43ఏళ్ల వ్యక్తిని పెళ్లాడిన 13వయసు కొరియోగ్రాఫర్
ఆమె జీవితంపై బయోపిక్ కి రంగం సిద్ధమవుతోంది. సరోజ్ ఖాన్ పాత్రలో మాధురి ధీక్షిత్ నటించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రఖ్యాత టీసిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
By: Tupaki Desk | 20 Sep 2023 12:30 AM GMT13 వయసుకే ఆమె పెళ్లయింది.. 14వయసుకే బిడ్డ తల్లి అయింది.. కొరియోగ్రాఫర్ గా కెరీర్ లో 2000 పైగా పాటలకు నృత్యదర్శకత్వం వహించింది. ఇంతకీ ఆమె ఎవరు? అంటే.. ది గ్రేట్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ గురించే ఇదంతా. ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ నాలుగు దశాబ్ధాల పాటు సినీరంగంలో కొరియోగ్రాఫర్ గా సేవలందించారు. ఆమె జీవితంపై బయోపిక్ కి రంగం సిద్ధమవుతోంది. సరోజ్ ఖాన్ పాత్రలో మాధురి ధీక్షిత్ నటించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రఖ్యాత టీసిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
మరిన్ని వివరాల్లోకి వెళితే.. ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ 13 ఏళ్ల వయసులో తన 43 ఏళ్ల గురువును పెళ్లి చేసుకుని ఇస్లాం మతంలోకి మారినప్పుడు బాలీవుడ్ లో దీనిపై ఎంతో చర్చ సాగింది. 2020లో ఏస్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ అకాల మరణం యావత్ సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 40 ఏళ్లకు పైగా కెరీర్‌లో ఆమె భారతీయ సినిమా ప్రపంచానికి అసాధారణ సేవలను అందించారు. ఆమె స్థాయి.. బాలీవుడ్‌కు ఆమె చేసిన అపారమైన సహకారం ఎనలేనిది. అందుకే దర్శకుడు హన్సల్ మెహతా - నిర్మాత భూషణ్ కుమార్ ఆమెపై బయోపిక్ తీయడానికి సిద్ధమవుతున్నారు. మాధురీ దీక్షిత్ ఆమె పాత్రను పోషించనుందని ఊహాగానాలు సాగుతున్నాయి.
సరోజ్ ఖాన్ హిందువుగా పుట్టి, లవ్ లైఫ్ కోసం, తన పిల్లల కోసం ఇస్లాం మతంలోకి మారారు. ఆమె 22 నవంబర్ 1948న బొంబాయి రాష్ట్రంలో హిందూ కుటుంబంలో జన్మించింది. అసల పేరు నిర్మలా నాగ్‌పాల్. ఆమె చిత్ర పరిశ్రమలో పనిచేయడం ప్రారంభించే ముందు ఆమె తల్లిదండ్రులు పేరును నిర్మల నుండి సరోజగా మార్చారు. ఎందుకంటే వారి కుమార్తె సినిమాలకు పనిచేసిన విషయం తమ సనాతన కుటుంబానికి తెలియడం ఇష్టం లేదు.
13 సంవత్సరాల వయస్సులో సరోజ్ ఖాన్ అప్పటికి 43 సంవత్సరాల వయస్సు గల డ్యాన్స్ గురు బి సోహన్‌లాల్‌ను వివాహం చేసుకున్నారు. కొరియోగ్రాఫర్ సరోజ్ 14 సంవత్సరాల వయస్సులో మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. సరోజ తన మొదటి బిడ్డను స్వాగతించిన తర్వాత, సోహన్‌లాల్‌కు అప్పటికే పెళ్లయి నలుగురు పిల్లలు ఉన్నారని తెలిసింది. ఆ తర్వాత అతడి నుంచి ఆమె విడిపోయింది.
ఒక మీడియా పోర్టల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సరోజ్ ఖాన్ తన భర్త సోహన్‌లాల్ నుండి విడిపోవడం గురించి మాట్లాడుతూ, "1965లో నేను నా రెండవ బిడ్డకు జన్మనిచ్చాను.. పుట్టిన ఎనిమిది నెలలకే మరణించింది. ఆ సమయంలో సోహన్‌లాల్ పేరును నా పిల్లలకు పెట్టడానికి నిరాకరించడంతో విడిపోయాము. 1969 చివరిలో అతను తన సహాయకురాలిగా ఉండాలని నన్ను మళ్లీ సంప్రదించాడు. అతను గుండెపోటుతో బాధపడుతున్నప్పుడు నేను చూడటానికి వెళ్ళాను. అపుడు అతడితో గడిపాను. నేను నా కుమార్తె కుకుకు జన్మనిచ్చాను. ఆ తర్వాత నా జీవితం నుంచి పూర్తిగా కనుమరుగై మద్రాసులో స్థిరపడ్డాడు.
రెండో పెళ్లితో సంతోషం:
ఆ తర్వాత సరోజ్ ఖాన్ కథ మారిపోయింది. సర్దార్ రోషన్ ఖాన్ అనే వ్యాపారవేత్తతో సరోజ్ స్థిరపడింది. అతనిని వివాహం చేసుకుంది. అతడిని పెళ్లి చేసుకోవడానికి ఆమె కూడా ఇస్లాం మతంలోకి మారిపోయింది. తన రెండవ వివాహం గురించి కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మాట్లాడుతూ,-"నేను పఠాన్ సర్దార్ రోషన్ ఖాన్ అనే వ్యాపారవేత్తను కలిశాను. అతడు నా పిల్లలను అంగీకరించి నన్ను వివాహం చేసుకున్నాడు. అతడు నాతో ఘాఢమైన ప్రేమలో పడ్డాడు. అతడు నా పిల్లలను అంగీకరించి, సోహన్‌లాల్‌లా కాకుండా తన పేరును వారికి పెట్టడానికి సిద్ధమయ్యాడు. కాబట్టి నేను అతనిని 1975లో వివాహం చేసుకున్నాను. అతను దేవుడిచ్చిన వరమని తేలింది. ఈ రోజు వరకు నా నిర్ణయానికి నేను చింతించలేదు... అని తెలిపింది.
బాలీవుడ్ లో 2000 పాటలకు కొరియోగ్రఫీని అందించిన గొప్ప రికార్డ్ సరోజ్ ఖాన్ కి ఉంది. హవా హవాయి, ఏక్ దో తీన్ .. చోలీ కే పీచే క్యా హై వంటి చార్ట్-బస్టర్ సాంగ్స్ సరోజ్ కెరీర్ లో ఉన్నాయి. ఎన్నో సంచలన విజయాలు సాధించిన చిత్రాలకు ఆమె కొరియోగ్రఫీ అందించారు.