క్రేజీ మల్టీస్టారర్ మిడిల్ డ్రాప్?
ఇప్పటికే ఈ సినిమా వివాదాల బాట పట్టడంతో సోషల్ మీడియా వేదికగా ఊహాగానాలు మొదలయ్యాయి.
By: Tupaki Desk | 25 Aug 2024 4:30 PM GMTఅక్షయ్ కుమార్ `వెల్‌కమ్ టు ది జంగిల్` (వెల్‌కమ్ 3) చిత్రీకరణ ఆగిపోయిందా? జియో స్టూడియోస్ అధికారిక యూట్యూబ్ ఛానెల్ నుండి సినిమా ప్రకటన వీడియో కనిపించకుండా పోయిన తర్వాత ఈ ప్రశ్న అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఈ చిత్రం ఆగిపోయిందా లేదా జియో స్టూడియోస్ ప్రాజెక్ట్ నుండి వైదొలిగిందా అనే దానిపై ఎటువంటి నిర్ధారణ లేనప్పటికీ ఇది అక్షయ్ కుమార్ అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఇప్పటికే ఈ సినిమా వివాదాల బాట పట్టడంతో సోషల్ మీడియా వేదికగా ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ మేరకు ప్రఖ్యాత న్యూస్ 18 ఓ కథనాన్ని వెలువరించింది.
బాలీవుడ్‌లో వెల్‌కం ఫ్రాంఛైజీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సిరీస్ నుంచి ఏడాది క్రితం మూడో భాగాన్ని అధికారికంగా ప్రకటించారు. వెల్ కం ఫ్రాంచైజీలో మూడవ చిత్రం `వెల్‌కమ్ టు ది జంగిల్`ని 2023లో ప్రకటించగా.. అది సంచలనంగా మారింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, దిశా పటానీ, రవీనా టాండన్, లారా దత్తా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లాంటి భారీ తారాగణం నటిస్తున్నారని పోస్టర్లు కూడా వేశారు. పరేష్ రావల్, అర్షద్ వార్సీ, జానీ లివర్, రాజ్‌పాల్ యాదవ్, తుషార్ కపూర్, శ్రేయాస్ తల్పాడే, కృష్ణ అభిషేక్, కికు శారదా, దలేర్ మెహందీ, మికా సింగ్, ముఖేష్ తివారీ, జాకీర్ హుస్సేన్, యశ్‌పాల్ శర్మ, సయాజీ షిఫ్దా, జాకీ షివ్ డాఫ్ వంటి ప్రముఖ నటీనటులు ఇందులో నటిస్తున్నారు.
అయితే డేట్ సమస్యల కారణంగా సంజయ్ దత్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. బాలీవుడ్ హంగామా కథనం ప్రకారం..సంజయ్ దత్ తన నిష్క్రమణకు కారణం కాల్షీట్ల సమస్యను ప్రస్థావించారు. అతడు తన ప్రియమైన స్నేహితుడు అక్షయ్ కుమార్‌కు అన్ని సమస్యలను తెలియజేశాడు. వెల్‌కమ్ టు ది జంగిల్ షూట్ అనాలోచితంగా జరుగుతోందని, స్క్రిప్ట్‌లో చాలా మార్పులతో, షూట్‌కి సంబంధించిన తన డైరీ షెడ్యూల్‌కి అంతరాయం కలిగిందని, అందుకే సంజయ్ దత్ వేరే దారి వెతుక్కున్నాడని కూడా ప్రచారమైంది. తాజా కథనం ప్రకారం సంజయ్ ఇప్పటికే 15 రోజులు షూట్ పూర్తి చేసాడు. అతని సన్నివేశాలను రీషూట్ చేయాలా లేదా అతని అదృశ్యాన్ని కథలో చేర్చాలా అనే దానిపై మేకర్స్ అయోమయంలో పడ్డారని కూడా కథనాలొచ్చాయి. వెల్‌కమ్‌లో ఉదయ్ శెట్టి పాత్రను పోషించిన నానా పటేకర్ `వెల్‌కమ్ 3`కి కథ లేకపోవడం గురించి బహిరంగంగా మాట్లాడాడు. అందుకే అతడు ఈ సినిమాను తిరస్కరించాడు.
వెల్‌కమ్ టు ది జంగిల్ ఈ సంవత్సరంలో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటి. చాలా సంవత్సరాల తర్వాత అక్షయ్ కుమార్ తిరిగి తన కామెడీ జానర్ కి తిరిగి వస్తున్నాడు. 30 మందికి పైగా అగ్ర నటీనటులతో ఈ సినిమా తెరకెక్కుతుండడం సర్వత్రా ఉత్కంఠను కలిగింది. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేయగా రకరకాల కారణాలతో చిత్రీకరణ ఆలస్యమవుతోంది. ఇటీవల ఈ చిత్రం కోసం కొత్త విడుదల తేదీని వెతుకుతున్నారని సమాచారం. వెల్‌కమ్ టు ది జంగిల్ 20 డిసెంబర్ , 2025న విడుదలవుతుందని ప్రచారమైంది. అయితే అనౌన్స్‌మెంట్ వీడియోను జియో స్టూడియోస్ నుంచి తీసివేయడం వలన సినిమా సమస్యల్లో పడిందని ఊహాగానాలకు దారితీసింది. అయితే జియో స్టూడియోస్ నుండి లేదా చిత్ర బృందం నుండి ఇంకా ఎటువంటి ధృవీకరణ లేదు.