ధనుష్ బిగ్ మిస్టేక్!
సంక్రాంతికి ఇప్పటికే టాలీవుడ్లో ఎంత పోటీ ఉందో తెలిసిందే. అరడజను సినిమాలు కర్చీఫ్‌లు వేసుకుని కూర్చున్నాయి
By: Tupaki Desk | 9 Nov 2023 4:36 AM GMTసంక్రాంతికి ఇప్పటికే టాలీవుడ్లో ఎంత పోటీ ఉందో తెలిసిందే. అరడజను సినిమాలు కర్చీఫ్‌లు వేసుకుని కూర్చున్నాయి. వీటిలో ఒక్కటీ రేసు నుంచి తప్పుకునే సంకేతాలు ఇవ్వడం లేదు. ఆరు సినిమాలకు థియేటర్లకు సర్దుబాటు చేసే పరిస్థితి ఎంతమాత్రం ఉండదని అందరికీ తెలుసు. ఒకట్రెండు సినిమాలు తప్పుకున్నా కూడా థియేటర్ల సమస్య తప్పదు. కాబట్టి ఆ టైంలో తమిళ అనువాదాలకు అస్సలు స్కోప్ ఉండదు. ఈ ఏడాది తెలుగు నుంచి రెండు సినిమాలే ఉన్నాయి కాబట్టి వారసుడు, తెగింపు చిత్రాలకు థియేటర్లు ఇవ్వగలిగారు కానీ.. వచ్చే సంక్రాంతికి మాత్రం ఆ పరిస్థితి ఉండేలా లేదు. ఇది తెలిసి కూడా ధనుష్ తన కొత్త చిత్రాన్ని డిసెంబరు 17 నుంచి సంక్రాంతికి వాయిదా వేయించాడు. తమిళం వరకు సంక్రాంతి రిలీజ్ ప్లస్ అవుతుందని అనుకున్నాడేమో కానీ.. తెలుగులో మాత్రం అతడికి పెద్ద మైనస్సే.
ఒకప్పుడంటే ధనుష్ సినిమా తెలుగులో ఎప్పుడు రిలీజైనా పెద్ద తేడా ఉండేది కాదు. అతడి సినిమాలను నేరుగా తమిళంతో పాటు తెలుగులో రిలీజయ్యేవే కావు. కానీ గత కొన్నేళ్లలో అతడికి తెలుగులో ఫాలోయింగ్ బాగా పెరిగింది. ముఖ్యంగా ఈ ఏడాది తెలుగులో నేరుగా సార్ సినిమా చేశాడు. దానికి మంచి ఫలితం వచ్చింది. తెలుగులో ధనుష్ ఫాలోయింగ్, మార్కెట్ పెరిగాయి. దీని తర్వాత అతను శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. అలాంటపుడు ప్రామిసింగ్‌గా కనిపిస్తున్న కెప్టెన్ మిల్లర్‌ను తెలుగులో సరిగ్గా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తే అతడికి చాలా లాభం ఉంటుంది. సందీప్ కిషన్ కూడా ఓ కీలక పాత్ర చేస్తుండటంతో ఈ సినిమాపై తెలుగులో కూడా మంచి అంచనాలే ఉన్నాయి. కానీ సంక్రాంతి రిలీజ్ పెట్టుకోవడంతో తెలుగులో ఆదాయాన్ని కోల్పోయినట్లే. ఇది కెరీర్ పరంగానూ ధనుష్‌కు అంత మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.