రాజకీయాల్లోకి కట్టప్ప కుమార్తె దివ్య
తమిళనాడులో రాజకీయాల్ని, సినిమాల్ని విడివిడిగా చూడలేం. ఈ రెండు రంగాలకు అవినాభావ సంబంధం ఉంది.
By: Tupaki Desk | 19 Jan 2025 11:30 AM GMTతమిళనాడులో రాజకీయాల్ని, సినిమాల్ని విడివిడిగా చూడలేం. ఈ రెండు రంగాలకు అవినాభావ సంబంధం ఉంది. సినీతారలే అక్కడ దశాబ్ధాల పాటు రాజకీయాల్ని ఏలారు. ఇటీవల కమల్ హాసన్, రజనీకాంత్ వంటి వారి పప్పులు ఉడకలేదు కానీ, అంతకుముందు కరుణానిధి, జయలలిత వంటి సినీప్రముఖులు తమిళనాడును ముఖ్యమంత్రులుగా ఏలారు. విజయ్ కాంత్ తనకంటూ రాజకీయాల్లో ఒక ఒరవడిని సృష్టించుకోగలిగారు. యువహీరో ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా హవా సాగిస్తున్నారు.
తాజా సమాచారం మేరకు.. ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య రాజకీయారంగేట్రం చేస్తుండడం చర్చనీయాంశమైంది. బాహుబలిలో కట్టప్పగా సుప్రసిద్ధుడైన సత్యరాజ్ తొలి నుంచి ద్రవిడ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు ఆయన కుమార్తె దివ్య డిఎంకె పార్టీలో చేరడం సర్వత్రా ఆసక్తిని కలిగించింది.
నటుడు సత్యరాజ్ కుమార్తె , పోషకాహార నిపుణురాలు దివ్య సత్యరాజ్ పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో డిఎంకె అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ను కలిసి ఆదివారం అధికారికంగా డిఎంకెలో చేరారు. డిఎంకే పార్టీ కోశాధికారి టిఆర్ బాలు ఎంపి, ప్రధాన కార్యదర్శి కెఎన్ నెహ్రూ, చెన్నై తూర్పు జిల్లా కార్యదర్శి మరియు మంత్రి పికె శేఖర్ బాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.