Begin typing your search above and press return to search.

అందరూ అనిల్ రావిపూడిని చూసి నేర్చుకోవాలి!

టాలీవుడ్ లో ఎస్.ఎస్ రాజమౌళి తర్వాత అపజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి అని చెప్పాలి.

By:  Tupaki Desk   |   4 Jan 2025 5:30 PM GMT
అందరూ అనిల్ రావిపూడిని చూసి నేర్చుకోవాలి!
X

టాలీవుడ్ లో ఎస్.ఎస్ రాజమౌళి తర్వాత అపజయం ఎరుగని దర్శకుడు అనిల్ రావిపూడి అని చెప్పాలి. రైటర్ గా కెరీర్ ప్రారంభించిన అనిల్.. 'పటాస్' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యారు. అప్పటి నుంచీ వరుస విజయాలు అందుకుంటూ కమర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అనిల్ తో సినిమా చేస్తే మినిమమ్ గ్యారంటీ అనే పేరు ఇండస్ట్రీలో పడిపోయింది. అంతేకాదు తక్కువ రోజుల్లో సినిమా తీసి బెస్ట్ అవుట్ ఫుట్ తీసుకొస్తాడనే పేరు కూడా సంపాదించుకున్నారు. అందుకే ఆయన్ని ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అంటుంటారు.

ప్రస్తుతం తెలుగులో చాలా ఫాస్ట్ గా సినిమాలు తీసే అగ్ర దర్శకులలో అనిల్ రావిపూడి ముందు వరుసలో ఉంటారు. సాధారణంగా స్టార్ హీరోలతో వర్క్ చేసే డైరెక్టర్లు అందరూ, ఒక సినిమాని కంప్లీట్ చేయడానికి ఏళ్లకు ఏళ్ళు సమయం తీసుకుంటారు. కానీ అనిల్ మాత్రం ఎంత పెద్ద హీరో అయినా సరే, చాలా అంటే చాలా తక్కువ డేస్ లో సినిమాని పూర్తి చేసి నిర్మాతల చేతిలో పెడతారు. అనుకున్న సమయానికి రిలీజ్ కు రెడీ చేస్తుంటారు. ఆయన స్క్రిప్ట్ దశలోనే ఎడిటింగ్ చేసుకోవడం, సినిమాకి ఎంత అవసరమో అంతే ఫుటేజీని షూట్ చేయడం, వేస్టేజ్ లేకుండా చూసుకోవడం దీనికి కారణమని చెప్పాలి.

అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ''సంక్రాంతికి వస్తున్నాం'' సినిమా సంక్రాంతి పండగకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించారు. 'ఎఫ్ 2' 'ఎఫ్ 3' వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత దర్శక హీరోల కాంబినేషన్ లో రూపొందిన ఈ హ్యాట్రిక్ మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రాన్ని కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేసినట్లు అనిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పొంగల్ కి రిలీజ్ చెయ్యాలని టార్గెట్ గా పెట్టుకొని, అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని షూటింగ్ చేసినట్లుగా తెలిపారు. వేస్టేజ్ జరగకుండా చూసుకున్నామని, కేవలం 5-6 నిమిషాల ఫుటేజీ మాత్రమే ఎడిటింగ్ లో పోయిందని చెప్పారు.

''సంక్రాంతికి వస్తున్నాం సినిమా 72 డేస్ లో ఫినిష్ అయిపోయింది. 'ఎఫ్ 2' మూవీ 74 రోజుల్లో చేశాం. ఎప్పుడైతే వర్కింగ్ డేస్ తక్కువ ఉన్నాయో, ఆటోమేటిక్ గా ప్రాజెక్ట్ సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నట్లే. ఈ సినిమాకి ఎంత క్వాలిటీ అవసరమో అంత క్వాలిటీతో చేసాం. 100 శాతం అవుట్ ఫుట్ బాగా వచ్చింది. విజువల్స్ చాలా బాగా వచ్చాయి. థియేటర్ లో కూర్చొని చూసే ఆడియన్ కి గ్రాండ్ గా ఉందని అనిపించేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. సెకాండాఫ్ కోసం ఒక సెట్ కూడా వేసాం. ఎక్కడ ఎంత అవసరమో అంతే బడ్జెట్ పెట్టుకున్నాం. మనం ఎంత తక్కువ వర్కింగ్ డేస్ లో చేస్తే, బడ్జెట్ అంత ఫ్రెండ్లీగా ఉంటుంది. సెట్లు వేసినా భారీ బడ్జెట్ పెట్టినా వర్కింగ్ డేస్ లో చెయ్యాలి. స్క్రిప్ట్ లోనే ప్రాపర్ ఎడిటింగ్ చేసుకున్నాం. పేపర్ లో ఎన్ని నిమిషాల సీన్ రాసుకుంటే అంతే తీసాం. 2 గంటల 26 నిమిషాలు ఫుటేజీ తీస్తే, ఫైనల్ రన్ టైం 2 గంటల 21 నిమిషాలు వచ్చింది. 5-6 నిమిషాలు మాత్రమే ట్రిమ్మింగ్ లో పోయింది. వేస్టేజ్ జరగకుండా చూసుకున్నాం'' అని అనిల్ చెప్పారు.

ఒక సినిమా కోసం మూడు నాలుగేళ్లు పని చేసి, నాలుగు గంటల ఫుటేజీ తీసి 1 గంట ఎడిటింగ్ లో ట్రిమ్ చేస్తున్న ఈరోజుల్లో.. ఎంత లెన్త్ అనుకుంటే అంతే నిడివితో సినిమా చేయడం మామూలు విషయం కాదు. అది కూడా ఒక పెద్ద హీరోతో అంత తక్కువ రోజుల్లో సినిమా చేయడం అంటే అనిల్ రావిపూడి గ్రేట్ అనే చెప్పాలి. ఆయన గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో 5 నెలల 13 రోజుల్లో 'సరిలేరు నీకెవ్వరూ' మూవీ తీశారు. నందమూరి బాలకృష్ణతో 'భగవంత్ కేసరి' సినిమాని కూడా చాలా తక్కువ వర్కింగ్ డేస్ లోనే పూర్తి చేసారు. ఇప్పుడు 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాన్ని సైతం రెండున్నర నెలల్లోపే ఫినిష్ చేయడం అనిల్ కే చెల్లింది. ఇలా బడ్జెట్ పెరగకుండా, ప్రొడ్యూసర్స్ కు ఇబ్బందులు కలగకుండా సినిమాని పూర్తి చేస్తాడు కాబట్టే.. అనిల్ రావిపూడిని నిర్మాతల దర్శకుడు అని పిలుస్తుంటారు. అందరూ రావిపూడిని ఫాలో అయితే బడ్జెట్ లెక్కలు పెరగకుండా ఉంటాయని చెప్పాలి.