'జీబ్రా' - అలా జరక్కూడదంటూ.. సత్యదేవ్ స్పెషల్ రిక్వెస్ట్
దయచేసి ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూసి, మా కృషికి మీ ఆమోదం అందించండి.. అని ఆయన వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 26 Nov 2024 4:45 PM GMTటాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన 'జీబ్రా' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి స్పందన పొందింది. ఈ చిత్రానికి మొదటి నుంచి మంచి హైప్ ఉండగా, థియేటర్‌లో విడుదలైన తర్వాత ఆ అంచనాలను అందుకుంది. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ను చూసి సత్యదేవ్ ఎంతో ఆనందంతో ఓ ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు.
''ఇది మీ అందరి ప్రేమ విజయం'' అని సత్యదేవ్ తన సందేశంలో పేర్కొన్నారు. ''ఇలాంటి హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూశాను. నా సినిమా మీ అందరికీ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను హిట్ కొడితే మీరంతా ఆనందంగా ఉంటారు. అదే నాకు ముఖ్యమైంది. 'బ్లఫ్ మాస్టర్' సినిమాని థియేటర్‌లో చూడలేకపోయిన ప్రేక్షకులు ఆ తర్వాత ఓటీటీలో చూసి ఎంతో ఆదరించారు. కానీ 'జీబ్రా' విషయంలో అలా జరగకూడదని కోరుకుంటున్నా.
దయచేసి ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూసి, మా కృషికి మీ ఆమోదం అందించండి.. అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఈ సినిమా బ్యాంకింగ్ మోసాల నేపథ్యంతో రూపొందడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో వచ్చిన జీబ్రా సినిమాలో కథ, స్క్రీన్‌ప్లేకు ప్రధాన ప్రాధాన్యత ఇచ్చారు. నిర్మాతలు ఎస్ఎన్ రెడ్డి, బాల సుందరం, దినేశ్ సుందరం ఈ చిత్రాన్ని ఎంతో కష్టపడి నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో ఈ చిత్రానికి ప్రధాన కథానాయికలుగా అలరించారు.
సక్సెస్ మీట్‌లో సత్యదేవ్ మాట్లాడుతూ, ''ఈ సినిమా ప్రతి సన్నివేశంలో ఒక లాజిక్ ఉంది. ఈ చిత్రం నా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైనది. చిరంజీవి గారు నాకు ఈ చిత్రం గురించి చెప్పినప్పుడు నాకు ఎంతో ప్రోత్సాహం లభించింది. ఈ విజయానికి కారణం మీరు అందరికీ మాత్రమే'' అని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా జీబ్రా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న విషయం తెలిసిందే.
ఇక 'జీబ్రా' లో టెక్నికల్ టీమ్ పనితీరు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు, విజువల్స్ కూడా ప్రేక్షకుల మన్నన పొందాయి. సత్యదేవ్ నటనకు ప్రేక్షకులు పాజిటివ్ కామెంట్స్ ఇస్తుండగా, ఈ చిత్రంలోని కథనానికి సంబంధించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. మొత్తానికి, 'జీబ్రా' సినిమా ప్రేక్షకుల ఆశలను అందుకొని బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిందని మేకర్స్ చెబుతున్నారు. ''మా చిత్రం మీ ఆదరణతో మరింత ముందుకు వెళ్తుంది'' అంటూ సత్యదేవ్ తెలుగు ప్రేక్షకుల ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ప్రకటించారు.