Begin typing your search above and press return to search.

సత్యభామ.. కిల్లర్ వేటలో కాజల్ అరాచకం

ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం "సత్యభామ"లో కాజల్ మొదటిసారి యాక్షన్ క్వీన్‌గా కనిపించబోతోంది.

By:  Tupaki Desk   |   24 May 2024 3:06 PM GMT
సత్యభామ.. కిల్లర్ వేటలో కాజల్ అరాచకం
X

ఎక్కువగా కమర్షియల్ మూవీస్‌లో రెగ్యులర్ హీరోయిన్ పాత్రల్లో మెప్పించిన కాజల్ అగర్వాల్, ఈమధ్య మాత్రం సరికొత్త తరహా సినిమాలు చేసే విధంగా అడుగులు వేస్తోంది. పెళ్లి అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు తన ప్రతిభను కొత్త రేంజ్‌కి తీసుకెళ్లేందుకు సిద్దమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం "సత్యభామ"లో కాజల్ మొదటిసారి యాక్షన్ క్వీన్‌గా కనిపించబోతోంది.

ఇక ఈ సినిమా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఒక ట్రైలర్ విడుదల చేశారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి, శశికిరణ్ తిక్కా స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సంగీతం శ్రీచరణ్ పాకాల అందిస్తున్నారు. విడుదలైన ట్రైలర్ లో, కాజల్ అగర్వాల్ ఏసీపీ సత్యభామ పాత్రలో దూకుడుగా కనిపిస్తోంది.

తన కళ్ళముందే ప్రాణాలు కోల్పోయిన ఒక అమ్మాయి హత్య కేసుని ఇన్వెస్టిగేట్ చేసే సత్యభామ, ఉన్నతాధికారులు ఆ కేసు నుంచి ఆమెను తప్పించినప్పటికీ, సత్యభామ ఆ కేసును చేధించడానికై తన స్వంత ప్రయత్నాలను ప్రారంభిస్తుంది. కాజల్ అగర్వాల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించిన విధానం అద్భుతంగా ఉంది. ఆమె బాడీ లాంగ్వేజ్, స్టైల్, యాక్షన్ సన్నివేశాల్లో తన ప్రతిభను పూర్తిగా చూపించింది.

ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సన్నివేశాలకు బలం చేకూర్చింది. ప్రకాష్ రాజ్ కూడా సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఇచ్చిన గడువు ముగుస్తు ఉండడంతో కాజల్ బాద్యతగా కిల్లర్ అన్వేషణను ఏమాత్రం ఆపదు. ఈ క్రమంలో ఆమెకు ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్న విధానం ట్రైలర్ లో హైలెట్ గా నిలిచింది. అలాగే ఆమె యాక్షన్ డోస్ కూడా ఈసారి గట్టిగానే ఉండనున్నట్లు అర్ధమవుతుంది.

శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని, శశికిరణ్ తిక్కా సమర్పిస్తున్నారు. "సత్యభామ" పూర్తిగా ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ కమర్షియల్ థ్రిల్లర్‌గా రూపొందించబడింది. ఈ సినిమా కాజల్ అగర్వాల్ ఇమేజ్‌ని మారుస్తుందని ట్రైలర్ ద్వారా అనిపిస్తుంది. సీనియర్ హీరోయిన్‌గా మారిన కాజల్‌కి "సత్యభామ" బ్రేక్ ఇస్తే, ఆమె యాక్షన్ హీరోయిన్‌గా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ సినిమాను జూన్ 7 న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అలాగే బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ సరికొత్త యాక్షన్ పాత్ర ద్వారా కాజల్ తన కెరీర్‌లో మరో మైలురాయి చేరుకోవడానికి సిద్దమవుతోంది. ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, ఆమె తన నటనా ప్రతిభను కొత్త కోణంలో ఎలా చూపిస్తుందో చూడాలి.