Begin typing your search above and press return to search.

పుష్ప 2 సీక్రెట్ లీక్ చేసిన బ్రహ్మాజీ

ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ప్రముఖ నటుడు బ్రహ్మాజీ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   17 Oct 2024 6:47 AM GMT
పుష్ప 2 సీక్రెట్ లీక్ చేసిన బ్రహ్మాజీ
X

భారతదేశంలో ఇప్పుడు ఎన్నో భారీ చిత్రాలు రూపొందుతోన్నాయి. అందులో ఎక్కువ శాతం టాలీవుడ్‌లోనే తెరకెక్కుతోన్నాయి. అలా ఇప్పుడు పట్టాలపై ఉన్న హై రేంజ్ సినిమాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప ది రూల్’ ఒకటి. సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా గతంలో వచ్చి పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ అయిన ‘పుష్ప ది రైజ్’కు కొనసాగింపుగా రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ‘పుష్ప ది రూల్’ సినిమాను గత ఆగస్టు 15వ తేదీనే విడుదల చేయాలని నిర్మాతలు అనుకున్నారు. కానీ, మూవీ షూటింగ్‌ అప్పటికి పూర్తి అవకపోవడంతో దీన్ని డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసుకున్నారు. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా చిత్రీకరణ జరుపుతున్నారు. ఇలా ఇప్పటికే దాదాపుగా టాకీ పార్టును సైతం పూర్తి చేసుకున్నారు.

‘పుష్ప ది రూల్’ విడుదలకు సమయం ఆసన్నం అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ చివరి షెడ్యూల్‌ను వేగంగా జరుపుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ప్రముఖ నటుడు బ్రహ్మాజీ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసుకున్నాడు. ఈ పోస్టులో బ్రహ్మాజీ ‘‘పుష్ప ది రూల్’ సినిమా షూటింగ్ పూర్తి అయిపోయింది’ అంటూ చెప్పుకొచ్చాడు.

బ్రహ్మాజీ తాజాగా షేర్ చేసిన వీడియోలో షూటింగ్ సెట్స్‌లో తీసుకున్న కొన్ని ఫొటోలను పొందుపరిచాడు. ఇందులో ‘పుష్ప ది రూల్’ సినిమాలో నటిస్తోన్న చాలా మంది నటీనటులు, తెర వెనుక పని చేస్తున్న కొందరు టెక్నీషియన్లు కూడా కనిపించారు. కానీ, అందరిలో ఒక్క నటుడు మాత్రం బాగా హైలైట్ అవుతున్నాడు. అతడే బాలీవుడ్ ఫేమస్ యాక్టర్ సౌరభ్ సచ్‌దేవ.

గతంలో బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించిన సౌరభ్ సచ్‌దేవ.. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ చిత్రంలో అబిద్ హక్ అనే పాత్రను పోషించాడు. ఈ రోల్ సినిమాలో ఎంతో హైలైట్ అయిన విషయం తెలిసిందే. అలాంటి నటుడు ఇప్పుడు ‘పుష్ప ది రూల్’లో నటిస్తున్నాడని తెలియడంతో బన్నీ ఫ్యాన్స్ అతడి రోల్‌పై అంచనాలు పెంచేసుకుంటున్నారు.

ఇక, ‘పుష్ప ది రూల్’ సినిమా షూటింగ్ పూర్తి అయిందంటూ నటుడు బ్రహ్మాజీ చేసిన పోస్టుతో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అదే సమయంలో అనసూయ, టబు వంటి వారితో పాటు చాలా మంది ప్రముఖులు దీనికి కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి బ్రహ్మాజీ ఇచ్చిన అప్‌డేట్ సౌరభ్ సచ్‌దేవ గురించి లీక్ కూడా చేసింది.