పండక్కు 5 క్రేజీ సినిమాలు.. రావడం డౌటే?
అయితే వీరి సినిమాలూ నిజంగానే సంక్రాంతికి రాకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
By: Tupaki Desk | 6 March 2025 6:51 PM ISTసంక్రాంతి 2026 టాలీవుడ్‌లో మరోసారి బిగ్ ఫైట్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే క్రేజీ ప్రాజెక్టులు లైన్‌లో ఉండగా, ఎవరు ఈ పోటీ నుంచి తప్పుకుంటారో, ఎవరు బరిలో నిలిచేలా చూస్తారో ఆసక్తిగా మారింది. సాధారణంగా సంక్రాంతి సీజన్ బిగ్ బడ్జెట్ సినిమాలకు, మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లకు గోల్డెన్ టైమ్. ఇప్పుడు ఎన్టీఆర్, చిరంజీవి, నవీన్ పొలిశెట్టి, రవితేజ, వెంకటేష్.. సినిమాలు పోటీ పడేలా ఉన్నాయి. అయితే వీరి సినిమాలూ నిజంగానే సంక్రాంతికి రాకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముందుగా ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాను తీసుకుంటే, ఇది మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న పాన్ ఇండియా హై వోల్టేజ్ యాక్షన్ మూవీ. ఈ సినిమా షూటింగ్ అప్పటికి పూర్తవుతుందా అనేది అనుమానమే. ప్రశాంత్ నీల్ స్లోగానే వర్క్ చేస్తాడు, కానీ పెర్ఫెక్ట్‌గా షూట్ చేసే దర్శకుడు. ‘సలార్’ లాగే, ఇది కూడా భారీ స్కేల్‌లో ఉంటుందనే టాక్. అయితే 2026 సంక్రాంతికి ఈ సినిమా వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. ఇటీవల నిర్మాత కూడా అన్ని అనుకున్నట్లు జరిగితే సంక్రాంతికి రావచ్చని అన్నారు కానీ కాన్ఫిడెన్స్ గా చెప్పలేదు.
ఇక చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమా షైన్ స్క్రీన్ బ్యానర్‌పై తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాలేదు. కానీ అనిల్ రావిపూడి స్పీడ్ ఏంటో అందరికీ తెలుసు. సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలను జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసిన అనిల్, ప్లాన్ ప్రకారం వెళితే ఈ సినిమా సంక్రాంతికి తెరపైకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇది పూర్తిగా అనిల్ టైమ్ మేనేజ్‌మెంట్ మీద ఆధారపడి ఉంటుంది.
నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ మాత్రం పెద్దగా లేట్ అవ్వదనే టాక్ ఉంది. సితార ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ పండగ కిక్కుని అందించేందుకు మంచి ఛాన్స్ ఉంది. నవీన్ పొలిశెట్టి సినిమాలకు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. గతంలో ‘జాతిరత్నాలు’ బాగా ఆడింది. దీంతో ఈ సినిమాకి గట్టి అవకాశమే ఉంది.
రవితేజ - కిషోర్ తిరుమల సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. కానీ కిషోర్ కూడా సినిమా స్పీడ్‌గా కంప్లీట్ చేయగలిగే డైరెక్టర్. ఇప్పటికే రవితేజ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. అయినా, ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఇది సాధ్యమే కానీ కాస్త కష్టమే అనే అనుమానాలు ఉన్నాయి.
ఇక వెంకటేష్-సురేందర్ రెడ్డి సినిమా విషయానికొస్తే, ఇది ఇంకా అధికారికంగా మొదలు కాలేదు. వెంకటేష్ తాజాగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో బిగ్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో తదుపరి సినిమాల విషయంలో కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇక వెంకీ కూడా స్పీడ్ గా వర్క్ చేసే హీరో కాబట్టి దర్శకుడు సురేందర్ అదే స్పీడ్ లో సినిమా చేస్తారో లేదో చూడాలి.
మొత్తానికి ఈ ఐదు సినిమాలూ మంచి హైప్‌తో ఉన్నాయి. కానీ ఫైనల్‌గా ఎవరు రిలీజ్ ప్లాన్‌లో ఉండి, ఎవరు తప్పుకుంటారనేది మరికొంతకాలం తర్వాత క్లారిటీ వస్తుంది. సంక్రాంతికి పోటీ తప్పదు, కానీ పోటీలో నిలిచే సినిమాలు చివరి నిమిషంలో మారే అవకాశాలు కూడా ఉన్నాయి.