Begin typing your search above and press return to search.

రెండు రోజుల తరువాతే రివ్యూలు.. ఎందుకంటే: సత్యదేవ్

టాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు. సత్యదేవ్.

By:  Tupaki Desk   |   11 Nov 2024 9:17 AM GMT
రెండు రోజుల తరువాతే రివ్యూలు.. ఎందుకంటే: సత్యదేవ్
X

టాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు. సత్యదేవ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన సత్యదేవ్ ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో హీరోగా మారాడు. ఆ సినిమా తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేశాడు. అలాగే ప్రతినాయక పాత్రలు కూడా చేసి మెప్పించాడు. క్యారెక్టర్ ఏదైనా దానికి పూర్తిస్థాయిలో న్యాయం చేయడంతో పాటు తనదైన శైలిలో ఆ పాత్రకి వన్నె తేవడం సత్యదేవ్ ప్రత్యేకత.

అందుకే అతనికి టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అయితే హీరోగా సత్యదేవ్ కి ఆశించిన స్థాయిలో సక్సెస్ లు లేవు. 2018లో చేసిన ‘బ్లఫ్ మాస్టర్’ సత్యదేవ్ కి మంచి ఇమేజ్ తీసుకొచ్చింది. అయితే ఈ మూవీ కమర్షియల్ గా సక్సెస్ ను అందుకోలేదు. సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ కి విమర్శకుల ప్రశంసలు లభించాయి. తరువాత ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయ్యి విజయం అందుకుంది. ‘గువ్వా గోరింకా’, ‘తిమ్మరుసు’, ‘స్కైల్యాబ్’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘కృష్ణమ్మ’ లాంటి సినిమాలలో హీరోగా సత్యదేవ్ నటించాడు.

వీటిలో ఏది హిట్ కాలేదు. అయితే ‘గాడ్ ఫాదర్’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి ప్రతినాయకుడిగా సత్యదేవ్ నటించి మెప్పించాడు. సత్య దేవ్ నటించిన ‘జీబ్రా’ అనే మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకి వస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో సత్యదేవ్ బిజీగా ఉన్నారు. దీంతో సక్సెస్ అందుకోవాలని కసితో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సత్యదేవ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చిన్న సినిమాలకి విడుదలైన రెండు రోజుల తర్వాత రివ్యూలు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని తెలియజేశారు. సినిమాలకి రివ్యూలు ఇవ్వడం ఒక భాగమని, అయితే రెండు రోజుల తర్వాత రివ్యూలు ఇవ్వడం వలన కొంత వరకు మూవీకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. చాలా మంది రివ్యూలు చూసి సినిమాలకి వెళ్ళాలా… వద్దా అని నిర్ణయించుకుంటున్నారని తెలిపారు.

సినిమా రిలీజ్ రోజే నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం వలన చిన్న సినిమాలు బాగా నష్టపోతున్నాయని తెలిపారు. సత్యదేవ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే మరోవైపు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ‘జీబ్రా’ మూవీ త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో రివ్యూలపై సత్యదేవ్ చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరి ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.