హోటల్లో స్టార్ హీరోని చితక్కొట్టిన ఎన్నారై
చాలా కాలం క్రితం ఒక ఎన్నారైపై ప్రముఖ హీరో దాడికి సంబంధించిన కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 31 March 2025 5:47 AMచాలా కాలం క్రితం ఒక ఎన్నారైపై ప్రముఖ హీరో దాడికి సంబంధించిన కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఇప్పుడు కోర్టులో విచారణకు వచ్చింది. ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్.. ఎన్నారై మధ్య ఐదు నక్షత్రాల హోటల్లో పెద్ద గొడవ జరగగా, అది చినికి గాలి వాన అయింది. ఈ ఘటనలో సైఫ్ ని సదరు ఎన్నారై తీవ్రంగా కొట్టారని, ఆ సమయంలో సైఫ్ అతడి స్నేహితుల బృందం సదరు ఎన్నారైపై దాడికి దిగారని వార్తలు వచ్చాయి. ఈ కేసులో నటి అమృతా అరోరా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు.
తాజాగా కోర్టు విచారణలో అమృత సాక్ష్యం చెప్పారు. ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగిన గొడవలో ప్రత్యక్షంగా తాను చూసిన విషయాన్ని ఆమె కోర్టుకు విన్నవించారు. ఆరోజు ఆ ఎన్నారై సెలబ్రిటీలకు కేటాయించిన చోటికి దూకుడుగా దూసుకొచ్చారని, పెద్ద పెద్ద కేకలు వేస్తూ విరుచుకుపడ్డారని, అయితే ఆ సమయంలో సైఫ్ ప్రతిఘటించాడని అమృత కోర్టులో న్యాయమూర్తికి తెలిపింది. ఆ తర్వాత సైఫ్ సారీ చెప్పగా, ఎన్నారై అక్కడి నుంచి వెళ్లాడు. కానీ కాసేపటికి వాష్ రూమ్ లోంచి పెద్ద కేకలు వినిపించాయి. ఆ కేకలు సైఫ్ వి అని కూడా అమృత వాంగ్మూలం ఇచ్చారు.
2012లో ఫైవ్ స్టార్ హోటల్‌లో ఎన్నారై వ్యాపారవేత్త , అతడి మామపై దాడి జరిగిందనేది ప్రధాన ఆరోపణ. అమృత శనివారం కోర్టు ముందు సాక్షిగా హాజరయ్యారు. హోటల్ లో అందరం భోజనం చేసి సరదాగా గడుపుతుండగా ఘటన జరిగింది. ఎన్నారై అక్కడికి వచ్చి దుర్భాషలాడాడు. మా దగ్గరకు అతడు దూకుడుగా చొరబడ్డాడు. చాలా బిగ్గరగా, దుందుడుకు స్వరంతో అరిచాడు. మేం నోరు మూసుకుని మౌనంగా ఉండమని చెప్పాము. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూసి మేమంతా షాక్ అయ్యాము అని ఆమె చెప్పింది.
నటుడు సైఫ్ ఖాన్ వెంటనే లేచి క్షమాపణలు చెప్పాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడని, తర్వాత విందు కొనసాగించారని అమృత చెప్పింది. కొద్దిసేపటికే సైఫ్ ఖాన్ వాష్‌రూమ్‌కి వెళ్లగా అక్కడి నుంచి బిగ్గరగా శబ్దాలు వినిపించాయని, బిగ్గరగా అరిచిన వారిలో సైఫ్ ఉన్నాడని అమృత కోర్టుకు తెలిపారు. కొద్ది సేపటికి ఆ వ్యక్తి తమ ఆవరణలోకి దూసుకొచ్చి సైఫ్ ఖాన్‌ను కొట్టడం చూశామని తెలిపారు. అప్పుడు అందరూ జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీశారు. ఆ వ్యక్తి వారిని దుర్భాషలాడుతూ..భయంకరమైన పరిణామాలు ఉంటాయని బెదిరించాడని అమృత తెలిపారు.
ఈ పార్టీలో సైఫ్ ఖాన్, కరీనా కపూర్, కరిష్మా, మలైకా అరోరా ఖాన్, అమృతా అరోరా సహా మరికొందరు మగ స్నేహితులు ఉన్నారు. హోటల్‌లో ఉన్నప్పుడు ఎన్నారై వ్యాపారవేత్త ఇక్బాల్ శర్మతో పెద్ద గొడవ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సైఫ్ అతడి స్నేహితుల అల్లరి మాటలకు శర్మ నిరసన తెలిపినప్పుడు, సైఫ్ అతడిని బెదిరించి, ముక్కుపై కొట్టగా అది విరిగిపోయిందని అతడు ఆరోపించారు. తనను తన మామను కొట్టారని ఎన్నారై వ్యాపారవేత్త ఆరోపించారు. అయితే ఎన్నారై శర్మ మహిళలపై రెచ్చగొట్టే కామెంట్లు చేసాడని, అసభ్యకరమైన భాషను ఉపయోగించాడని సైఫ్ వాదించాడు. నాటి దాడి కేసులో సైఫ్ , అతడి ఇద్దరు స్నేహితులు - షకీల్ లడక్ - బిలాల్ అమ్రోహి లపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 325 (దాడి) కింద చార్జిషీట్ దాఖలు చేశారు.