భన్సాలీ వేశ్యల కథలతో మరో భారీ ప్రయోగం?
ఓవైపు వెబ్ సిరీస్ లు మరోవైపు సింగిల్ ఆల్బమ్స్ తో ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది నటి సంజీదా షేక్.
By: Tupaki Desk | 17 Dec 2024 7:30 AM GMTఓవైపు వెబ్ సిరీస్ లు మరోవైపు సింగిల్ ఆల్బమ్స్ తో ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది నటి సంజీదా షేక్. కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన `హీరామండి : ది డైమండ్ బజార్`లో ఈ భామ నటించింది. చిన్న పాత్రే అయినా తన నటనకు మంచి గుర్తింపు దక్కింది. ఇటీవల `తుమ్ క్యా హో` అనే మ్యూజిక్ వీడియోతో అభిమానుల ముందకు వచ్చింది. ఇందులో జాన్ అబ్రహం కూడా నటించారు. ఏడాది ముగింపు ఆనందంగా ఉందని చెప్పిన సంజీదా.. ఇంతలోనే హీరామండి 2 గురించి అప్ డేట్ చెప్పింది.
జీవితంలో నిన్నటి కంటే నేడు.. నేటి కంటే రేపు మెరుగ్గా ఉండాలనుకుంటానని సంజీదా తాజా ఇంటర్వ్యూలో అన్నారు. 2025 పెద్దదిగా, మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నాను. గత సంవత్సరం ఒక వరం. ఒక నటిగా గొప్ప నటులు, దర్శకనిర్మాతలతో కలిసి పనిచేయడం సృజనాత్మకంగా చాలా సంతృప్తికరంగా ఉందని అన్నారు. కున్ ఫయా కున్, హీరమండి 2 లాంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నట్టు సంజీదా వెల్లడించింది. మొన్న జూన్‌లో ఫ్లాష్ మాబ్‌తో హీరామండి సీక్వెల్ ని ప్రకటించారు. ఈ సీక్వెల్ మొదటి భాగం కంటే పెద్దది.. మెరుగైనది. అనూహ్యంగా ఉంటుంది కాబట్టి నటీనటులంతా సిద్ధంగా ఉండాల్సిన సమయం వచ్చిందని సంజీదా అన్నారు.
హీరామండి విడుదల తర్వాత తన జీవితంలో ఆశించిన మార్పు వచ్చిందని అన్నారు. నేను ఇప్పుడు మీటింగ్‌లకు వెళ్లినప్పుడు ఎంత మంచి పెర్‌ఫార్మర్ అని దర్శకనిర్మాతలు మాట్లాడుతున్నారు. అది గొప్ప అనుభూతినిస్తుందని అన్నారు. నా ప్రతిభను ఇకపై ప్రజలకు పరిచయం చేయనవసరం లేదని కూడా సంజీదా పేర్కొన్నారు.
నేను ఇంతకు ముందు టీవీ పరిశ్రమలో పని చేశాను. ఇటీవల టీవీ లో అవకాశాలు వస్తున్నా తిరస్కరిస్తున్నానని కూడా చెప్పింది. హీరామండి తన జీవితాన్ని మార్చిందని, ఇంకా పెద్దది ఏదో చేయబోతున్నానని అందరూ తెలుసుకుంటారని కూడా ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసింది.
ఈ ఏడాదిలో గూగుల్ ట్రెండ్స్‌లో అత్యధికంగా శోధించిన ఏకైక భారతీయ ప్రదర్శనగా హీరామండి రికార్డుల్లో నిలిచింది. ఇది చాలా ఆనందాన్నిచ్చింది. నటులు పాత్రధారులకు ఇది మంచి గుర్తింపునివ్వడమేనని సంజీదా ఇంటర్వ్యూని ముగించారు.