Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : సంక్రాంతికి వస్తున్నాం

By:  Tupaki Desk   |   14 Jan 2025 6:30 AM GMT
మూవీ రివ్యూ : సంక్రాంతికి వస్తున్నాం
X

సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ


నటీనటులు: వెంకటేష్-ఐశ్వర్యా రాజేష్-మీనాక్షి చౌదరి-నరేష్-వీటీవీ గణేష్-మురళీధర్ గౌడ్-అవసరాల శ్రీనివాస్-ఉపేంద్ర లిమాయె-సాయికుమార్ తదితరులు

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి

నిర్మాత: శిరీష్

రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి

ఎఫ్-2.. ఎఫ్-3 లాంటి ఎంటర్గైనర్ల తర్వాత విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడిల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన కొత్త చిత్రం.. సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

వైడీ రాజు (వెంకటేష్) మాజీ పోలీసాఫీసర్. తాను ఎంతో నిబద్ధతతో పని చేసినా డిపార్ట్మెంట్ తనకు అన్యాయం చేసిందన్న కోపంతో ఉద్యోగం వదిలేసి.. భాగ్యం (ఐశ్వర్యా రాజేష్)ను పెళ్లి చేసుకుని ఒక పల్లెటూరిలో సెటిలైపోతాడు. నలుగురు పిల్లల్ని కని కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న అతను.. తన మాజీ ప్రేయసి అయిన పోలీసాఫీసర్ మీనాక్షి (మీనాక్షి చౌదరి) కోసం ఒక ఆపరేషన్లో పాల్గొనాల్సి వస్తుంది. కానీ భర్త మీద అనుమానంతో అతణ్ని ఒంటరిగా పంపించడానికి భాగ్యం ఒప్పుకోదు. ఆమె కూడా ఈ ఆపరేషన్లో భాగం కావాలని అనుకుంటుంది. ఇంతకీ ఈ ఆపరేషన్ ఏంటి.. భార్య-మాజీ ప్రేయసి మధ్య నలిగిపోతూ రాజు ఈ ఆపరేషన్ ను ఎలా విజయవంతంగా ముగించాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఒక పేరున్న బిజినెస్ మ్యాన్ ను కిడ్నాప్ చేసి పెద్ద రౌడీ అయిన తన అన్నను విడుదల చేయాలని సీఎంకే ఫోన్ చేసి డిమాండ్ చేస్తాడు మరో రౌడీ. సర్లే ఆ రౌడీని విడిపించేద్దాం అని అతనున్న జైలు సూపరింటెండ్ ను పిలిపిస్తే.. అతను చాలా స్ట్రిక్ట్ అని అర్థమై ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటాడు సీఎం. ఈ స్థితిలో ఎప్పుడో ఏడేళ్ల ముందు పోలీస్ ఉద్యోగం మానేసిన హీరోను వెతికి మరీ పట్టుకుని ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను అప్పగిస్తాడు ఆ ముఖ్యమంత్రి. సీఎం స్థాయి వ్యక్తికి ఒక ఆకు రౌడీ వీడియో కాల్ చేసి బెదిరించడమేంటో.. ఒక జైలు సూపరిండెంటుని ఎలా డీల్ చేయాలో తెలియక సీఎం తల పట్టుకోవడమేంటో.. ఇంకెవరూ లేనట్లు మాజీ పోలీసుని ఆపరేషన్ కోసం రప్పించడమేంటో..? ఇలా లాజికల్ గా ఆలోచిస్తే ‘సంక్రాంతికి వస్తున్నాం’ బేసిక్ స్టోరీ దగ్గరే ప్రేక్షకుడు స్ట్రక్ అయిపోవవడం ఖాయం. ఐతే అనిల్ రావిపూడి సినిమాలంటే లాజిక్ అటక మీద పెట్టేసి థియేటర్లో కూర్చోవాల్సి ఉంటుంది. కథ కాకరకాయ అంటూ ఏమీ ఆలోచించకుండా.. లాజిక్కుల గురించి గిల గిలా కొట్టేసుకోకుండా.. సన్నివేశాల్లోని వినోదాన్ని మాత్రమే ఆస్వాదించడం మొదలుపెడితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈజీగానే టైంపాస్ చేయించేస్తుంది.

విక్టరీ వెంకటేష్ కు ఫ్యామిలీ టచ్ ఉన్న కామెడీ క్యారెక్టర్ పడితే ఆయనెలాగూ చెలరేగిపోతారని తెలిసిందే. అనిల్ అలాంటి పాత్రనే డిజైన్ చేశాడు. అమాయకమైన పల్లెటూరి ఇల్లాలిగా ఐశ్వర్యా రాజేష్ కు సైతం చక్కటి పాత్రను తీర్చిదిద్దాడు. వీళ్లిద్దరి పెర్ఫామెన్సుకు.. ఫన్ సీన్స్ తోడవడంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ రెండున్నర గంటల్లో చాలా వరకు బోర్ కొట్టకుండా సాగిపోయింది. పల్లెటూరిలో భార్యతో కలిసి చక్కగా సంసారం చేసుకుంటున్న భర్త జీవితంలోకి మాజీ ప్రేయసి వస్తే.. ఆ ఇల్లాలు ఎలా రగిలిపోతుంది.. తన నుంచి విడిపోయాక పెళ్లే చేసుకోను అన్న మాజీ ప్రియుడు నలుగురు పిల్లల్ని కూడా కన్నాడని తెలిసిన ప్రేయసి ఎలా ఉడుక్కుంటుంది.. తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్లిద్దరితోనూ కలిసి కొన్ని రోజులు ప్రయాణం చేయాల్సిన స్థితిలో ఆ వ్యక్తి ఎలా నలిగిపోయాడు అన్నది సరదాగా చూపిస్తూ నవ్వులు పంచే ప్రయత్నం చేశాడు అనిల్ రావిపూడి. ఈ నేపథ్యమే సినిమాను ముందుకు నడిపించింది. ఇక పైన చెప్పుకున్న కిడ్నాప్ డ్రామా అంతా మసిబూసి మారేడు కాయను చేసే టైపే. సినిమాలో ఏదో ఒక కథ ఉంది అంటే ఉంది అన్నట్లుగా ఈ వ్యవహారాన్ని నడిపించింది అనిల్ అండ్ టీం.

వెంకీ-ఐశ్వర్యల కెమిస్ట్రీనే ‘సంక్రాంతికి వస్తున్నాం’కు ఆయువు పట్టు. ఇద్దరూ పోటీ పడి నటించడంతో వాళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు మాగ్జిమ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. ఓటీటీల్లో ఈ తరం సినిమాలు చూసి బాగా బూతులు వంటబట్టించేసుకుని అందరి మీదా ప్రయోంచే పిల్లాడిగా బుల్లిరాజు అనే పాత్రతో పండించిన వినోదం ‘సంక్రాంతికి వస్తున్నాం’లో హైలైట్. ఆ పిల్లాడు తొలిసారి విశ్వరూపం చూపించే సన్నివేశం కడుపుబ్బ నవ్విస్తుంది. ఆ పిల్లాడు కూడా చలాకీగా నటించడంతో సినిమాలో అతను కనిపించినపుడల్లా ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతారు. ఇలాంటి పాత్రలు ఇంకొన్ని ఉంటే కామెడీ డోస్ ఇంకా పెరిగేది. ఐతే మరాఠీ నటుడు ఉపేంద్ర లిమాయె పోషించిన జైలర్ పాత్రతో నవ్వులు పూయించాలని చేసిన ప్రయత్నం మాత్రం పెద్దగా ఫలించలేదు. మరీ డంబ్ గా తీర్చిదిద్దిన ఆ పాత్ర సిల్లీగా అనిపిస్తుందే తప్ప దాంతో ముడిపడ్డ సీన్లు అనుకున్నంత నవ్వించలేకపోయాయి. హీరో ఎంట్రీ దగ్గర్నుంచి తన కుటుంబంతో పల్లెటూరిలోనే ఉన్నంత వరకు వినోదానికి ఢోకా లేకపోయింది. కుటుంబం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నీ సరదాగా అనిపిస్తాయి.

ఐతే హీరో ఆపరేషన్లో భాగమయ్యే దగ్గర్నుంచే ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రాక్ తప్పుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ద్వితీయార్ధంలో కామెడీ పేరుతో పాత్రలతో చేయించిన విన్యాసాలు మరీ సిల్లీగా అనిపిస్తాయి. ఓవర్ ద టాప్ స్టయిల్లో సాగే సీన్లు ఆశించినంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయాయి. ఎంత లాజిక్ పక్కన పెట్టి చూసినా కొన్ని సీన్లు మరీ వెటకారంగా అనిపిస్తాయి. చచ్చిన వ్యక్తి బతికి ఉన్నట్లు మేనేజ్ చేస్తూ అందరినీ బోల్తా కొట్టించే సీన్లు అందులో భాగమే. ఈ తరహా కామెడీ ఎప్పుడో దశాబ్దాల కిందట చూశాం. ఇంకా ఇలాంటి సీన్ల మీద ఆధారపడడం అంటే.. రైటింగ్ పరంగా ఏమాత్రం కసరత్తు చేయకపోవడమే. అక్కడక్కడా కొంత కామెడీ వర్కవుట్ కావడం వల్ల ద్వితీయార్ధం సోసోగా సాగిపోతుంది కానీ.. ప్రథమార్ధంతో పోలిస్తే నిరాశ తప్పదు. సినిమా అయిపోయింది అనుకున్నాక ఎమోషనల్ యాంగిల్ ఏదో జోడించాలని కథను ఇంకొంచెం సాగదీశారు. హీరో గురువు పాత్ర నేపథ్యంలో వచ్చే ఆ ఎపిసోడ్ పూర్తిగా అనవసరం అనిపిస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే.. కథ పరంగా చూస్తే ‘సంక్రాంతికి వస్తున్నాం’లో పెద్దగా విషయం లేదు. ఐతే కథ.. లాజిక్కుల సంగతి వదిలేస్తే.. సంక్రాంతి టైంలో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయదగ్గ కాలక్షేపం వినోదానికైతే ఇందులో ఢోకా లేదు.

నటీనటులు: వెంకటేష్ కు సరిగ్గా నప్పే పాత్ర చేశాడు ‘సంక్రాంతికి వస్తున్నాం’లో. వయసుకు తగ్గ.. తన కామెడీ టైమింగ్ కు సరిపోయే పాత్ర కావడంతో ఆయన చెలరేగిపోయారు. ఆయన లుక్ చాలా బాగుంది. స్క్రీన్ ప్రెజెన్స్.. కామెడీ టైమింగ్ అదిరిపోయాయి. అన్ని వర్గాల ప్రేక్షకులూ ఆయన పాత్రతో కనెక్ట్ అవుతారు. కామెడీ పండించడంలో సీనియర్ హీరోల్లో ఎవరైనా తన తర్వాతే అని వెంకీ మరోసారి రుజువు చేశారు. ఎప్పట్లాగే ఇమేజ్ గురించి ఆలోచించకుండా.. ఏమాత్రం భేషజం లేకుండా ఆయన చేసిన సీన్లు అందరినీ ఆకట్టుకుంటాయి. అమాయక పల్లెటూరి ఇల్లాలిగా ఐశ్వర్యా రాజేష్ కూడా అదరగొట్టింది. వెంకీ తర్వాత సినిమాలో ఆమెదే బెస్ట్ పెర్ఫామెన్స్. తన కామెడీ టైమింగ్ కూడా బాగుంది. మీనాక్షి చౌదరి అందంగా.. ఆకర్షణీయంగా కనిపించింది. నటన పర్వాలేదు. వెంకీ కొడుకుగా బుల్లిరాజు పాత్రలో చేసిన పిల్లాడు అదరగొట్టాడు. మురళీధర్ గౌడ్ నవ్వించాడు. వీటీవీ గణేష్ మొదట్లో కాసేపు నవ్వులు పండించాడు. కానీ ఆ తర్వాత ఆ పాత్ర పెద్దగా కనిపించదు. ఉపేంద్ర లిమాయె కామెడీలో పెద్దగా రాణించలేకపోయాడు. సాయికుమార్.. శ్రీనివాసరెడ్డి.. నరేష్.. మిగతా ఆర్టిస్టులంతా ఓకే.

సాంకేతిక వర్గం: తొలిసారి ఓ పెద్ద హీరోతో సినిమా అవకాశాన్ని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియా బాగానే ఉపయోగించుకున్నాడు. తన పాటలు.. నేపథ్య సంగీతం సినిమాకు ఆకర్షణగా మారాయి. ‘గోదారి గట్టు మీద..’ వినడానికే కాదు.. చూడ్డానికి కూడా బాగుంది. ఆర్ఆర్ మంచి జోష్ తో సాగింది. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం కూడా బాగుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సినిమాకు అవసరమైన స్థాయిలో ఖర్చు పెట్టారు. రైటర్ కమ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎప్పట్లాగే కథ మీద పెద్దగా దృష్టిపెట్టలేదు. ఎక్స్ కాప్.. పల్లెటూరి పెళ్లాం.. వీరి మధ్య మాజీ ప్రేయసి.. అంటూ కామెడీకి స్కోప్ ఉన్న కాన్సెప్ట్ తీసుకుని వినోదం పండించడం మీదే దృష్టిపెట్టాడు. తన నరేషన్ ఓవర్ ద టాప్ స్టయిల్లో సాగడం ఒకింత నిరాశ పరుస్తుంది. కానీ ప్రేక్షకులకు టైంపాస్ వినోదాన్ని అందించడంలో మాత్రం అతను విజయవంతం అయ్యాడు.

చివరగా: సంక్రాంతికి వస్తున్నాం: టైంపాస్


రేటింగ్-2.75/5