Begin typing your search above and press return to search.

'సేవ్ ద టైగర్స్-2' వెబ్ సిరీస్ రివ్యూ

By:  Tupaki Desk   |   16 March 2024 3:16 PM GMT
సేవ్ ద టైగర్స్-2 వెబ్ సిరీస్ రివ్యూ
X

'సేవ్ ద టైగర్స్-2' వెబ్ సిరీస్ రివ్యూ

నటీనటులు: ప్రియదర్శి- అభినవ్ గోమఠం- చైతన్యకృష్ణ- పావని గంగిరెడ్డి-జోర్దార్ సుజాత-దేవయాని శర్మ-సీరత్ కపూర్-వేణు వెల్దండి- సత్య కృష్ణన్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు.

సంగీతం: అజయ్ అరసాడ

ఛాయాగ్రహణం: ఎస్. వి.విశ్వేశ్వర్

రచన- ప్రదీప్ అద్వైతం-విజయ్ నమోజు-ఆనంద్ కార్తీక్

నిర్మాతలు: మహి వి రాఘవ్- చిన్న వాసుదేవరెడ్డి

దర్శకత్వం: అరుణ్ కొత్తపల్లి

తెలుగు వెబ్ సిరీసుల్లో 'సేవ్ ద టైగర్స్'ది ప్రత్యేక స్థానం. తెలుగు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసిన ఒరిజినల్ సిరీస్ ఇది. ఇప్పుడు సెకండ్ సీజన్ తో ప్రేక్ష్రకుల ముందుకు వచ్చిన 'సేవ్ ద టైగర్స్' అంచనాలను అందుకుందా.. మరోసారి నవ్వించిందా.. తెలుసుకుందాం పదండి.

కథ: హైదరాబాద్ బోరబండలో పాల వ్యాపారం చేసే ఘంటా రవి (ప్రియదర్శి).. అదే సిటీలో ఒక యాడ్ ఏజెన్సీలో ఫిలిం మేకర్ అయిన విక్రమ్ (కృష్ణచైతన్య).. ఉద్యోగం మానేసి రైటర్ అవుదామని ప్రయత్నిస్తున్న రాహుల్ (అభినవ్ గోమఠం) అనుకోకుండా స్నేహితులుగా మారతారు. ఈ ముగ్గురూ తమ భార్యలతో పడలేక కలిసినపుడల్లా వాళ్ల గురించే మాట్లాడుతూ చిల్ అవుతుంటారు. మరోవైపు ఈ ముగ్గురి భార్యలు కూడా అనుకోకుండా ఒక చోట కలిసి స్నేహితులుగా మారతారు. వాళ్ల మధ్య కూడా ఎప్పుడూ భర్తలతో ఎదురయ్యే సమస్యల గురించే చర్చ. ఈ మూడు జంటలకు వారి వారి వ్యక్తిగత.. వృత్తిగత జీవితాల్లో ఎదురయ్యే ఇబ్బందులు.. వాటిని ఎలా పరిష్కరించుకున్నారనే క్రమంలో నడిచే కథ ఇది.

కథనం-విశ్లేషణ: న‌వ‌ర‌సాల్లో అత్యంత క‌ష్ట‌మైన ర‌సం కామెడీనే అంటారు. కామెడీ రాయ‌డం.. పండించ‌డం అంత సులువైన వ్య‌వ‌హారం కాదు. అందులోనూ జ‌బ‌ర్ద‌స్త్ లాంటి కామెడీ షోల పుణ్య‌మా అని సినిమాల్లో న‌వ్వులు పండించ‌డం మ‌రీ క‌ష్ట‌మైపోయింది. టీవీ షోల పోటీని త‌ట్టుకుని.. అక్క‌డి వినోదానికి భిన్నంగా ఎంట‌ర్టైన్మెంట్ అందించి ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించడం స‌వాలుగా మారిపోయింది. ఇలాంటి త‌రుణంలో అరుదుగా కొన్ని సినిమాలు వెబ్ సిరీస్ లు క్లీన్ కామెడీతో ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తున్నాయి. సేవ్ ద టైగ‌ర్స్ ఆ కోవ‌కు చెందిన‌దే. ఇది కామెడీ వెబ్ సిరీసే కానీ.. అదేమీ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వించ‌దు. కానీ సిరీస్ చూస్తున్నంత‌సేపు పెదాల‌పై చిరున‌వ్వు మాత్రం చెర‌గ‌దు. మ‌న చుట్టూ క‌నిపించే మ‌నుషుల‌నే పాత్ర‌ధారులుగా మార్చి వాళ్ల మ‌ధ్య సంభాష‌ణ‌ల్లో సిచువేష‌న‌ల్ కామెడీ పండించి మెప్పించింది సేవ్ ద టైగ‌ర్స్ టీం. తొలి సీజ‌న్ త‌ర‌హాలోనే ఏడు ఎపిసోడ్ల పాటు ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా వినోదాన్ని పంచ‌డంలో.. కొంత‌మేర భావోద్వేగాల‌నూ పండించ‌డంలో ఈ టీం విజ‌య‌వంత‌మైంది.

సేవ్ ద టైగ‌ర్స్-2 ఒక ప్రాప‌ర్ సీక్వెల్. తొలి భాగంలో ఒక కీల‌క మ‌లుపు ద‌గ్గ‌ర‌ అర్ధంత‌రంగా ముగిసిన క‌థ‌ను అక్క‌డ్నుంచే కొన‌సాగించింది టీం. రెండో సీజ‌న్‌కు ద‌ర్శ‌కుడు (ఫ‌స్ట్ సీజ‌న్ డైరెక్ట‌ర్ తేజ కాకుమాను.. రెండో సీజ‌న్ తీసింది అరుణ్ కొత్త‌ప‌ల్లి) మారిన‌ప్ప‌టికీ న‌రేష‌న్ స్టైల్ ఏమీ మారిన‌ట్లు అనిపించ‌దు. అదే లైట్ హార్టెడ్ ఫ‌న్ తో న‌డుస్తుంది ఈ సిరీస్‌. ఏడు ఎపిసోడ్లుగా న‌డిచే ఈ సిరీస్ చాలా వ‌ర‌కు మంచి వేగంతో న‌డుస్తుంది. క‌థ‌లో పెద్ద పెద్ద మ‌లుపులేమీ లేక‌పోయినా.. హ‌డావుడిగా అనిపించ‌క‌పోయినా.. టైంపాస్ వినోదానికి మాత్రం ఢోకా ఉండ‌దు. సినిమా హీరోయిన్ కిడ్నాప్ కేసులో అరెస్ట‌యిన ముగ్గురు ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌ను పోలీసులు త‌మ‌దైన శైలిలో ఇంట‌రాగేట్ చేస్తుంటే.. వాళ్ల భార్య‌లు వ‌చ్చి గొడ‌వ చేయ‌డం.. ఆ త‌ర్వాత తాగిన మ‌త్తులో బ‌ర్రెల దొడ్డిలో ప‌డుకున్న హీరోయిన్ తిరిగించ్చి వాళ్ల‌ను బ‌య‌ట‌ప‌డేయ‌డం.. ఈ క్ర‌మంలో సాగే ఫ‌స్ట్ ఎపిసోడ్ సిరీస్ కు మంచి లాంచ్ ప్యాడ్ లాగా ఉప‌యోగ‌ప‌డింది.

ఆ త‌ర్వాత ముగ్గురు హీరోల జీవితంలో అప్ అండ్ డౌన్స్ కు త‌గ్గ‌ట్లే క‌థ ప‌డుతూ లేస్తూ సాగుతుంది. పెళ్లి వెనుక స్టోరీ అంటూ 10000 బీసీ కాలం నాటి నేప‌థ్యాన్ని తీసుకుని అస‌లు క‌థ‌లోని ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌కే పురాత‌న కాలం నాటి వేషాలేయించి న‌డిపించి ఓ ఎపిసోడ్ మాత్రం పంటికింద రాయిలా అనిపిస్తుంది. కొంత వినోదం పంచినా.. ఆ ఎపిసోడ్ ఈ సిరీస్ లో సింక్ కాలేద‌నిపిస్తుంది. కొన్ని జోకులు పేలినా.. ఈ క‌థ‌కు అది పెద్ద‌గా ప్ర‌యోజ‌నం క‌లిగించ‌లేదు. పైగా పాత్ర‌ధారుల మేక‌ప్ కుదర‌లేదు. వాళ్లు వ‌ర్త‌మానంలోని భాషనే మాట్లాడ్డం వ‌ల్ల కూడా అది అత‌క‌న‌ట్లు అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ మిన‌హాయిస్తే చాలా వ‌ర‌కు సేవ్ ద టైగ‌ర్స్-2 వినోదాన్ని పంచుతుంది. తొలి సీజ‌న్లో మాదిరే ఇందులోనూ వినోదాన్ని పంచే బాధ్య‌త‌ను ప్ర‌ధానంగా అభిన‌వ్ గోమ‌ఠమే తీసుకున్నాడు. త‌న కామెడీ టైమింగ్ ఆ పాత్ర‌కు బాగా ప్ల‌స్ అయింది. ప‌నిమనిషి- అత‌డి నేప‌థ్యంలో వ‌చ్చే సీన్లు ఇందులోనూ పేలాయి. ముఖ్యంగా పెంపుడు జంతువుల గురించి జ‌రిగే గొడ‌వ హైలైట్. ఆ ట్రాక్ అంతా హిలేరియ‌స్ అనిపిస్తుంది.

చైత‌న్య కృష్ణ పాత్ర సీరియ‌స్ కావ‌డం వ‌ల్ల త‌న‌తో ముడిప‌డ్డ సీన్లు ఓ మోస్త‌రుగా అనిపిస్తుందంతే. అలా అని క‌థా గ‌మ‌నానికి అడ్డం ప‌డ‌వు. ఇక ప్రియ‌ద‌ర్శి -జోర్దార్ సుజాత చేసే హంగామా మ‌ళ్లీ మంచి వినోదాన్నే పంచింది. వీరి మీద తీసిన ప్ర‌తి సీన్ ఆస‌క్తి రేకెత్తిస్తుంది. వినోదంతో పాటు ఎమోష‌న్ల‌ను కూడా ఈ జంట బాగా పండించింది. కూతురితో ప్రియ‌ద‌ర్శి సీన్లు హృద్యంగా సాగాయి. ముగింపులోనూ వీరి మీద వ‌చ్చే స‌న్నివేశాలు బాగున్నాయి. సీర‌త్ క‌పూర్ పాత్ర ఓకే అనిపించినా.. ప్రియ‌ద‌ర్శితో త‌న కాంబినేష‌న్ సీన్లు కొంచెం అతిగా అనిపిస్తాయి. త‌న పాత్ర సిరీస్ లో ఒక మెరుపులా అనిపిస్తుంది. ఓవ‌రాల్ గా త‌క్కువ నిడివితో సాగే ఏడు ఎపిసోడ్ల‌లో మాగ్జిమం వినోదాన్ని పంచింది సేవ్ ద టైగ‌ర్స్-2 టీం. లైవ్లీగా.. ఈజీగా రిలేట్ చేసుకోద‌గ్గ‌ట్లు అనిపించే క్యారెక్ట‌ర్లు.. వాటి మ‌ధ్య స‌ర‌దా సంభాష‌ణ‌లు.. సిచువేష‌న‌ల్ కామెడీ ఈ సిరీస్ లో హైలైట్స్. మూడు గంట‌లు టైంపాస్ చేయ‌డానికి ఢోకా లేని సిరీస్ ఇది.మరోసారి కథను మధ్యలో ఆపి ఇంకో సీజన్ కి రెడీగా ఉండమని హింట్ ఇచ్చింది టీమ్.

నటీనటులు: తొలి సీజన్లో వివిధ పాత్రల్లో నటీనటులకు అలవాటు పడటానికి కొంచెం టైం పడుతుంది. రెండో సీజన్ కు వచ్చేసరికి ఆ సమస్య లేదు. ఆల్రెడీ అలవాటైన పాత్రలతో ఈజీగా ట్రావెల్ అవుతాం. బోరబండలో పాల వ్యాపారం చేసే ఘంటా రవి పాత్రలో ప్రియదర్శి మరోసారి మెస్మరైజ్ చేశాడు. ఓవైపు నవ్విస్తూనే.. కొన్ని సన్నివేశాల్లో అతను భావోద్వేగాలను కూడా బాగా పండించాడు. అతడి పక్కన జోర్దార్ సుజాత కూడా చాలా సహజంగా అనిపిస్తుంది. తన పెర్ఫామెన్స్ కూడా చాలా బాగుంది. ఇంటిపట్టున ఉండే భర్తగా అభినవ్ గోమఠం మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. సిరీస్ లో ఎంటర్టైన్మెంట్ బాధ్యత ఎక్కువగా తనే తీసుకున్నాడు. తన కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. తన ఇంటి పనిమనిషి పాత్రలో చేసిన నటి కూాడా నవ్వించింది. కృష్ణ చైతన్య సీరియస్ పాత్రలో కరెక్ట్ మీటర్లో నటించాడు. పావని గంగిరెడ్డి.. దేవయాని తమ పాత్రలకు తగ్గట్లు నటించారు. సత్యకృష్ణన్.. వేణు వెల్దండి.. శ్రీకాంత్ అయ్యంగార్ సహాయ పాత్రల్లో రాణించారు.

సాంకేతిక వర్గం: ఒక కామెడీ వెబ్ సిరీస్ కు అవసరమైన మేర సాంకేతిక.. నిర్మాణ విలువలు కనిపిస్తాయి 'సేవ్ ద టైగర్స్-2'లో. మరీ రిచ్ అనిపించకపోయినా.. ఓకే అనేలా ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. అజయ్ అరసాడ సంగీతం.. ఎస్. వి.విశ్వేశ్వర్ ఛాయాగ్రహణం ఆహ్లాదంగా సాగిపోయాయి. 'సేవ్ ద టైగర్స్' సీజన్-1లాగే.. సీజన్-2లోనూ రచయితలకే అగ్ర తాంబూలం ఇవ్వాలి. స్క్రిప్టులోనే మంచి ఫన్ ఉండడం.. పాత్రలకు తగ్గ నటీనటులు ఉండటం వల్ల కామెడీ బాగా వర్కవుట్ అయింది. ప్రదీప్ అద్వైతం.. విజయ్ నమోజు.. ఆనంద్ కార్తీక్.. ఈ ముగ్గురు రైటర్ల కృషిని అభినందించాలి. సింపుల్ సీన్లు డైలాగులతోనే వీళ్లు బాగా నవ్వించగలిగారు. దర్శకుడు అరుణ్ కొత్తపల్లి టేకింగ్ కూడా ప్లెజెంట్ గా సాగింది. సిరీస్ నీట్ గా తీశాడు.

చివరగా: టైగర్స్.. మళ్లీ నవ్వించారు

రేటింగ్-.2.75/5