అంబాజీపేట 'శరణ్య'.. ఆ పాత్ర విధ్వంసమే..
సుహాస్ అక్క పద్మ పాత్రలో శరణ్య అదరగొట్టేసింది. శరణ్య తన నటనతో అందరినీ కట్టిపడేసిందని నెటిజన్లు చెబుతున్నారు. తన భావోద్వేగపూరిత యాక్టింగ్ తో సినిమాకే హైలెట్‌గా నిలిచిందని అంటున్నారు.
By: Tupaki Desk | 3 Feb 2024 2:09 PM GMTశరణ్య ప్రదీప్.. ఈ పేరు చెబితే వెంటనే గుర్తుపట్టకపోవచ్చు. కానీ ఫిదాలో సాయి పల్లవి అక్క పాత్రలో చేసిన అమ్మాయి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో అద్భుతమైన యాక్టింగ్ తో అందరినీ ఇంప్రెస్ చేసింది శరణ్య. హీరోయిన్ భానుమతి సోదరి రేణుక పాత్రలో జీవించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది.
గతేడాది సంపూర్ణేశ్ బాబు మార్టిన్ లూథర్ కింగ్ మూవీలో లో లీడ్ రోల్ లో నటించి ఆకట్టుకుంది శరణ్య. అలా పలు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ బ్యూటీ తాజాగా కలర్ ఫొటో ఫేం సుహాస్ హీరోగా డైరెక్టర్ దుశ్యంత్ కటికినేని తెరకెక్కించిన అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ మూవీలో కీలక పాత్రలో నటించింది.
సుహాస్ అక్క పద్మ పాత్రలో శరణ్య అదరగొట్టేసింది. శరణ్య తన నటనతో అందరినీ కట్టిపడేసిందని నెటిజన్లు చెబుతున్నారు. తన భావోద్వేగపూరిత యాక్టింగ్ తో సినిమాకే హైలెట్‌గా నిలిచిందని అంటున్నారు. హీరోను మించిన ఎలివేషన్ ఆమెకు దక్కిందని, కథ ప్రధానంగా శరణ్య చుట్టూనే తిరుగుతుందని చెబుతున్నారు.
కొన్ని కీలకమైన సీన్లలో శరణ్య అద్భుతంగా నటించిందని, సెకండాఫ్ లో వచ్చే పోలీస్ స్టేషన్ సీన్లో తన పెర్ఫామెన్స్ మామూలుగా లేదని చెబుతున్నారు. ఆ సన్నివేశానికి థియేటర్లు హోరెత్తిపోతున్నాయని అంటున్నారు. శరణ్యలో ఇంత మంచి నటి ఉందా అని అనిపిస్తోందని కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమా తర్వాత ఆమెకు మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని జోస్యం చెబుతున్నారు.
సుహాస్ స్టన్నింగ్ ఫెర్ఫామెన్స్, ఇంప్రెసివ్ లవ్ ట్రాక్ తో ఎమోషనల్‌గా, ఎంటర్టైనింగ్ గా సినిమా బాగుందని రివ్యూలు వచ్చాయి. ఈ మూవీలో పుష్ప ఫేం జగదీశ్ ప్రతాప్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా భారీ మొత్తానికి దక్కించుకున్నట్టు సమాచారం. మరి ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి.