తెలుగువారి ఫేవరెట్ నటుడికి ఏమైంది?
తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పరభాషా నటుల్లో షాయాజి షిండే ఒకరు.
By: Tupaki Desk | 14 April 2024 5:29 PM GMTతెలుగు వారికి ఎంతో ఇష్టమైన పరభాషా నటుల్లో షాయాజి షిండే ఒకరు. ఆయన నటన కంటే కూడా టిపికల్‌గా సాగే డైలాగ్ డెలివరీని మన వాళ్లు బాగా ఇష్టపడతారు. మరాఠీ వ్యక్తి అయిన షాయాజీ షిండే తెలుగును కూడా మరాఠీ స్టయిల్లోనే పలుకుతారు. తెలుగులో విలన్ పాత్ర చేసిన తొలి చిత్రం ‘ఠాగూర్’ నుంచి ఆయన డిఫరెంట్ స్టయిల్లో సొంతంగా డబ్బింగ్ చెబుతూ సాగుతున్నారు. ఈ క్రమంలో తెలుగులో ఆయన వందకు పైగా సినిమాల్లో నటించారు. వ్యక్తిగా కూడా మంచి పేరున్న షాయాజీ తీవ్ర అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరాడన్న వార్త ఇటీవల ఆయన అభిమానులను కంగారు పెట్టింది. ఆయనకు గుండెలో బ్లాక్స్ ఏర్పడి ప్రాణాల మీదికి వచ్చిందని.. సర్జరీ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ముంబయిలో ఆయనకు చికిత్స జరిగింది.
చికిత్స అనంతరం కోలుకున్నాక షాయాజీ షిండే అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. అభిమానులు కంగారు పడవద్దని ఆయన ఇన్స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి త్వరలోనే తిరిగి వస్తానని షాయాజీ చెప్పారు. షాయాజీకి ఈ నెల 11న ఛాతీ నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆయన్ని మహారాష్ట్రాలోని సతారాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు గుండెలో బ్లాక్స్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. హార్ట్ సర్జరీ అవసరం లేదని భావించి.. వెంటనే యాంజియోప్లాస్టీ ద్వారా బ్లాక్స్ క్లియర్ చేశారు. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని.. త్వరలోనే డిశ్చార్జీ చేస్తామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. షాయాజీ.. గుడుంబా శంకర్, ఆంధ్రుడు, సూపర్, అతడు, రాఖీ, పోకిరి, దుబాయ్ శీను, నేనింతే, కింగ్, అదుర్స్ లాంటి చిత్రాలతో మన ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.