Begin typing your search above and press return to search.

సారంగపాణి జాతకం.. ఇంద్రగంటి మరో ప్రయోగం

దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ కొత్త చిత్రం ద్వారా ప్రేక్షకులకు కామెడీ ఎంటర్టైన్మెంట్ లో ఒక అందమైన కథ అందించబోతున్నారు.

By:  Tupaki Desk   |   25 Aug 2024 8:39 AM GMT
సారంగపాణి జాతకం.. ఇంద్రగంటి మరో ప్రయోగం
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో భిన్నమైన కథలతో మెప్పించే దర్శకులతో మోహన కృష్ణ ఇంద్రగంటి ఒకరు. ఇక నెక్స్ట్ ఆయన నుంచి 'సారంగపాణి జాతకం' అనే సినిమా రాబోతోంది. సినిమాలో జ్యోతిష్యం, జాతకాలు వంటి అంశాలు కీలకంగా ఉంటాయని టైటిల్ చూస్తే అర్ధమవుతుంది. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ కొత్త చిత్రం ద్వారా ప్రేక్షకులకు కామెడీ ఎంటర్టైన్మెంట్ లో ఒక అందమైన కథ అందించబోతున్నారు.

గతంలో 'జెంటిల్‌మెన్', 'సమ్మోహనం' లాంటి సినిమాలతో ప్రేక్షకుల మనసును గెలుచుకున్న నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, ఇప్పుడు ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పోస్టర్‌లో ప్రియదర్శి ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. సాధారణ హీరోలా కాకుండా, కాస్త భిన్నమైన పాత్రలో అతనిని చూడవచ్చు.

అతనికి జాతకం గురించి ఏదో జోస్యం తెలిసినట్లు, అది చూసి ఆశ్చర్యపోతున్నట్టు కనిపిస్తున్నాడు. ఈ కథలో అతనెంతవరకు ఈ జాతకాలను విశ్వసిస్తాడో, అవి నిజమవుతాయో లేదా అన్నది కథలో ముఖ్యాంశంగా ఉంటుంది. ఇంద్రగంటి తన సొంత మార్క్ అయిన వినోదాత్మక కథా శైలిని ఈ సినిమాలో కూడా కొనసాగిస్తున్నాడు. దర్శకుడు జంధ్యాల తరహాలో సాగే హాస్యంతో కూడిన కథను అందిస్తున్నట్టు తెలుస్తోంది.

కేవలం కామెడీ మాత్రమే కాకుండా, కథలో రొమాన్స్, మ్యూజిక్, ట్విస్ట్ లాంటి అంశాలు కూడా ఉంటాయట. హీరో విశ్వసించే ఆచారాలు, జాతకాలు, ప్రేమ వంటి అంశాల మధ్య అనేక అనుభవాలను ఎదుర్కొంటాడు. సంక్లిష్టమైన పరిస్థితులను కథ హాస్యాత్మకంగా ఎలా పరిష్కరిస్తుందో సినిమా ద్వారా చూడాలి. ఇక సినిమాలో హీరోయిన్‌గా రూప కొడువయూర్ నటిస్తున్నారు.

వెంకటేశ్ కిషోర్, వీకే నరేష్, వైవా హర్ష వంటి కమెడియన్లు కూడా వేర్వేరు పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించనున్నారు. ప్రముఖ నటులు తనికెళ్ల భరణి, శ్రీనివాస్ అవసరాల, సివన్నారాయణ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా కొత్త తరహా సినిమాలకు పేరు తెచ్చుకున్న వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు ఇంకా కొంత సమయం ఉన్నప్పటికీ, ఇప్పటికే ఫస్ట్ లుక్, కథ గురించి వచ్చిన సమాచారం సినిమాపై అంచనాలు పెంచుతోంది.