సంక్రాంతి క్లాష్.. బిజినెస్ ఏ స్థాయిలో ఉందంటే..
ముఖ్యంగా, సంక్రాంతి సీజన్ అనేది థియేట్రికల్ బిజినెస్‌కు అత్యంత ప్రాఫిటబుల్ టైం కావడంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లలో ఉత్సాహం నెలకొంది.
By: Tupaki Desk | 9 Jan 2025 5:39 AM GMTసంక్రాంతి సీజన్‌లో టాలీవుడ్‌ను హిట్ ట్రాక్‌పై నిలిపే లక్ష్యంతో మూడు భారీ సినిమాలు బరిలో ఉన్నాయి. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్, విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఒకే సమయంలో విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాలు 2025కి శుభారంభాన్ని ఇవ్వాలని నిర్మాతలు గట్టిగానే ఆశిస్తున్నారు. ముఖ్యంగా, సంక్రాంతి సీజన్ అనేది థియేట్రికల్ బిజినెస్‌కు అత్యంత ప్రాఫిటబుల్ టైం కావడంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లలో ఉత్సాహం నెలకొంది.
ఈ మూడు సినిమాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి దాదాపు 250 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో గేమ్ చేంజర్ 130 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసి టాప్ ప్లేస్ లో నిలుస్తోంది. ఇక మరోవైపు, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం కలిపి 100 కోట్ల పైచిలుకు బిజినెస్‌ను సాధించాయి. ఈ మొత్తాన్ని పండుగ సీజన్‌లోనే రికవర్ చేయాలి అంటే సినిమాలకు పాజిటివ్ టాక్ తప్పనిసరి.
కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా హాలిడేస్ లోనే ప్రాఫిట్స్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇతర రెండు సినిమాలతో పోలిస్తే తక్కువ రేటుకే అమ్ముడవడంతో, అది ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను సులభంగా రికవర్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వెంకీ అభిమానుల నుంచి మంచి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉంటే, ఆ సినిమా విజయవంతం కావడం ఖాయం.
గేమ్ చేంజర్ విషయానికొస్తే, ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబడటం, శంకర్ దర్శకత్వం కావడం వల్ల టికెట్ రేట్లపై ఆడియన్స్‌లో హైప్ ఉంది. కానీ, ఈ సినిమా సక్సెస్ అనేది పూర్తిగా మౌత్ టాక్‌పై ఆధారపడి ఉంటుంది. రామ్ చరణ్ కెరీర్‌లో అత్యంత భారీ ఓపెనింగ్స్ సాధించే చిత్రంగా గేమ్ చేంజర్ నిలవాలని అంచనా వేస్తున్నారు.
ఇక డాకు మహారాజ్ ట్రైలర్ మాత్రం బాగా ఆకట్టుకున్నా, డిజిటల్ ప్రమోషన్స్ తక్కువగా ఉండటంతో ప్రేక్షకులలో భారీ హైప్ నెలకొల్పలేదు. బాలయ్యకు ఉన్న మాస్ ఫాలోయింగ్ సినిమాను ముందుకు నెట్టే అవకాశం ఉన్నప్పటికీ, ఈ సినిమా సక్సెస్‌కి బలమైన మౌత్ టాక్ అవసరం. సంక్రాంతి సీజన్ క్రమంగా ఈ సినిమాకు టార్గెట్‌ను చేరుకునే అవకాశాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. అలాగే ఇది కూడా బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించే ఛాన్స్ ఉంది.
ఈ మూడు సినిమాల విజయం టాలీవుడ్‌కి 2025కి అదృష్టాన్ని తీసుకురావడమే కాకుండా, మొత్తం ఇండస్ట్రీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చే అవకాశముంది. సంక్రాంతి ఫెస్టివల్‌లో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడమే కాకుండా, డిస్ట్రిబ్యూటర్లు, మేకర్స్‌కు మంచి లాభాలను తెచ్చే అవకాశముంది. మరి ఏ సినిమా ఆడియన్స్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటుందో చూడాలి.