ధూమ్- ధూమ్ 2 చిత్రాల దర్శకుడు మృతి
ధూమ్ (2004)- ధూమ్ 2 (2006) చిత్రాల సృష్టి కర్త దర్శకుడు సంజయ్ గాధ్వి నవంబర్ 19 ఆదివారం ముంబైలో మరణించారు
By: Tupaki Desk | 19 Nov 2023 9:26 AM GMTధూమ్ (2004)- ధూమ్ 2 (2006) చిత్రాల సృష్టి కర్త దర్శకుడు సంజయ్ గాధ్వి నవంబర్ 19 ఆదివారం ముంబైలో మరణించారు. ఆయనకు 56 ఏళ్లు. మూడు రోజుల్లో 57వ ఏట అడుగుపెడుతుండగా ఈ విషాధం అలుముకుంది. ఈ వార్తలను ఆయన కుమార్తె సంజినా గాధ్వి ధృవీకరించారు. ఆయన ఈ ఉదయం 9.30 గంటలకు తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో గాధ్వి మరణించారని సమాచారం.సంజయ్ గాధ్వి నిజానికి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పారు.
సంజయ్ గాద్వికి భార్య జినా .. కుమార్తెలు ఉన్నారు. సంజినా పెద్ద అమ్మాయి. అతడి మరణంపై స్పందించిన బాలీవుడ్ ప్రముఖులలో దర్శకుడు కునాల్ కోహ్లీ ఒకరు. X (గతంలో ట్విటర్) వేదికగా కునాల్ ఇలా వ్యాఖ్యానించారు. ''ఇది దిగ్భ్రాంతికరమైనది. #SanjayGadhvi RIP .. నేను మీ మరణవార్త రాయాల్సి ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. YRF, లంచ్ డబ్బాస్, డిస్కషన్స్‌లో చాలా సంవత్సరాలు ఆఫీసును షేర్ చేసుకున్నారు. నిన్ను మిస్ అవుతాను మిత్రమా. ఇది అంగీకరించడం చాలా కష్టం'' అని రాసారు.
సంజయ్ గాధ్వి ఎవరు?
సంజయ్ గాధ్వి 2000లో 'తేరే లియే' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. నవతరం నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత అతడు తన చిత్రం 'మేరే యార్ కి షాదీ హై' (2002)తో ఒక ముద్ర వేశాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ మూవీలో ఉదయ్ చోప్రా, తులిప్ జోషి (ఆమె తొలి చిత్రంలో), జిమ్మీ షీర్‌గిల్, బిపాసా బసు నటించారు. ఇది ఇతర YRF చిత్రాల వలె వాణిజ్యపరంగా విజయవంతం కానప్పటికీ దీనిపై చాలా చర్చ జరిగింది. అయితే ధూమ్ సిరీస్ సాధించిన విజయాలతో గాధ్వి కి 'ధూమ్' ఇంటి పేరుగా మారింది.
2004లో జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా ప్రధాన పాత్రల్లో ధూమ్ చిత్రాన్ని తెరకెక్కించి రిలీజ్ చేసారు. ఆ చిత్రం భారీ బ్లాక్ బస్టర్. 2006లో అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా, రిమీ సేన్‌లతో ధూమ్ 2ని తెరకెక్కించాడు. ఈసారి అతడు హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్, బిపాషా బసు లాంటి తారాగణాన్ని అదనంగా జోడించాడు. ఈ సినిమా ధూమ్ కంటే పెద్ద హిట్ అయింది. అయితే అతడు ధూమ్ 3 కోసం తిరిగి పని చేయలేదు. అతడు ఇమ్రాన్ ఖాన్ తో 'కిడ్నాప్' చిత్రానికి పని చేసాడు. 2012లో 'అజబ్ గజబ్ లవ్'ని విడుదల చేసిన తర్వాత కొంత విరామం తీసుకున్నాడు. అతడు 2020లో 'ఆపరేషన్ పరిండే'తో కంబ్యాక్ అయ్యాడు. ఇది అతడు దర్శకత్వం వహించిన చివరి సినిమా.