మూవీ రివ్యూ : సత్యభామ
స్టార్ హీరోయిన్లందరూ ఏదో ఒక దశలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం మామూలే. కాజల్ అగర్వాల్ కొంచెం లేటుగా ఈ రూట్లోకి వచ్చింది.
By: Tupaki Desk | 7 Jun 2024 1:38 PM GMT'సత్యభామ' మూవీ రివ్యూ
నటీనటులు: కాజల్ అగర్వాల్-నవీన్ చంద్ర-ప్రకాష్ రాజ్-హర్షవర్ధన్-పాయల్ రాజ్ పుత్-రవివర్మ తదితరులు
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
ఛాయాగ్రహణం: విష్ణు బెసి
నిర్మాతలు: బాబీ తిక్క-శ్రీనివాస్ తక్కలపెల్లి
రచన-దర్శకత్వం: సుమన్ చిక్కాల
స్టార్ హీరోయిన్లందరూ ఏదో ఒక దశలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం మామూలే. కాజల్ అగర్వాల్ కొంచెం లేటుగా ఈ రూట్లోకి వచ్చింది. ఆమె కొన్నేళ్ల కిందట 'సీత' అనే హీరోయిన్ ప్రధాన చిత్రం చేసింది. అదంత మంచి ఫలితాన్నివ్వలేదు. ఇప్పుడు ఆమె 'సత్యభామ' అవతారం ఎత్తింది. కొత్త దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
సత్యభామ (కాజల్ అగర్వాల్) సిన్సియర్ అండ్ టఫ్ పోలీసాఫీసర్. ఏసీబీ అయిన ఆమె 'షి' టీమ్స్ ను నడిపిస్తుంటుంది. ఎలాంటి కరడుగట్టిన నేరస్థుడితో అయిన నిజం చెప్పించే దమ్మున్న ఆఫీసర్ గా పేరున్న సత్యభామకు.. హసీనా అనే అమ్మాయి గృహ హింస కేసు సవాలుగా మారుతుంది. హసీనా తన భర్త చేతుల్లో చేతుల్లో ప్రాణాలు విడువగా.. హంతకుడిని సత్యభామ పట్టుకోలేకపోతుంది. ఈ కేసు తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తూ సత్యభామను కుదురుగా ఉండనివ్వదు. ఇంతలో హసీనా తమ్ముడు కనిపించకుండా పోతాడు. అతనేమయ్యాడో తెలుసుకునే ప్రయత్నంలో హసీనా కేసు అనేక మలుపులు తిరుగుతుంది. ఇంతకీ ఆమె హంతకుడు ఏమయ్యాడు.. ఇక్బాల్ సంగతేంటి? ఈ కేసులో చివరికి తెలిసిన సంచలన విషయాలేంటి? ఈ ప్రశ్నలకు తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
ఒక కథలో ఎన్నో మలుపులుండొచ్చు. ఎన్నెన్నో లేయర్లుండొచ్చు. క్యారెక్టరైజేషన్ల మీద చాలా కసరత్తు చేసి ఉండొచ్చు. కానీ ఏం చేసినా.. ఎంత కష్టపడినా.. తెరపైన ఆసక్తికరంగా.. అర్థమయ్యేలా ఆ కథను చెప్పడం చాలా కీలకం. 'సత్యభామ' సినిమాలో అదే జరగలేదు. రైటర్ కమ్ డైరెక్టర్ సుమన్ చిక్కాల.. ప్రేక్షకుల అంచనాలను దాటి.. వాళ్ల బుర్రలకు పరీక్ష పెట్టేలా ఒక కథను చెప్పాలనుకున్నాడు. అందుకోసం అతను ఎంతో కసరత్తు చేసిన విషయం తెరపై కనిపిస్తుంది. కానీ ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం వరకు ఓకే కానీ.. వాళ్లను కన్విన్స్ చేసేలా.. అర్థమయ్యేలా కథను చెప్పడంలో మాత్రం అతను విఫలమయ్యాడు. స్క్రిప్టులో ఎన్నో లేయర్లున్నట్లుగా.. కథలో ఏదేదో జరిగిపోతున్నట్లు బిల్డప్ అయితే కనిపిస్తుంది. కానీ చివరికి చూస్తే అసలేం చెప్పాలనుకున్నారు ఈ కథతో.. అనే ప్రశ్న ఉదయిస్తుంది. 'సత్యభామ'ను బ్యాడ్ మూవీ అని చెప్పలేం. అదే సమయంలో ఉండాల్సింత ఆసక్తికరంగానూ ఈ చిత్రం లేదు. కేవలం థ్రిల్లర్ చిత్రాల ప్రియులకు మాత్రం 'సత్యభామ' ఒక మోస్తరుగా అనిపించవచ్చు.
ఒక నేరానికి సంబంధించిన పరిశోధనలో తీగ లాగుతూ వెళ్తే.. ఆ తీగ ఎక్కడెక్కడికో వెళ్లి.. ప్రేక్షకుడి అంచనాలకు భిన్నమైన ఒక చోట తేలడం.. చివరికి నేరం చేసింది ఇతనా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోవడం.. ఈ తరహాలోనే ఉంటాయి క్రైమ్ థ్రిల్లర్లు చాలా వరకు. 'సత్యభామ'లో నేరం చేసిందెవరు అన్నది మొదట్లోనే తెలిసిపోతుంది. కానీ ఆ నేరస్థుడు ఏమయ్యాడు.. అతడి కథ ఎలా ముగిసింది అన్నదాని మీదే ఈ కథ నడుస్తుంది. ఐతే ఈ కథను ఆసక్తికరంగా మొదలుపెట్టి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ తీసుకురాగలిగారు కానీ.. ఆ తర్వాత ఎక్కడా కథ కుదురుగా నడవదు. టెర్రరిజం.. గేమింగ్.. పాలిటిక్స్.. ఉమన్ ట్రాఫికింగ్.. అంటూ చాలా విషయాలు చూపిస్తారు.. ఎన్నెన్నో పాత్రలను పరిచయం చేస్తారు.. కథను అనేక మలుపులు తిప్పుతారు. కానీ ఏం చేసినా.. ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా కథనం నడవడమే కీలకం. కానీ అదే జరగలేదు. తెర మీద అసలేం జరుగుతోందో.. ఏ పాత్ర ఎందుకొస్తోందో.. ఆ చిక్కుముడులేంటో అర్థం కాని అయోమయం ప్రేక్షకుల బుర్రలను కమ్మేస్తుంది. ఏ పాత్ర ఏంటో అర్థం కాని గందరగోళం ఒక దశ దాటాక అసహనంగా మారుతుంది. కొన్ని సీన్లు థ్రిల్లింగా అనిపించినా.. అసలు ఈ కథ ఎటు పోతోందో అర్థం కాకపోవడమే అతి పెద్ద సమస్యగా మారుతుంది.
ఇందులో వర్చువల్ గేమింగ్ కాన్సెప్ట్ చుట్టూ కొన్ని కీలకమైన సన్నివేశాలు నడిపించారు. అసలే ఉద్దేశంతో ఈ సీన్లు పెట్టారో ఏమో కానీ.. గేమింగ్ మీద ఐడియా ఉన్న వాళ్లకైనా అవి అర్థం అవుతాయా అన్నది సందేహం. కొత్తదనం కోరుకునే.. థ్రిల్లర్ సినిమాలకు బాగా అలవాటు పడ్డ ప్రేక్షకులను సైతం ఈ సన్నివేశాలు ఎంగేజ్ చేయడం కష్టమే. దర్శకుడు ఇక్కడ మరీ ఎక్కువ ఇంటలిజెన్స్ చూపించేయడమే అందుకు కారణం. చివరికి చూస్తే కథలో ఇవేమంత ప్రాధాన్యమున్నట్లుగా అనిపించవు. సినిమాలో విలన్ కాని విలన్ ఎవరు అనే విషయంలో చివరికి సస్పెన్స్ వీడినపుడు కొంత ఆశ్చర్యపోతాం కానీ.. అతడి లక్ష్యమేంటి అన్నది చూశాక.. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో హీరోయిన్ అండ్ కో ఎంతో కష్టపడి నిగ్గు తేల్చింది ఇదా అన్న నిట్టూర్పు తప్పదు. అందరినీ ఏమార్చడానికి ఆ పాత్ర వేసిన ప్లాన్లో ఔచిత్యం ఏంటో అర్థం కాదు. ఇక కాజల్ చేసిన లీడ్ క్యారెక్టర్ ను తీర్చిదిద్దిన విధానం కూడా నిరాశపరుస్తుంది. ఆమెకు అప్పుడప్పుడూ పెద్ద బిల్డప్ ఇచ్చి ఒక యాక్షన్ సీక్వెన్స్ పెట్టడం తప్ప.. ఆమె ఈ కథలో పెద్దగా సాధించిందేమీ కనిపించదు. మొదట్నుంచి ఒక సస్పెన్స్ మెయింటైన్ చేయడం వల్ల.. కథ అనేకానేక మలుపులు తిరగడం వల్ల.. తర్వాత ఏంటి అనే ప్రశ్నల వల్ల ప్రేక్షకులు ఆసక్తితోనే సినిమా చూస్తారు కానీ.. చివరికి కథ ముగిసిన తీరు చూశాక ఈ సినిమా పర్పస్ ఏంటనే ప్రశ్న తలెత్తి అసంతృప్తే అలుముకుంటుంది.
నటీనటులు:
గ్లామర్ హీరోయిన్ గా ముద్రపడ్డ కాజల్ అగర్వాల్.. ఈ చిత్రంలో రఫ్ క్యారెక్టర్ తో కొత్తగా కనిపిస్తుంది. తనను ఇలాంటి పాత్రలో చూసి అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. ఇమేజ్ మేకోవర్ తరహా పాత్రలో మెప్పించడానికి కాజల్ బాగానే కష్టపడింది. తన పెర్ఫామెన్స్ ఓకే కానీ.. తన పాత్ర మాత్రం సంతృప్తికరంగా అనిపించదు. ఫక్తు థ్రిల్లర్ సినిమాలో ఆమె పాత్రకు 'కర్తవ్యం' విజయశాంతిలా బిల్డప్ సీన్లు పెట్టడం నాన్ సింక్ అనిపిస్తుంది. ఇక కాజల్ భర్త పాత్రలో చేసిన నవీన్ చంద్రది మరీ నామమాత్రమైన పాత్ర. తన మార్కు చూపించే అవకాశమే లేదు ఇందులో. ఇక్బాల్ అనే కీలక పాత్రలో చేసిన నటుడు రాణించాడు. అలాగే రిషి క్యారెక్టర్ చేసిన కుర్రాడు.. హసీనా-దివ్య అనే ఇద్దరు అమ్మాయిల పాత్రల్లో కనిపించిన ఆర్టిస్టులు బాగానే చేశారు. ప్రకాష్ రాజ్ ప్రత్యేకత ఏమీ కనిపించదు. హర్షవర్ధన్ బాగానే చేశాడు. మిగతా ఆర్టిస్టులందరూ ఓకే.
సాంకేతిక వర్గం:
థ్రిల్లర్ సినిమాల స్పెషలిస్ట్ అయిన శ్రీ చరణ్ పాకాల తన డ్యూటీ తాను బాగానే చేశాడు. రేసీగా అనిపించే బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. విష్ణు బెసి ఛాయాగ్రహణం కూడా బాగానే సాగింది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి. తనే స్క్రిప్టు కూడా రాసుకున్న డెబ్యూ డైరెక్టర్ సుమన్ చిక్కాల ఈ కథ కోసం చాలా కష్టపడ్డాడని అర్థమవుతుంది. కానీ ఆ కథను ఆసక్తికరంగా తెరపై ప్రెజెంట్ చేయడంలో మాత్రం అతను పూర్తి స్థాయిలో విజయవంతం కాలేకపోయాడు. కథ.. పాత్రలను అతను కన్విన్సింగ్ గా రాసుకోలేకపోయాడు. స్క్రీన్ ప్లే రేసీగా అనిపించినా.. ప్రేక్షకులను అనుకున్నంత స్థాయిలో ఎంగేజ్ చేయలేకపోయింది.
చివరగా: సత్యభామ.. గజిబిజి థ్రిల్లర్
రేటింగ్- 2.25/5