Begin typing your search above and press return to search.

సంతాన ప్రాప్తిరస్తు టీజర్.. నవ్విస్తూనే ఆలోచింపజేసే కాన్సెప్ట్!

విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రధానంగా ఓ యువకుడి జీవితంలో ఎదురయ్యే అనూహ్యమైన సమస్యను వినోదంతో చూపించారు.

By:  Tupaki Desk   |   5 March 2025 1:23 PM IST
సంతాన ప్రాప్తిరస్తు టీజర్.. నవ్విస్తూనే ఆలోచింపజేసే కాన్సెప్ట్!
X

తెలుగు సినిమా సరికొత్త కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా సంతాన ప్రాప్తిరస్తు అనే చిత్రంతో ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ మిక్స్ చేసి ఓ విభిన్నమైన కథను తెరపై ఆవిష్కరించనున్నారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్లపై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ మూవీకి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఇక టీజర్‌ను యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేయగా, ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రధానంగా ఓ యువకుడి జీవితంలో ఎదురయ్యే అనూహ్యమైన సమస్యను వినోదంతో చూపించారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా జీవితాన్ని గడిపే విక్రాంత్ పెళ్లి తర్వాత కొత్త సమస్యను ఎదుర్కొంటాడు. తండ్రికాబోతున్నాననే ఆనందాన్ని పొందేలోపే, అనుకోని వైద్య సమస్యతో ఎదురైన విపత్కర పరిస్థితి కథలో కీలక మలుపు తీసుకొస్తుంది.

అతని శరీరంలో ‘లో స్పెర్మ్ కౌంట్’ ఉండటంతో పిల్లలు కలగడం కష్టమని వైద్యులు చెబుతారు. ఇక దీనిని అధిగమించేందుకు అతను 100 రోజుల మిషన్ ప్రారంభిస్తాడు. ఈ సినిమాకు కీలకంగా నిలిచే పాత్రలు వెంకటేష్, తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం మరింత ఫన్ క్రియేట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

అలాగే జీవన్ కుమార్, శ్రీలక్ష్మి, హర్షవర్ధన్, తాగుబోతు రమేశ్, అభయ్ బెతిగంటి, కీర్తి, అనిల్ గీలా, సద్దాం తదితరులు మరికొన్ని పాత్రలలో అలరించనున్నారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ కామెడీ, అభినవ్ గోమటం, తరుణ్ భాస్కర్ టైమింగ్ డైలాగ్స్ టీజర్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాయి. టీజర్‌లో చూపించిన కామెడీ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉండగా, స్టోరీ మాత్రం చాలా డిఫరెంట్‌గా కనిపిస్తోంది. కథలోని ట్విస్ట్‌లు, రొమాంటిక్ ఎలిమెంట్స్, ఎమోషనల్ ఎంగేజ్‌మెంట్ కూడా హైలైట్‌గా మారాయి.

కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే హాస్యపూరిత సన్నివేశాలు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. ఒక వైపు కామెడీ, మరోవైపు కుటుంబ సంబంధాలు, భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలను సరదాగా పరిచయం చేయడం ఈ సినిమా ప్రత్యేకతగా మారింది. ఇక డైలాగ్స్ కూడా ఆలోచింపజేస్తున్నాయి. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ సినిమాను పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించారు. ABCD, ఆహా నా పెళ్లంట వంటి ఎంటర్‌టైనింగ్ వెబ్ సిరీస్‌లను రూపొందించిన ఆయన, మరోసారి తన మార్క్‌ను చూపించబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉండబోతోందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. త్వరలోనే సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.