట‌వార‌సుడు ర‌ణ‌బీర్ క‌పూర్ కంటే ఎక్కువ సంపాదించాడు జాయేద్ ఖాన్. వ్య‌క్తిగ‌త జీవితంలోను జాయేద్ సంతృప్తిక‌రంగా ఉన్నాడు. 2005లో తన చిన్ననాటి స్నేహితురాలు , ప్రతిభావంతులైన జ్యువెలరీ డిజైనర్ అయిన మలైకా పరేఖ్‌తో వివాహం చేసుకున్నాడు. భార్య‌, ఇద్ద‌రు కుమారులు జిదాన్, ఆరిజ్‌లతో సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతున్నాడు. గ్లామ‌ర్ రంగంలో ఉన్నా లైమ్ లైట్ లో ఉన్న‌ప్పుడే వ్యాపార రంగంలో తార‌లు పెట్టుబ‌డులు పెడుతున్నారు. అవి గొప్ప వ్యాపార సామ్రాజ్యాలుగా మారుతున్నాయ‌న‌డానికి జాయేద్ స్టోరి ఒక ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే.