టాలీవుడ్ పండగ టార్గెట్స్.. ప్లాన్ లేకుండానే..
అయితే పెద్ద పండక్కి ఫస్ట్ కర్ఛీప్ వేసింది మెగాస్టార్ చిరంజీవినే. ఏడాది ముందే తన అప్ కమింగ్ మూవీ విశ్వంభర రిలీజ్ డేట్ ను ప్రకటించేశారు.
By: Tupaki Desk | 18 March 2024 8:01 AM GMTసంక్రాంతి.. ఈ పదం వింటేనే ఓ సెపరేట్ వైబ్స్ వస్తాయ్. ఎక్కడ ఉన్నా ముగ్గుల పండక్కి అందరూ తమ ఇళ్లకు చేరుకుని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక సంక్రాంతి సినీ లవర్స్ కు కూడా పెద్ద పండుగ లాంటిదే. దర్శకనిర్మాతలు, నటీనటులు తమ చిత్రాలను అప్పుడే విడుదల చేయాలనుకుంటారు. ఈ సంక్రాంతికి ఐదు సినిమాలు విడుదలకు సిద్ధమవ్వగా.. థియేటర్లు పంచలేక డిస్ట్రిబ్యూటర్స్ తలలు పట్టుకుని కూర్చున్నారు.
చివరకు రవితేజ ఈగల్ తప్పుకోగా.. మిగతా చిత్రాలు రిలీజ్ అయ్యాయి. హనుమాన్ మూవీ విజేతగా నిలిచి వసూళ్లతో అదరగొట్టగా.. మిగతా మూడు సినిమాలు మిక్స్ డ్ టాక్ అందుకున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి అయ్యి మూడు నెలలు కూడా కాలేదు. అప్పుడే వచ్చే పండుగ రేసులో ఐదారు సినిమాలు రంగంలోకి దిగాయి. ఇప్పటి నుంచే కర్చీఫులు వేస్తున్నారు టాలీవుడ్ సినీ మేకర్స్. ఇంకా షూటింగ్ మొదలు కాకుండానే సంక్రాంతికి వస్తున్నట్లు పలు సినిమాల మేకర్స్ ఏకంగా ప్రకటించేస్తున్నారు.
అయితే పెద్ద పండక్కి ఫస్ట్ కర్ఛీప్ వేసింది మెగాస్టార్ చిరంజీవినే. ఏడాది ముందే తన అప్ కమింగ్ మూవీ విశ్వంభర రిలీజ్ డేట్ ను ప్రకటించేశారు. జనవరి 10న థియేటర్లోకి వస్తున్నానని తెలిపారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కీలక షూటింగ్ పార్ట్ పూరైంది. సెప్టెంబర్ కల్లా మొత్తం పూర్తి చేసుకుని ప్రమోషన్లు కూడా మొదలు కానున్నాయి. కాబట్టి ఈ మూవీ సంక్రాంతి బరిలో దిగినట్లే.
మరోవైపు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ రాజా సాబ్ కూడా సంక్రాంతికి సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా కంప్లీట్ అయింది. కల్కి మూవీ షూటింగ్ అయ్యాక.. ప్రభాస్ రాజా సాబ్ పై పూర్తిగా ఫోకస్ చేయనున్నారు. దీంతో ఈ మూవీ సంక్రాంతికి రావడం పక్కా అని చెప్పవచ్చు. కల్కి మూవీ ఈ ఏడాది సమ్మర్ కానుకగా మే9వ తేదీన విడుదల అవ్వనుంది.
అయితే చిరంజీవి, ప్రభాస్ కాకుండా మిగతా హీరోలు.. సంక్రాంతికి రావడం కాస్త కష్టమేనని చెప్పవచ్చు. ఎందుకంటే వారి సినిమా షూటింగ్ లు ఇంకా మొదలు కూడా కాలేదు. సంక్రాంతికి వచ్చి విజయాలు సాధించే నాగార్జున.. బంగార్రాజు-2ను ఆగస్టు నెలలో షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నారు. అలా పండక్కి వచ్చి మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇది ఎంతవరకు అమలవ్వుద్దో చూడాలి.
ఇక వెంకటేష్.. ఈ ఏడాది సైంధవ్ సినిమాతో వచ్చి నిరాశపరిచారు. అందుకే తన నెక్స్ట్ మూవీతో కచ్చితంగా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు. తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేయనున్నారు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాకు సంక్రాంతికి కలుద్దాం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి.. సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట.
అయితే వీటితోపాటు సూపర్ హిట్ మూవీ శతమానం భవతి-2 కూడా సంక్రాంతికి వస్తుందని కొన్ని రోజుల క్రితం దిల్ రాజు కన్ఫర్మ్ చేశారు. కానీ శర్వానంద్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన శతమానం భవతి-2 సెట్స్ లోకి అడుగుపెట్టడం కష్టమే. మరి ఈ సినిమా విషయంలో దిల్ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి వచ్చే ఏడాది సంక్రాంతికి ఏ చిత్రాలు రిలీజ్ అవుతాయో? ఏవి వాయిదా పడతాయో? వేచి చూడాల్సిందే.