సంక్రాంతి బాక్సాఫీస్.. హీరోల సెంచరీల మోత
కొత్త సంవత్సరానికి మంచి ఆరంభం కావాలని ప్రేక్షకులు ఆశపడుతుంటే, నిర్మాతలు తమ భారీ బడ్జెట్ చిత్రాలను విడుదల చేసి బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తుంటారు
By: Tupaki Desk | 16 Jan 2025 2:26 PM GMTతెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతి అంటేనే ప్రత్యేకమైన సందడి కనిపిస్తుంది. కొత్త సంవత్సరానికి మంచి ఆరంభం కావాలని ప్రేక్షకులు ఆశపడుతుంటే, నిర్మాతలు తమ భారీ బడ్జెట్ చిత్రాలను విడుదల చేసి బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తుంటారు. ఈ ఏడాది సంక్రాంతి కూడా అదే తరహా అంచనాలతో ప్రారంభమైంది. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, నందమూరి బాలకృష్ణ డాకు మహరాజ్, విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఒకదానికొకటి పోటీగా సందడి చేశాయి.
ఈ మూడు సినిమాలు సంక్రాంతి సీజన్‌కి మంచి ఆరంభం ఇచ్చాయి. బాలయ్య, వెంకటేష్, రామ్ చరణ్.. ముగ్గురు కూడా తమ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నారు. ప్రతి సినిమాకీ విభిన్నమైన కాన్సెప్ట్ ఉండడం, పండగ సీజన్ కారణంగా కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సందడి చేశారు. బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టడంలో ఈ మూడు సినిమాలు విజయవంతమయ్యాయి.
సాధారణంగా సంక్రాంతి బరిలో కొన్ని సినిమాలు మాత్రమే 100 కోట్ల మార్క్ అందుకుంటాయి. కానీ ఈ ఏడాది ప్రేక్షకుల ఆదరణతో అన్ని సినిమాలు 100 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త చరిత్ర సృష్టించాయి. గేమ్ ఛేంజర్ మొదటి రోజే జెట్ స్పీడ్‌లో 100 కోట్ల మార్క్ అందుకుంది. డాకు మహరాజ్ నాలుగు రోజుల పాటు మంచి వసూళ్లు సాధించి 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం నేటి కలెక్షన్లతో 100 కోట్ల మార్క్‌ను చేరబోతోంది.
డాకు మహరాజ్ తో బాలయ్య మరోసారి బాక్సాఫీస్‌కి తన స్టామినా చూపించారు. ఇది ఆయన కెరీర్‌లో వరుసగా నాల్గవ సెంచరీ కావడం విశేషం. సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకటేశ్‌కు సోలోగా కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ అందించే సినిమాగా నిలుస్తోంది. పండగ సమయంలో ప్రేక్షకుల ఆదరణతో ఈ రెండు సినిమాలు కుటుంబ ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించాయి.
ఇక గేమ్ ఛేంజర్ పాజిటివ్ బజ్‌తో రిలీజ్ అయ్యింది. దీంతో మొదటి రోజునే భారీ కలెక్షన్లతో 100 కోట్ల మార్క్ అందుకుంది. కానీ సినిమా టార్గెట్‌కు ఇది తక్కువ కలెక్షన్. సినిమా మీద 400 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిన దిల్ రాజు టీమ్‌కు ఈ వసూళ్లు చిన్న విషయమే అనిపించింది. తక్కువ నిడివి, కొంత విభిన్నమైన స్క్రీన్‌ప్లే కారణంగా సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి సీజన్ తెలుగు చిత్ర పరిశ్రమలో మరుపురానిది. మూడు పెద్ద సినిమాలు 100 కోట్ల క్లబ్‌లో చేరడంతో తెలుగు సినిమా ప్రస్థానంలో న్యూ రికార్డ్ నమోదయింది.