అన్నదమ్ముల మద్దతకు ఆ హీరోకి లేనట్లే!
సామాజిక మార్పే లక్ష్యంగా పార్టీ స్థాపించి ప్రజా క్షేత్రంలో కి వస్తున్నట్లు ప్రకటించారు.
By: Tupaki Desk | 8 Nov 2024 10:24 AM GMTతలపతి విజయ్ 2026 ఎన్నికల్లో బరిలోకి దిగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళగ వెట్రి కజగం పార్టీని స్థాపించి ప్రజల్లోకి తీసుకెళ్లే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇటీవలే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అభిమానులకు పిలుపునిచ్చారు. తమ పార్టీ విధి విధానాలను ప్రేక్షకాభిమానుల్లోకి తీసుకెళ్లారు. సామాజిక మార్పే లక్ష్యంగా పార్టీ స్థాపించి ప్రజా క్షేత్రంలో కి వస్తున్నట్లు ప్రకటించారు.
తాజాగా విజయ్ ఎంట్రీ పై సూపర్ స్టార్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఓ మీడియా సమావేశంలో సత్యనారాయణ ఇలా మాట్లాడారు. ` అతన్ని రానివ్వండి. గతంలో `మక్కల్ నీది మయ్యం` పార్టీతో కమల్ హాస్ కూడా వచ్చాడు. అలాగే విజయ్ ని కూడా ప్రయత్నించనివ్వండి. కానీ విజయ్ ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదు. అతడు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆయనకు రాజకీయ ఆశయాలున్నాయి.
అందుకే ఈ రంగంలోకి దిగాడు. కానీ అతడు ఇప్పుడేం చేస్తాడో నాకైతే కచ్చితంగా తెలియదు. విజయ్ గెలవడని అయితే బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే అది చాలా కష్టమైన పని. ప్రజల మనసు గెలవడం అంత సులభం కాదు. నాయకులు ప్రజల్లో తిరగాలి. వారి సమస్యలను తెలుసుకోవాలి. ఆ సమస్యలపై అధికార పార్టీతో పోరాటం చేయాలి. వాటిని పరిష్కరించాలి. మరి ఇవన్నీ విజయ్ చేసాడో? లేదో? అందరికీ తెలిసిందే` అని అన్నారు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. కొన్ని రోజుల క్రితం విజయ్ తీరుపై సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అధికార పార్టీని విమర్శించే క్రమంలో భాగంగా విజయ్ దూకుడు తీరును ఆయన తప్పు బట్టారు. రాజకీయాల్లో హుందాగా ప్రవర్తించాలని..కానీ విజయ్ లో అదెక్కడా కనిపిచంలేదని వ్యాఖ్యానించారు. దీంతో రజనీకాంత్ మద్దతు విజయ్ పార్టీకి లేదని అప్పుడే తేలిపోయింది. తాజాగా ఆయన సోరదుడు కూడా విజయ్ గెలవడని ముందే జోస్యం చెప్పడం ఆశ్చర్యకరం.