Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : సప్త సాగరాలు దాటి

'చార్లీ 999'తో ఇప్పటికే తెలుగులో గుర్తింపు సంపాదించిన రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో కన్నడలో విజయవంతమైన ఓ సినిమాను 'సప్త సాగరాలు దాటి పేరుతో తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

By:  Tupaki Desk   |   22 Sep 2023 10:46 AM GMT
మూవీ రివ్యూ : సప్త సాగరాలు దాటి
X

‘సప్త సాగరాలు దాటి’ మూవీ రివ్యూ

నటీనటులు: రక్షిత్ శెట్టి-రుక్మిణి వసంత్-అవినాష్-అచ్యుత్ కుమార్-పవిత్ర లోకేష్ తదితరులు

సంగీతం: చరణ్ రాజ్

ఛాయాగ్రహణం: అద్వైత గురుమూర్తి

నిర్మాత: రక్షిత్ శెట్టి

రచన-దర్శకత్వం: హేమంత్ రావు

కేజీఎఫ్.. కాంతార చిత్రాలు భారీ విజయం సాధించాక కన్నడ నుంచి తరచుగా సినిమాలు తెలుగులోకి అనువాదం అవుతున్నాయి. ‘చార్లీ 999’తో ఇప్పటికే తెలుగులో గుర్తింపు సంపాదించిన రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో కన్నడలో విజయవంతమైన ఓ సినిమాను ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

మను (రక్షిత్ శెట్టి) ఒక అనాాథ. గాయని అయిన ప్రియ (రుక్మిణి వసంత్)తో అతను ప్రేమలో పడతాడు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. కారు డ్రైవరుగా పని చేసే మను.. ప్రియకు ఇష్టమైన విధంగా ఆమెకు బీచ్ ఒడ్డున ఒక ఇల్లు కట్టి ఇవ్వాలని అనుకుంటాడు మను. కానీ తన ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు. ఇలాంటి సమయంలోనే మను.. యజమాని కొడుకు ఒక యాక్సిడెంట్ చేసి ఓ వ్యక్తి చావుకు కారణమవుతాడు. వాళ్లిచ్చే డబ్బుతో ప్రియకు ఇష్టమైన ఇల్లు కట్టి ఇవ్వొచ్చని ఆశపడి.. కేసు నుంచి త్వరగానే బయటపడతాననే నమ్మకంతో యాక్సిడెంట్ కేసును తన మీద వేసుకుని జైలుకు వెళ్తాడు మను. కానీ అక్కడికి వెళ్లాక పరిస్థితులు వేగంగా మారిపోతాయి. మరి మను ఈ కేసు నుంచి బయటపడ్డాడా.. ప్రియను తిరిగి కలిశాడా.. ఈ విషయాలను తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

ప్రేమకథల్లో ఎప్పుడో కానీ కొత్తదనం చూడలేం. పరిచయం.. ప్రేమ.. అపార్థాలు లేదా ఇంకేదైనా సమస్య.. ఎడబాటు.. సుఖాంతం లేదా విషాదాంతం.. ఇలా చాలా వరకు ప్రేమకథలో ఒకే తరహాలో సాగిపోతాయి. పాత్రల నేపథ్యాలు.. కాన్ఫ్లిక్ట్ విషయంలో వైవిధ్యం చూపించవచ్చు కానీ.. కథల శైలిలో అరుదుగానే ప్రేక్షకులు ఊహించలేని మలుపులు చూస్తాం. కాబట్టి కొత్తగా ఏదో ట్రై చేయడం కంటే ప్రేక్షకుల్లో ఒక ఫీల్ తీసుకురావడం.. ఎమోషన్లతో కదిలించడం కీలకమైన విషయం. పాత్రలతో రిలేట్ అయి.. తెర మీద జరిగే విషయాలు హృదయానికి తాకేలా ఉంటే ప్రేక్షకులు వాటితో ప్రేమలో పడిపోతారు. ‘సప్తసాగరాలు దాటి’ ఆ కోవకు చెందిన సినిమానే. కథ పరంగా చూస్తే ఇందులో ఏ కొత్తదనం కనిపించదు. ఇక్కడ చూపించినవి కొత్త విషయాలు కాదు. మనం ఆశ్చర్యపోయేలా.. ప్రేక్షకుల అంచనాలను దాటి ఏమీ జరిగిపోదు. కానీ కథను చెప్పడంలో నిజాయితీ.. పాత్రల్లోని స్వచ్ఛత.. ఈ సినిమాకు ప్రత్యేకతను ఆపాదించాయి. చూడగానే ప్రేమలో పడిపోయేలా ఉన్న పాత్రలు.. వాటి తాలూకు సంఘర్షణ.. భావోద్వేగాలను రిలేట్ చేసుకునేలా సాగిన నరేషన్ ‘సప్తసాగరాలు దాటి’ చిత్రాన్ని ఒక ఎమోషనల్ రైడ్ లాగా మార్చాయి.

స్వచ్ఛమైన ప్రేమకథ.. ఈ మాట వినగానే ఈ రోజుల్లో ఒకింత ఆశ్చర్యగా చూడాల్సిన పరిస్థితి. గత కొన్నేళ్లలో ప్రేమకథలను తీర్చిదిద్దే తీరే మారిపోయింది. హీరో హీరోయిన్ల మధ్య ఫిజికల్ రిలేషన్ లేకుండా.. లిప్ లాక్స్-ఇంటిమేట్ సీన్లు లేకుండా సినిమాలు తీయడం చాలా అరుదైపోయింది. అలాంటి సీన్లు పెడితే తక్కువ స్థాయి చిత్రం.. బూతు సినిమా అని ముద్ర వేయాల్సిన పని లేదు కానీ.. ఇప్పటి ప్రేక్షకుల అభిరుచిని అనుసరించి అలా తీస్తే తప్ప ప్రేమకథలు విజయవంతం కావు అనే అభిప్రాయం బలంగా పడిపోయింది. ఇలాంటి రోజుల్లో కూడా ‘96’ లాంటి కొన్ని కథలు ‘స్వచ్ఛమైన ప్రేమ’కు నిర్వచనం చెబుతూ.. ఇప్పటి ప్రేక్షకులు కూడా రిలేట్ అయ్యేలా.. వారిని కదిలించేలా సాగుతూ మెప్పిస్తున్నాయి. ఈ కోవలో వచ్చిన మరో అరుదైన సినిమా ‘సప్తసాగరాలు దాటి’. ఇందులోని రెండు పాత్రలను తీర్చిదిద్దిన విధానం.. ఆ పాత్రల్లో రక్షిత్ శెట్టి-రుక్మిణి వసంత్ ఒదిగిపోయిన తీరే ఈ సినిమాకు హైలైట్. ఆ జంట ఆనందంగా ఉన్నపుడు మనమూ సంతోషిస్తాం. వాళ్లకు సమస్య వస్తే మనకు ఆందోళనగా ఉంటుంది. వాళ్లిద్దరూ దూరమవుతుంటే మన హృదయం మెలిపెతుంంది. వాళ్లు బాధతో విలపిస్తుంటే మనకు కన్నీళ్లు వస్తాయి. ఇలా ప్రేక్షకులను ప్రధాన పాత్రలతో ఎమోషనల్‌ గా కనెక్ట్ చేయడంలోనే ఈ సినిమా సక్సెస్ ఆధారపడి ఉంది.

తాను కొన్నాళ్లు కష్టపడ్డా తన ప్రేయసిని ఎప్పటికీ సంతోషం సంతోషపెట్టవచ్చని ఆశతో ఒక యాక్సిడెంట్ కేసును మీద వేసుకుని జైలుకు వెళ్లే కుర్రాడు.. అతణ్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలని పోరాడే అమ్మాయి.. ఈ క్రమంలో సాగే భావోద్వేగపు ప్రయాణమే ‘సప్త సాగరాలు దాటి’ సినిమా. యాక్సిడెంట్ కేసు తెరపైకి వచ్చినపుడే.. తర్వాత ఏం జరుగుతుందన్న దానిపై ఒక అంచనా వచ్చేస్తుంది. కథలో ఇంతకుమించి మలుపులు.. సర్ప్రైజులు ఏమీ లేవు. హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఒకరు పడే తపన.. వాళ్లు చేసే పోరాటం హృదయం ద్రవించేలా చేస్తుంది. వాళ్లు కలుసుకున్నపుడు.. మాట్లాడుతున్నపుడు.. వారిలో కలిగే ఉద్వేగాన్ని క్యాప్చర్ చేసిన విధానం సినిమాలో హైలైట్. హీరోయిన్ తన వాయిస్ తో రికార్డ్ చేసి ఇచ్చిన ఆడియో క్యాసెట్ ను హీరో జైల్లో ఎంతో కష్టపడి దాన్ని వింటుండగా భావోద్వేగాలు తన్నుకొచ్చే సన్నివేశంలో కదిలిపోని ప్రేక్షకుడు ఉండడు. ఇలాంటి మరి కొన్ని మంచి సన్నివేశాలున్నాయి సినిమాలో. ఐతే ఇందులో పాత్రలు.. భావోద్వేగాలకు కనెక్ట్ అయిన వారికి ‘సప్త సాగరాలు దాటి’ ఒక ఎమోషనల్ రైడ్ లాగా అనిపించి స్లో పేస్.. నిడివి అసలు సమస్యల్లాగే అనిపించవు. అలా కనెక్ట్ కాని పక్షంలో ఏముంది ఇందులో.. డెడ్ స్లో అనే కంప్లైంట్లు రావచ్చు. కథను సుఖాంతం చేయకుండా ఒక చోట ‘బ్రేక్’ ఇచ్చి ‘సైడ్-బి’ అంటూ మిగతా కథను రెండో భాగంలో చెప్పబోతోంది చిత్ర బృందం. ‘సైడ్-ఎ’కు కనెక్ట్ అయిన వాళ్లు దాని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారనడంలో సందేహం లేదు.

నటీనటులు:

రక్షిత్ శెట్టి.. రుక్మిణి వసంత్.. వీళ్లిద్దరిలో ఒకరెక్కువ.. ఒకరు తక్కువ అని చెప్పలేం. దర్శకుడి ఆలోచనలకు ప్రాణం పోసేలా ఆ ఇద్దరూ తమ పాత్రలను గొప్పగా పండించారు. పాత్రల్లోని స్వచ్ఛత ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఆ పాత్రలను చాలా సిన్సియర్ గా చేశారు. మను-ప్రియల ప్రేమను.. బాధను.. సంఘర్షణను వాళ్లిద్దరూ తమ కళ్లతోనే వ్యక్తపరిచిన తీరు కట్టిపడేస్తుంది. ఈ సినిమా తర్వాత వీళ్లిద్దరికీ చాలామంది కొత్త అభిమానులు తయారవుతారు. హీరోయిన్ని ప్రేక్షకులు చాలా కాలం గుర్తుంచుకుంటారు. కథానాయిక తల్లి పాత్రలో పవిత్ర లోకేష్ కూడా బాగా చేసింది. అచ్యుత్ కుమార్.. అవినాష్ తమ పాత్రల పరిధిలో బాగా చేశారు. శరత్ లోహితశ్వ కూడా ఒక ముఖ్య పాత్రలో ఆకట్టుకున్నాడు.

సాంకేతిక వర్గం:

సినిమాలో చిన్న చిన్న బిట్ సాంగ్సే ఉన్నాయి. అవి ఆకట్టుకుంటాయి. వాటిని మించి నేపథ్య సంగీతంతో చరణ్ రాజ్ బలమైన ముద్ర వేశాడు. సన్నివేశాల్లోని గాఢతకు తగ్గట్లే హృద్యమైన సంగీతంతో అతను సినిమాను డ్రైవ్ చేశాడు. అద్వైత గురుమూర్తి విజువల్స్ కూడా ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఎక్కువగా క్లోజప్ షాడ్స్ ఉన్న సినిమాలో ప్రధాన పాత్రల ఎమోషన్లను అతను క్యాప్చర్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాతగా రక్షిత్ శెట్టి మరోసారి తన అభిరుచిని చాటాడు. హేమంత్ రావు దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు. రైటింగ్ కంటే ఎగ్జిక్యూషన్లోనే ఈ సినిమా విశిష్ఠత దాగి ఉంది. ప్రధాన పాత్రలను తీర్చిదిద్దిన విధానం.. ఎమోషన్లను పండించిన విధానంలో హేమంత్ రావు మెప్పించాడు. పొయెటిక్ నరేషన్ తో అతను తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

చివరగా: సప్తసాగరాలు దాటి.. హృదయాన్ని తాకేలా

రేటింగ్ - 2.75